దీపావళికి రెడీ అవుతున్న టాలీవుడ్

Tuesday,October 22,2019 - 01:03 by Z_CLU

సాధారణంగా దసరా, సంక్రాంతికే టాలీవుడ్ లో హంగామా ఎక్కువ. కానీ ఈసారి దీపావళికి కూడా కాస్త ఎక్కువ సెలబ్రేషన్ కనిపిస్తోంది. బడా సినిమాలు కొన్ని ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతుంటే, మరికొన్ని సినిమాల సింగిల్స్ వస్తున్నాయి. ఇంకొన్ని కొత్త సినిమాల ఎనౌన్స్ మెంట్స్ కూడా అదే రోజు వచ్చే ఛాన్స్ ఉంది.

ఈ దీపావళికి అల వైకుంఠపురం సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టీజర్ ను ఈరోజు రిలీజ్ చేస్తారు. సామజవరగమన అనే లిరిక్స్ తో సాగే ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అవ్వడంతో, సెకెండ్ సింగిల్ పై అందరి దృష్టిపడింది.

నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాకు సంబంధించి కూడా ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు. మూవీకి సంబంధించి ఇప్పటికే టైటిల్ డిజైన్ ను రిలీవ్ చేశారు. ఇప్పుడు దివాళీ పోస్టర్ ను డిజైన్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారు.

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి కూడా దీపావళి గిఫ్ట్ రాబోతోంది. కాకపోతే ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తారా లేక సింగిల్స్ రిలీజ్ చేస్తారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు దీపావళి కోసం ఓ స్పెషల్ టీజర్ వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు కొంతమంది.

దీపావళికి బాలయ్య సినిమా నుంచి పోస్టర్ రాబోతోంది. మూవీకి సంబందించి ఇప్పటికే కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి అదనంగా మరో స్టిల్ ను రిలీజ్ చేయడం పక్కా. కాకపోతే ఫొటో ఒక్కటే రిలీజ్ చేయాలా లేక ఆ పిక్ తో పాటు టైటిల్ ను కూడా ఎనౌన్స్ చేద్దామా అనే ఆలోచనలో యూనిట్ ఉంది. ఈ సినిమాకు రూలర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

వీటితో పాటు మారుతి-అల్లు శిరీష్ కాంబోలో ఓ కొత్త సినిమాను కూడా దీపావళికి ప్రకటించే అవకాశం ఉందనే గాసిప్ వినిపిస్తోంది. గతంలో వీళ్లిద్దరి కాంబోలో కొత్తజంట అనే సినిమా వచ్చింది. ఇప్పుడు రెండోసారి వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇలా ఈ దీపావళికి టాలీవుడ్ నుంచి బోలెడన్ని అప్ డేట్స్, మరెన్నో బ్రేకింగ్స్ బయటకు రాబోతున్నాయి.