టీం అందరికీ దక్కిన గౌరవం -గౌతమ్ తిన్ననూరి

Monday,March 22,2021 - 07:23 by Z_CLU

ఈరోజు 2019 సినిమాలకు సంబంధించి 67 నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. ఆ ఏడాదికి గానూ జెర్సీ సినిమాకు రెండు అవార్డులు లభించాయి. ఉత్తమ తెలుగు సినిమా కేటగిరీలో ‘జెర్సీ’ సినిమాకి ,ఉత్తమ ఎడిటింగ్ కేటగిరీలో నవీన్ నూలికి అవార్డు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు గౌతం తిన్ననూరి తన సంతోషాన్ని తెలియజేశాడు.

గౌతం తిన్ననూరి మాట్లాడుతూ ” ‘జెర్సీ’ చేస్తున్నప్పుడు అవార్డ్స్ గురించి ఆలోచించలేదు. ఇందాకే  ఒక ఫ్రెండ్ కాల్ చేసి ‘జెర్సీ’ కి రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్పాడు. హ్యాపీగా ఫీలయ్యాను. ఇది టీమ్ అందరికీ లభించిన ఓ గౌరవం అని భావిస్తున్నా. ఎడిటింగ్ కి అవార్డ్స్ చాలా తక్కువ వస్తుంటాయి. నిజానికి సినిమా విజయం ఎడిటింగ్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. జెర్సీ ఎడిటింగ్ కి గానూ నవీన్ నూలికి అవార్డ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ‘హీ డెసర్వ్ ఇట్’. ఇందాకే నాని గారు కాల్ చేసి మాట్లాడారు. టీమ్ అందరం కలిసి ఈ అకేషన్ ని సెలెబ్రెట్ చేసుకుందామని అనుకుంటున్నాం. నాని గారు ప్రెజెంట్ ఔట్ డోర్ షూటింగ్లో ఉన్నారు. వచ్చాక టీం అందరం కలుస్తాం. ‘మహర్షి’ టీమ్ కి కూడా నా కంగ్రాట్స్”అన్నారు.