గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

Thursday,December 12,2019 - 03:24 by Z_CLU

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. 290కి పైగా చిత్రాల్లో నటించారు గొల్లపూడి.

ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో నాటకాలు రాసేవారు గొల్లపూడి. అలా ఎన్నో సూపర్ హిట్ నాటకాలు ఆయన నుంచి వచ్చాయి. ఆ తర్వాత డాక్టర్ చక్రవర్తి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఆ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు కూడా అందుకున్నారు.

అలా తెరవెనకే ఉండిపోయిన గొల్లపూడిని, తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి కోడి రామకృష్ణ. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో గొల్లపూడి నటుడిగా మారారు. తొలి సినిమాతోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న గొల్లపూడి ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ఓవైపు రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు నటుడిగా బిజీ అయ్యారు. పైకి మంచిగా కనిపిస్తూ, విలనీ పండించే పాత్రల్లో గొల్లపూడి నటన అద్భుతం. ఆ తర్వాత సెంటిమెంట్ పాత్రల్లో కూడా ఆయన రాణించారు.

నటుడిగా ఎన్ని అవార్డులు అందుకున్నారో… రచయితగా, డైలాగ్ రైటర్ గా అన్నే అవార్డులు అందుకున్నారు గొల్లపూడి. పల్లెటూరి మొనగాడు, అభిలాష, స్వాతిముత్యం, ఛాలెంజ్, మురారి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, స్వాతిముత్యం, యముడికి మొగుడు లాంటి ఎన్నో సినిమాలు గొల్లపూడికి మంచి పేరు తీసుకొచ్చాయి. అజిత్ హీరోగా ప్రేమపుస్తకం అనే సినిమా కూడా డైరక్ట్ చేశారు గొల్లపూడి.