దర్శకులే నా దేవుళ్లు

Saturday,September 16,2017 - 12:39 by Z_CLU

“ఒకసారి కథ విని సినిమా చేయడానికి ఒప్పుకొన్నానంటే ప్రాణం పెట్టి పనిచేస్తా. నాకు నా దర్శకులు దేవుళ్లతో సమానం. అది నమ్మినందుకే అతడు, పోకిరి, ఒక్కడు, శ్రీమంతుడు లాంటి సినిమాలొచ్చాయి. అది నమ్మడంవల్లే ఇంతవాణ్ని అయ్యాను, ఇంతమంది అభిమానుల్ని పొందాను” స్పైడర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ మాటలివి.

స్పైడర్ కూడా కేవలం దర్శకుడి మీద నమ్మకంతో చేశానని.. తన నమ్మకాన్ని మురుగదాస్ నూటికి 200శాతం నిజం చేశారని అన్నాడు మహేష్. ” ఒక సినిమాని రెండు భాషల్లో చేయడం అంటే ఆషామాషీ కాదు. స్పైడర్‌ లాంటి సినిమా తీయాలంటే కసి ఉండాలి. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లో ఆ కసి ఉంది. మద్రాస్‌లో ఉన్నప్పుడు దళపతి, రోజా సినిమా చూసి పెద్దయ్యాక సంతోష్‌ శివన్ తో సినిమా చేయాలనే ఓ కల ఏర్పడింది. మురుగదాస్‌ వల్ల నా కల నెరవేరింది” అని అన్నాడు మహేష్

ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో స్పైడర్ తమిళ, అరబ్బీ వెర్షన్ ట్రయిలర్ ను మహేష్ లాంచ్ చేశాడు. సినిమా చాలా బాగా వచ్చిందన్న మహేష్.. దసరా కానుకగా ఈనెల 27న వస్తున్న స్పైడర్ ను బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత అభిమానులపై ఉందన్నాడు.