వీకెండ్ రిలీజెస్

Wednesday,May 24,2017 - 02:00 by Z_CLU

ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న వెంకటాపురం, కేశవ లాంటి సినిమాలకు పోటీగా ఈ వీకెండ్ ఇంకొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. వీటిలో భారీ అంచనాల మధ్య వస్తున్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ మూవీతో పాటు ‘ఓ పిల్లా..నీ వల్లా’, ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్స్-5’, ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి.

అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మూవీ రారండోయ్ వేడుక చూద్దాం. నాగార్జున నిర్మించిన ఈ సినిమాలో నాగచైతన్య, రకుల్ హీరోహీరోయిన్లుగా నటించారు. కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అవ్వడం, చైతూ-రకుల్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో “రారండోయ్..” ప్రాజెక్టుపై అంచనాలు పెరిగాయి. దానికి తోడు థియేట్రికల్ ట్రయిలర్ కూడా హిట్ అవ్వడం అంచనాల్ని పెంచేసింది.

రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో పాటు ఓ పిల్లా.. నీవల్లా, నీలిమళై లాంటి మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. బిగ్ విగ్ బ్యానర్ పై కృష్ణ చైతన్య,రాజేష్ రాథోడ్ హీరోలుగా నటించిన చిత్రం ఓ పిల్లా-నీ వల్లా. కిషోర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో షాలు, మౌనిక హీరోయిన్లు.

మరోవైపు పల్లెర ఆనంద్ కృష్ణ, వృషాలి హీరోహీరోయిన్లుగా నటించిన  నీలిమలై సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నీలిమ ఫిలిమ్స్ బ్యానర్ పై పల్లెర్ల ఆనంద్ ఈ సినిమాను నిర్మించారు. అలీ, భానుచందర్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ మూవీలో నటించారు

ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ విజయం సాధించిన పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఫ్రాంచైజీ నుంచి ఐదో సిరీస్ వస్తోంది. దీని పేరు పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ : డెడ్ మెన్ టెల్ నో టేల్స్. ఈ సినిమాను కొన్ని దేశాల్లో సలాజర్స్ రివెంజ్ పేరుతో కూడా పిలుస్తున్నారు. ఇండియాలో ఇది సలాజర్స్ రివెంజ్ పేరుతోనే వస్తోంది. సముద్రపు దొంగల కాన్సెప్ట్ తో జానీడెప్ హీరోగా నటించిన ఈ సినిమా అమెరికాతో పాటు ఇండియాలో ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.

 

బాలీవుడ్ లో ఈ వీకెండ్ విడుదలవుతున్న చిత్రం సచిన్-ది బిలియన్ డ్రీమ్స్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తనకు ఊహ తెలిసినప్పట్నుంచి సచిన్ వివరించిన సంఘటనల ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సచిన్ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని, ఒకేసారి ఇంగ్లిష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జేమ్స్ రిస్కిన్ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం టాలీవుడ్ కు వచ్చిన సచిన్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్వ్యూ చేయడం విశేషం.