చిరంజీవికి బంగారు కోడిపెట్ట

Thursday,April 09,2020 - 05:55 by Z_CLU

ఘరానా మొగుడు.. చిరంజీవి కెరీర్ లో టాప్-10 సినిమాల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే మూవీ ఇది. 1992లో సరిగ్గా ఇదే రోజు (ఏప్రిల్ 9) విడుదలైంది ఈ సినిమా. ఘరానా మొగుడు గురించి చెప్పుకోవాలంటే ఒకటి రెండు కాదు.. విశేషాలు వందల్లో ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని…

నిజానికి ఇదొక రీమేక్. రజనీకాంత్ నటించిన మన్నన్ సినిమాను ఘరానా మొగుడు పేరిట రీమేక్ చేశారు. అలా అని మన్నన్ రిలీజ్ తర్వాత చేసిన రీమేక్ కాదిది. ఘరానా మొగుడు సెట్స్ పైకి వచ్చేసరికి మన్నన్ ఇంకా షూటింగ్ స్టేజ్ లో ఉంది. అయినప్పటికీ దాని రిజల్ట్ తో సంబంధం లేకుండా, కథపై నమ్మకంతో రీమేక్ రైట్స్ కొని స్టార్ట్ చేశారు.

మన్నన్ కు ఘరానా మొగుడుకు మెయిన్ కథలో తప్పితే, టేకింగ్-స్క్రీన్ ప్లే పరంగా చాలా తేడాలు కనిపిస్తాయి. ఏరోజుకారోజు సీన్ పేపర్లు తమిళ్ నుంచి తెప్పించుకొని మార్పుచేర్పు చేసి ఘరానా మొగుడు తీశారు. తమిళ్ లో మన్నన్ అంటే మహారాణి అని అర్థం.. అదే టైటిల్ చిరంజీవికి తెలుగులో పెడితే బాగోదు. అందుకే స్క్రీన్ ప్లే, సన్నివేశాలు కూడా మార్చి ఘరానా మొగుడు అనే టైటిల్ పెట్టారు.

కోటి రూపాయల బడ్జెట్ లో తీసిన ఈ సినిమా అప్పట్లో 4 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. సౌత్ లో 4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా ఇదే. ఇప్పటి లెక్కలు, టిక్కెట్ రేట్లు లెక్కలోకి తీసుకొని చూసుకుంటే.. ఘరానా మొగుడు కలెక్షన్ దాదాపు 100 కోట్ల రూపాయలతో సమానం. (అప్పుడు టిక్కెట్ 10 రూపాయలు, ఇప్పుడు టిక్కెట్ 150 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు.)

ఇక ఈ సినిమాలో వెరీ పాపులర్ డైలాగ్స్.. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. నమస్తే మాస్టారు. ఈ రెండు డైలాగ్స్ వెనక గమ్మత్తైన ఘటన ఉంది. ఓసారి అరకులో చిరంజీవి షూట్ చేస్తుంటే ఎవరో అభిమాని, బాసూ కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి అన్నాడు. ఆ డైలాగ్ చిరంజీవికి బాగా నచ్చి ఈ సినిమాలో పెట్టారు. ఇలాంటి మేనరిజమ్స్ తమిళ్ వెర్షన్ లో కనిపించవు. నమస్తే మాస్టారు అనే డైలాగ్ కూడా అలా పుట్టుకొచ్చిందే.

ఇక సంగీతం విషయానికొస్తే.. ఈ సినిమాకు కీరవాణి సంగీత దర్శకుడు. చిరంజీవి సినిమాకు కీరవాణి వర్క్ చేయడం అదే ఫస్ట్ టైమ్. కీరవాణిపై నమ్మకంతో నిర్మాత దేవీవరప్రసాద్, ఇళయరాజాను పక్కనపెట్టి మరీ కీరవాణికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని కీరవాణి నిలబెట్టుకున్నారు.

ఇక సినిమాలో బంగారుకోడిపెట్ట సాంగ్ వెనక చాలా పెద్ద కథ ఉంది. పెంకి పిల్ల.. ఇస్తాలే టెంకి జల్ల అనే లిరిక్స్ తో ఈ పాట ఉండేది. అది దర్శక-నిర్మాతలకు నచ్చలేదు. అప్పటికప్పుడు కీరవాణి, భువనచంద్రను కూర్చోబెట్టించి గంటన్నరలో మాస్ సాంగ్ రెడీ చేయించారు. అదే బంగారు కోడిపెట్ట. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను షిప్ యార్డ్ లో వారం రోజుల పాటు తీశారు. గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ పాటను చిరంజీవి పాడాలనుకొని, బిజీగా ఉండడం వల్ల లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు.

మరికొన్ని హైలెట్స్
– తమిళ్ వెర్షన్ లో విజయశాంతి చేయగా.. తెలుగు వెర్షన్ లో ఆమెను తీసుకోలేదు.
– హోసూర్ వద్ద ఉన్న టీవీఎస్ సుజికి ఫ్యాక్టరీలో ఈ సినిమాను షూట్ చేశారు
– హీరోయిన్ ఇంటిని అన్నపూర్ణ స్టుడియోస్ లో సెట్ వేశారు. అప్పట్లోనే ఖర్చు 21 లక్షలు
– క్లైమాక్స్ ఫైట్ కోసం ముంబయి ఫైట్ మాస్టర్స్ ను రప్పించారు
– ఈ సినిమా షూటింగ్ కు 70 రోజులు పట్టింది
– 105 ప్రింట్స్ తో విడుదలైంది.. అప్పట్లో ఇదే హయ్యస్ట్
– నైజాంలో 50 థియేటర్లలో రిలీజ్ చేసిన ఫస్ట్ మూవీ ఇది
– హైదరాబాద్ లో సంధ్య 70mmలో రోజూ 4 ఆటలతో 175 రోజులాడింది.
– గుంటూరులో వంద రోజుల ఫంక్షన్ చేస్తే 4 లక్షల మంది వచ్చారు. జాతీయ స్థాయిలో మాట్లాడుకున్నారు దీని గురించి.
– మలయాళం డబ్బింగ్ రైట్స్ ను లక్ష రూపాయలకు ఇవ్వగా.. కోటి రూపాయలు కలెక్ట్ చేసింది

– ఈ సినిమాకు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. తొలి సన్నివేశంగా చిరంజీవి-నగ్మా మధ్య ఫస్ట్ నైట్ సీన్ తీశారు.

– ఈ సినిమా తర్వాతే చిరంజీవి పొలిటికల్ ఎంట్రీపై చర్చ మరింత ఎక్కువైంది. మెగాస్టార్ ను అప్పట్లో కొన్ని పార్టీలు కూడా సంప్రదించాయి.