ఈసారి క్లాస్ మాత్రమే కాదు, మాస్ కూడా!

Sunday,September 22,2019 - 09:02 by Z_CLU

హీరో నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్ ఫిల్మ్స్  సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఎంత మంచివాడ‌వురా`. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. `శ‌త‌మానం భ‌వ‌తి`తో జాతీయ పుర‌స్కారం అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆగ‌స్టు 26 నుంచి రాజ‌మండ్రి, పెండ్యాల‌, పురుషోత్త‌మ‌ప‌ట్నం, కొవ్వూరు, కోటిప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ నెల 25 వ‌ర‌కు ఈ షెడ్యూల్ నడుస్తుంది.  తొర్రేడులో రూ.35 ల‌క్ష‌ల వ్య‌యంతో భారీ జాత‌ర సెట్ వేశారు. అక్క‌డ క‌ల్యాణ్‌రామ్‌, న‌టాషా దోషి (`జై సింహా` ఫేమ్‌)పై ఒక సాంగ్ షూట్ చేశారు..

అలాగే పెండ్యాల‌లోని ఇసుక ర్యాంప్ ల మ‌ధ్య భారీ ఎత్తున తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందని…. వంగ‌ల‌పూడి స‌మీపంలో గోదావ‌రిలో 16 బోట్ల‌తో తెర‌కెక్కించిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌  క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుందని అంటోంది యూనిట్. అలా దర్శకుడు ఈసారి క్లాస్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ కూడా చూపించబోతున్నాడు.

అక్టోబ‌ర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో  మూడో షెడ్యూల్… ఆ త‌ర్వాత కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌లో నాలుగో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 15న థియేటర్లలోకి రానుంది ఎంత మంచివాడవురా సినిమా.