Interview - మధుషాలినీ

Friday,October 09,2020 - 05:28 by Z_CLU

స్నేహా ఉల్లాల్, టోనీ లూక్, మధు షాలిని, అలీ రెజా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ఎక్స్‌పైరీ డేట్’‌. శంకర్ కె. మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మించింది. తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిన మొట్టమొదటి బైలింగ్వల్ వెబ్ సిరీస్ ఇది. ‘జీ 5’లో అక్టోబర్ 2న హిందీ వెర్షన్, అక్టోబర్ 9న తెలుగు వెర్షన్ ఎక్స్ క్లూజివ్ గా విడుదలైంది. దీనికి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో తెలుగు మీడియాతో మధు షాలిని ప్రత్యేకంగా ముచ్చటించారు.

– ‘ఎక్స్‌పైరీ డేట్‌’కి ఎటువంటి స్పందన లభిస్తోంది?
తెలుగు, హిందీ బైలింగ్వల్‌ వెబ్‌ సిరీస్‌ ఇది. సౌతిండియన్‌ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఎక్కువ పని చేశారు. అందుకని, హిందీలో సౌత్‌ సిరీస్‌ అని అనుకున్నారు. కానీ, సిరీస్‌ చూశాక చాలామంది మెసేజ్‌లు చేశారు. బావుందని మెచ్చుకున్నారు. కొంతమంది దర్శకులు ఫోన్‌లు చేసి ‘నెక్ట్స్‌ ఏం చేస్తున్నావు?’ అని అడిగారు. కొన్ని అవకాశాలు వచ్చాయి. త్వరలో నేను ఆడిషన్‌ కూడా ఇవ్వవచ్చు.

– ఇందులో మీ పాత్ర ఏమిటి?
నా పాత్ర పేరు సుజాత. ఐదో ఎపిసోడ్‌లో నా పాత్ర ప్రవేశిస్తుంది. ఏదైనా చేసే ముందు సమాజం ఏమనుకుంటుందో? చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటారో? అని ఆలోచించే పాత్ర. ప్రతి దానికి భయపడుతుంది. నేను ఇప్పటివరకూ ఇటువంటి పాత్రలో నటించలేదు. అందుకని, కొత్తగా అనిపించింది. పైగా, నా తొలి వెబ్‌ సిరీస్‌ ఇది.

– క్యారెక్టర్‌ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యారా?
నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో, అందుకు భిన్నమైన పాత్ర ఇది. అందుకని, చాలా వెబ్‌ సిరీస్‌లు చూశా. ఫీమేల్‌ క్యారెక్టర్లు మాత్రమే కాకుండా, మేల్‌ క్యారెక్టర్లనూ రిఫరెన్స్‌గా తీసుకున్నా.

– అసలు, కథేంటి?
కథ కొత్తగా ఉంటుంది. నలుగురు విభిన్న వ్యక్తులు ఒక చోటికి ఎలా వచ్చారు? ఏంటి? అనేది దర్శకుడు శంకర్‌ మార్తాండ్‌ బాగా చూపించారు. రిలేషన్షిప్స్‌ని కొత్తగా చూపిస్తున్నారని అనిపించింది. సీక్వెల్‌కి కూడా ఛాన్స్‌ ఉంది.

– కథ విన్నప్పుడు ఏమని అనిపించింది?
నిజం చెప్పాలంటే… ‘ఎక్స్‌పైరీ డేట్‌’ చిత్రీకరణ ప్రారంభం కావడానికి ముందే శంకర్‌ మార్తాండ్‌గారు నాకు కథ వినిపించారు. అప్పటికి నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ శరత్‌ మరార్‌గారు ప్రాజెక్ట్‌ టేకప్‌ చేయలేదు. వెబ్‌ సిరీస్‌ చేస్తే బావుంటుందని అనిపించింది. మొత్తం ప్రాజెక్ట్‌ సెట్‌ కావడానికి టైమ్‌ పట్టింది. ఫైనల్లీ… శరత్‌గారు టేకప్‌ చేసినప్పుడు శంకర్‌గారు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. నాకు చాలా నచ్చిన కథల్లో ఇదొకటి.

– షూటింగ్‌ ఎలా జరిగింది?
హిందీ సహా మలయాళంలో టోనీ లూక్‌ చాలా సినిమాలు చేశాడు. విశ్వ పాత్రలో తను బాగా చేశాడు. ఏదైనా సన్నివేశంలో నటించేముందు డిస్కస్‌ చేసుకునేవాళ్లం. స్నేహాతో నాకు సన్నివేశాలు లేవు. ఒక చిన్న సన్నివేశంలో నటించామంతే! అలీ రేజా నేచురల్‌గా చేశాడు. లాక్‌డౌన్‌ టైమ్‌లో మా లాస్ట్‌ షెడ్యూల్‌ ఉండాలి. దానికి రెడీ అవుతున్నప్పుడు లాక్‌డౌన్‌ అనౌన్స్‌ చేశారు. కొచ్చిన్‌లో టోనీ లూక్‌, ముంబైలో స్నేహా ఉల్లాల్‌ స్టక్‌ అయ్యారు. మళ్లీ మేమంతా కలిసి లాక్‌డౌన్‌ పీరియడ్‌లో జాగ్రత్తలు తీసుకుని సిరీస్‌ చేశాం. కరోనా వల్ల అందరూ భయపడుతూ, చాలా జాగ్రత్తగా, కషాయాలు తాగుతూ షూటింగ్‌ చేశాం.

CLICK HERE for Expiry Date

– ‘ఎక్స్‌పైరీ డేట్‌’… ఈ టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏంటి?
ప్రతి రిలేషన్షిప్‌కి ఒక ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. టైటిల్‌కి జస్టిఫికేషన్‌ ఏంటంటే… రిలేషన్షిప్‌ అనే కాదు, జీవితంలో మనం చేసే ప్రతిదానికీ ఒక ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. వెబ్‌ సిరీస్‌ చూస్తే… ప్రతి క్యారెక్టర్‌కి ఒక స్టార్ట్‌, ఎండ్‌ ఉంటుంది. అందుకని, ఎక్స్‌పైరీ డేట్‌ అని పెట్టారు.

– ‘ఎక్స్‌పైరీ డేట్‌’ విడుదలైంది. వెబ్‌ సిరీస్‌ అవకాశం వస్తే నటిస్తారా?
ప్రస్తుతం ‘బాహుబలి’ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ప్రొడ్యూస్‌ చేస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘రైజ్‌ ఆఫ్‌ శివగామి’లో నటిస్తున్నాను. అది హిందీ సిరీస్‌. అందులో నా పాత్ర, ఇతర విషయాల గురించి ఏమీ చెప్పలేను.

– మీరు ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు?
ప్రముఖ తమిళ దర్శకులు బాలాగారు నిర్మాణంలో ఓ సినిమా చిత్రీకరణ పూర్తి చేశా. మరో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం చేస్తున్నా. తెలుగులో ‘గూఢచారి 2’ ఉంది.

– మీ లక్ష్యం ఏంటి?
ఏడాదికి ఒక్క సినిమా చేసినా చాలు… నాకు నచ్చింది చేస్తా. మంచి పాత్రలు లభించాలి. కథ బావుంటే ఎవరూ నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు. ‘బాబూ… నేనే నటిస్తా’ అని వెళతా. ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి.