త్రివిక్రమ్ ఇంటర్వ్యూ

Friday,January 10,2020 - 04:21 by Z_CLU

‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కింది ‘అల.. వైకుంఠపురములో…’. బన్ని తో సినిమా చేయడం ఇది మూడో సినిమా. ఇప్పటికే ఆడియో సూపర్ హిట్టు… మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది… ఇంత ఎగ్జైట్ మెంట్ మధ్య తన కరియర్… ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్… వీటి మధ్య తన హిట్స్.. ఫ్లాప్స్… వాటి మధ్య తన ప్రత్యేకతను ఎలాగైనా నిరూపించుకోవాల్సిందే అని తపించే త్రివిక్రమ్… మీడియాతో మాట్లాడాడు… వాటిలో హైలెట్స్ ఇవే… 

ఇది భయంతో పోరాటం…

ఎవరైనా కరియర్ బిగినింగ్ లో తాము ఏమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే అది కొన్ని సినిమాల తరవాత ఆడియెన్స్ లో అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఆ అంచనాలను అందుకునే ప్రయత్నంలో ఒక్కోసారి ఎస్కేప్ రూట్స్ ని ఎంచుకుంటూ ఉంటారు… అంచనాలను అందుకోగలమో లేదో అని భయపడుతుంటారు. ఇప్పుడు నేను చేస్తున్నదీ అదే… అరవింద సమేత అనుకున్నప్పుడు కూడా భయంతో పోరాడదామని ఫిక్సయి అలాంటి కథ ఎంచుకున్నా… ఇప్పుడు కూడా అంతే… ఈసారి కూడా ఈ పోరాటంలో భయం కాదు నేనే గెలుస్తా అనుకుంటున్నా…

సినిమాలో కీ పాయింట్…

స్థానం ఇవ్వగలం కానీ స్థాయి ఇవ్వలేం.. స్థాయి అనేది ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి. ఇదే ఈ సినిమాలో కీ పాయింట్. దానికి తోడు ఒక ఇల్లు. తల్లి.. తండ్రి.

పక్కా ప్లానింగ్ జరిగింది…

పాటల్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలనేది పక్కగా ప్లాన్ చేసుకున్నాం. కాకినాడలో ఉన్నప్పుడు ఓ 3 పేజీల్లో… గుర్తుకొచ్చిన ప్రతి స్ట్రాటజీని రాసుకున్నాం. దాని ప్రకారంగానే ప్రతీ పాట ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేలా చేశాం.

అలా చేయాలంటే నాకు భయం…

నేనేది రాసుకున్నా చాలా తెలికైనా వాతావరణంలో రాసుకుంటా. ఎక్కడో సముద్ర తీరానికి వెళ్లి, విదేశాలకు వెళ్లి ప్రత్యేకంగా రాసుకొను.. ఇంట్లో ఓ వైపు పిల్లలు అల్లరి చేసుకుంటూ ఉండగానే రాసుకుంటాను. అలా ప్రత్యేకంగా ఒంటరిగా కూర్చుని రాసుకోవాలనుకుంటే నాకు భయం.

అది కూడా ఓ కారణం అయి ఉండొచ్చు…

1960 కాలం వరకు అందరివీ మాతృస్వామిక కుటుంబాలే. పొలం డబ్బుల దగ్గరి నుండి ప్రతీది ఆడవారి చేతుల్లోనే ఉండేవి. కానీ ఎప్పుడైతే దూర ప్రాంతాలకు వెళ్లి బ్రతకడం మొదలైందో, అప్పటి నుడి ఆడవారి పాత్ర తగ్గింది. దానికి తోడు సినిమాల్లో కూడా వారిని తగ్గించి చూపించడం… లాంటివి చూసి నాలో ఉన్న చిరాకుని నా సినిమాల ద్వారా… నా సినిమాల్లోని ఆడవారి గొప్ప పాత్రల ద్వారా తీర్చుకుంటున్నానేమో… నా సినిమాల్లో ఆడవారి పాత్రలు అంత గొప్పగా ఉండటానికి కారణం అది కూడా అయి ఉండొచ్చు…

సముద్రఖని గురించి…

నేను తమిళంలో ‘సుబహ్మణ్యపురం’ చూసి ఆయన పర్ఫామెన్స్ కి చాలా ఇంప్రెస్ అయ్యా. ఆ సినిమాలో కలర్స్ స్వాతి కూడా నటించింది. ఆమె ద్వారా ఆయన నంబర్ తీసుకున్నా. నేను కాల్ చేశాక ఆయన ఇంటికి వచ్చి కలిసి మరీ ఈ సినిమాలో నటిస్తానని చెప్పారు…

టాబూ గారితో పనిచేశాక…

నేషనల్ అవార్డ్స్ ఊరికే ఇచ్చేయరనిపించింది ఆవిడతో పని చేశాక. చాలా డెడికేషన్ ఉన్న నటి.