సంక్రాంతికి సినిమా రావట్లేదు... ఆడియో వస్తోంది...

Tuesday,November 29,2016 - 07:01 by Z_CLU

విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న గురు సినిమాపై మొన్నటివరకు ఓ ప్రచారం హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలకు పోటీగా, వెంకీ కూడా తను నటించిన గురు సినిమాను సంక్రాంతికే ధియేటర్లలోకి తీసుకొస్తాడనేది ఆ పుకారు. కానీ ఇప్పుడా పుకారు నిజం కాదని తేలిపోయింది. సంక్రాంతికి తన సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదు వెంకీ. అయితే సినిమా బదులు, పాటల్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన గురు పాటల్ని, సంక్రాంతి సీజన్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారట.

venkatesh-guru-em1

అయితే దీనికింకా డేట్ ఫిక్స్ చేయలేదు. పైగా, ఈమధ్య పాటల్ని నేరుగా ఇంటర్నెట్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేసే ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో… ఆడియో ఫంక్షన్ పెట్టాలా వద్దా అనే ఆలోచనలో కూడా టీం ఉంది. ఇక సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయాలని అనుకుంటున్నారట. సుధ కొంగర డైరక్ట్ చేస్తున్న గురు సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోకి ఎంటరైంది.