నవంబర్‌ 3న 'గృహం' విడుదల

Wednesday,October 25,2017 - 02:40 by Z_CLU

వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌, ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్‌ బేనర్స్‌పై సిద్ధార్థ్‌, ఆండ్రియా జంటగా రూపొందిన హారర్‌ చిత్రం ‘గృహం’. మిలింద్‌ రావ్‌ దర్శకుడు. ఈ సినిమా నవంబర్‌ 3న విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, సిద్ధార్థ్‌, తమన్‌ ఎస్‌.ఎస్‌, డైరెక్టర్‌ మిలింద్‌ రావ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గిరీష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను లాంచ్ చేశారు. నేచురల్‌ స్టార్‌ నాని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ – ”నాకు హారర్‌ జోనర్‌ సినిమాలంటే చాలా ఇష్టం. హారర్‌ చిత్రాలకు హీరో అవసరం ఉండదు. భయమనే ఎలిమెంటే హీరో. కొత్తగా చేయాలని ఆలోచనతో ఈ సినిమాపై వర్క్‌ చేసి సినిమా చేస్తున్నాం. హారర్‌ సినిమాలు చేయడం మామూలు విషయం కాదు. సినిమాను రెండు వందల మంది స్నేహితులకు చూపించి, ఎక్కడెక్కడ ప్రేక్షకుల భయపడతారు? ఎక్కడ భయపడరు? అనే విషయాలను చూసుకుని కరెక్ట్‌ చేసుకుని సినిమా తెరకెక్కిస్తూ వచ్చాం. నాలుగున్నరేళ్లు సినిమా స్క్రిప్ట్‌ పై వర్క్‌ చేశామంటే మేం పడ్డ కష్టం అర్థం చేసుకోవాలి.”

నేచురల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ – ”నేను ఎంసీఏ సినిమా షూటింగ్‌ చేస్తూ వరంగల్‌లో ఉండగా, అవల్‌ అనే తమిళ సినిమా ట్రైలర్‌ చూసి భయపడ్డాను. రెండు రోజుల తర్వాత సిద్ధు, అదే సినిమా తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ను నాకు పంపాడు. మిలింద్‌ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇండియాలో ఇటువంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. నెంబర్‌ వన్‌ హారర్‌ మూవీ అవుతుంది.” అన్నారు.