జెర్సీ లాంటి మోస్ట్ ఎమోషనల్ మూవీ తర్వాత దానికి పూర్తి భిన్నమైన కథను సెలక్ట్ చేసుకున్నాడు నాని. రివెంజ్ డ్రామాకు కామెడీ యాడ్ చేస్తూ తెరకెక్కింది గ్యాంగ్ లీడర్ సినిమా. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ మూవీ ట్రయిలర్, సినిమా జానర్ తో పాటు స్టోరీని కూడా ఎలివేట్ చేసింది.
ప్రతీకారంతో రగిలిపోతున్న ఐదుగురు ఆడాళ్లు, రివెంజ్ స్టోరీస్ రాసే హీరో దగ్గరకు వస్తారు. తమ పగను పంచుకోమని కోరుతారు. వాళ్ల పగను పంచుకోవడానికి హీరో రెడీ అవుతాడు. అలా రివెంజ్ గ్రూప్ కు గ్యాంగ్ లీడర్ గా మారుతాడు. అయితే ఇదంతా సీరియస్ వ్యవహారంగా కాకుండా, కాస్త సరదాగా సాగిపోతుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత.
సినిమాకు అత్యంత కీలకమైన విలన్ ఎలిమెంట్ ను కూడా దాచడానికి ట్రై చేయలేదు. కార్తికేయ ఇందులో విలన్ గా నటిస్తున్నాడనే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన యూనిట్, ట్రయిలర్ లో కూడా అదే విషయాన్ని చూపించింది. అయితే వీళ్లందరికీ ఎందుకింత పగ అనే విషయాన్ని మాత్రం ట్రయిలర్ లో టచ్ చేయలేదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక టెక్నికల్ గా చూస్తే టాప్ రేంజ్ లో ఉంది గ్యాంగ్ లీడర్ ట్రయిలర్. విక్రమ్ కుమార్ సినిమాల్లో టెక్నికల్ అంశాలెప్పుడూ హైలెట్ అవుతుంటాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా టెక్నికల్ ఎలిమెంట్స్ అదిరిపోతాయనే విషయాన్ని సంగీత దర్శకుడు అనిరుధ్, సినిమాటోగ్రాఫర్ మిరోస్లా ట్రయిలర్ తో రుచిచూపించారు.
సెప్టెంబర్ 13న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతున్నాడు గ్యాంగ్ లీడర్.