దర్శకుడు సురేందర్ రెడ్డి ఇంటర్వ్యూ

Tuesday,October 01,2019 - 03:14 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవిను ‘సైరా నరసింహ రెడ్డి’గా చూపించబోతున్న సురేందర్ రెడ్డి లేటెస్ట్ గా మీడియాతో ముచ్చటించాడు. సైరా ప్రీ ప్రొడక్షన్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ అన్నిటి గురించి మాట్లాడాడు. ఆ విశేషాలు సురేందర్ రెడ్డి మాటల్లోనే..

 

పెద్ద సినిమా చేద్దాం అన్నారు

ధృవ ప్రీమియర్ షోస్ కి యూ.ఎస్ వెళ్లాం. అందరం అక్కడ కలిసి అక్కడ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాం. చరణ్ గారు కూడా మాతోనే ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవి గారి నుండి మెసేజ్ వచ్చింది. గుడ్ ఫిలిం కంగ్రాట్స్ ఎంజాయ్ దేర్ అని. సో హ్యాపీ గా ఫీలయ్యాను. ఆ రోజు ఈవినింగ్ చరణ్ గారు నన్ను నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఏదైనా కమిట్ మెంట్ ఉందా అని అడిగారు. ఏం లేవని చెప్పాను. వెంటనే డాడీ తో సినిమా చేస్తావా అని అడిగారు. అంతకంటే అదృష్టం ఉండదని అన్నాను. ఇక చరణ్ గారు  ఇండియా వచ్చేశారు. నేను అక్కడే కొన్ని రోజులు ఉండి వచ్చాక చిరంజీవి గారిని కలిసాను. ఆ సమయంలో ఆయనతో ఏదైనా కమర్షియల్ యాక్షన్ సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ చిరంజీవి గారు నాకు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథ గురించి చెప్పి పెద్ద సినిమా చేద్దామని అన్నారు. నాకు కొంచెం టైం కావాలని చెప్పి ఫైనల్ గా టేకప్ చేయడం జరిగింది. అలా అనుకోకుండా ‘సైరా’ నా చేతికొచ్చింది.

 

నిజం తెలుసుకునే ప్రయత్నం

నిజానికి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి గారి గురించి నాకు పెద్దగా తెలియదు. చిన్నప్పుడు పేరు విన్నానంతే. చిరంజీవి గారు చెప్పాకే ఆయన గురించి తెలిసింది. వెంటనే చిరంజీవి గారు పరుచూరి బ్రదర్స్ దగ్గర కథ ఉందని వినమని చెప్పారు. నేనే వారి దగ్గరికి వెళ్లి కథ విన్నాను. వింటున్నప్పుడు బాగుంది మంచి కంటెంట్ ఉంది. ఇంతటి వీరుడు ఉన్నడా అనిపించింది. ఆ తర్వాత ఇంత పెద్ద సినిమా చేయాలంటే ముందుగా నేను మెంటల్ గా స్ట్రాంగ్ అవ్వాలని ఆ ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత విన్నది ఎంత వరకూ రియల్ అని నేను సెర్చ్ చేయడం మొదలెట్టాను. ఆ సమయంలో నేను ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి గురించి తెలుసుకోవడానికి బుక్స్, అలాగే కొన్ని అధికారిక పాత్రలు చదవడం జరిగింది. ఆల్మోస్ట్ ఓ ఇరవై రోజులు స్టడీ చేసాను.


నన్ను ఇన్స్పైర్ చేసింది అదే

పరుచూరి బ్రదర్స్ దగ్గర కథ వినమని చిరంజీవి గారు చెప్పినప్పుడు వారి దగ్గరికి వెళ్లి కథ విన్నాను. కాకపోతే వారి వర్షన్ కంటే ఇంకా నెక్స్ట్ వర్షన్ రాయాలనిపించి మళ్ళీ రీ సెర్చ్ మొదలు పెట్టి టీంతో కలిసి మరో వర్షన్ రాసుకున్నాను. ఆయన గురించి ఏవేవో విన్నాను. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గురించి తెలుసుకునే క్రమంలో తొమ్మిది వేలమంది ఆయన వెనుక సైన్యం లా నిలబడటం అనేది ఆసక్తిగా అనిపించింది, కేవలం ఒకే ఒక్కడిగా మొదలై ఆ తర్వాత జనంలో చైతన్యం తీసుకొచ్చిన స్వాతంత్రం గురించి పోరాడిన తీరు సిల్వర్ స్క్రీన్ పై ఎంతో గొప్పగా చెప్పొచ్చని అనిపించింది. ఆ పాయింట్ ను ఆదర్శంగా తీసుకొనే సైరా కథను సిద్దం చేసుకున్నాను.

 

అమితాబ్ గారు … అందుకే

సినిమాలో చిరంజీవి గారి గురువుగా కనిపించే క్యారెక్టర్ ఉంది. గోస్వామి అనే ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుంది. సినిమాలో మెగా స్టార్ కి గురువుగా అంటే ఎవరు బాగుంటారు అని అనుకుంటుండగా అమితాబ్ గారు మైండ్ లో స్ట్రైక్ అయ్యారు. వెంటనే చిరంజీవి గారికి చెప్తే ఆయన అమితాబ్ గారితో మాట్లాడారు. సినిమాలో అమితాబ్ గారు చెప్పే డైలాగ్స్ చిరంజీవి గారితో ఆయన సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.


అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది

సినిమాలో అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇదొక స్వాతంత్ర సమర యోధుడి కథ కాబట్టి ఆయన జీవితం అయన వెంట ఉండే అందరికి ప్రాదాన్యం ఉంటుంది. జగపతి బాబు గారు, సుదీప్ గారు , విజయ్ సేతుపతి గారు , నయన తార, తమన్నా ఇలా అందరు కథలో ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. వారికి సినిమాలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది.

 

కథను కథలా

సైరా కథను ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్న సమయంలో కథను కథలా చెప్పాలనిపించింది. కమర్షియల్ హంగుల జోలికి అంటే ఎక్కువ పాటలు లేకుండా చూసుకున్నాం. అందుకే సినిమాలో రెండే పాటలు ఉంటాయి. కథను కథలా తెరకెక్కించే ప్రయత్నంలో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. రేపు ఆడియన్స్ కూడా అదే ఫీలవుతారు.

 

వారిద్దరి సపోర్ట్ తోనే

సినిమా కథ సిద్దమయ్యాక పీరియాడిక్ లుక్ తీసుకురావడం కష్టమని అనుకున్నాను. ఇక ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ అలాగే మా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సపోర్ట్ తో ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయలగాలిగాం. క్యారెక్టర్స్ కి సంబంధించి గెటప్ ఎలా ఉండాలి కాస్ట్యూమ్ ఏంటి అనేవి ఆయన చాలా రీ సెర్చ్ చేసి డిజైన్ చేసారు. అలాగే సినిమాకు ఐదుగురు ఆర్ట్ డైరెక్టర్స్ పని చేసారు. వారు కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

 

చరిత్రలో నిలిచిపోయేలా

సినిమా మొదలైనప్పటి నుండి చరణ్ గారు నేను టీం అందరం ఇదొక చరిత్రలో నిలిచిపోయే సినిమా అవ్వాలన్న ఉద్దేశ్యంతోనే పనిచేసాము. సినిమాను ఆ స్థాయిలో నిలబెట్టడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసాం.

చరణ్ తో అనుకున్నాం కానీ

సినిమాలో చరణ్ తో ఓ క్యారెక్టర్ చేయించాలని అనుకున్నాం. ఉయ్యాలవాడ కథలో ఉండే పాత్రే అది. చరణ్ క్యారెక్టర్ తో ఒక ఎపిసోడ్ ఉంటుంది. కానీ మళ్ళీ లెంగ్త్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో వద్దనుకున్నాం.

 

టెన్షన్ పడలేదు

ఇంత పెద్ద సినిమా టెన్షన్ ఓ రేంజ్ లో ఉంటుంది కదా అంటున్నారు. నిజానికి నేను సెట్ లో ఎప్పుడూ టెన్షన్ పడలేదు. వెరీ కూల్ గా పని చేసుకుంటూ వెళ్ళాను. దానికి కారణం కాస్టింగ్. సినిమాకు పర్ఫెక్ట్ కాస్టింగ్ దొరికింది. వారి టైమింగ్ తో బెస్ట్ ఇస్తూ చేసుకుంటూ వెళ్లారు. అందుకే నేను పెద్దగా టెన్షన్ పడలేదు.


బడ్జెట్ ప్రెజర్ తీసుకోలేదు

నిజానికి సినిమాకు సంబంధించి మేకింగ్ గురించే ఆలోచించాను. బడ్జెట్ ప్రెజర్ తీసుకోలేదు. చరణ్ గారు కూడా నా దగ్గర బడ్జెట్ ప్రస్తావన రాకుండా చూసుకున్నారు.

 

వారి గొప్పతనమే

‘సైరా’ కి సూపర్ స్టార్స్ అందరూ కలిసొచ్చారు. వాళ్ళు సూపర్ స్టార్స్ కాబట్టి నేను చెప్పింది చెప్పినట్టు చేసేసారు. సినిమాలో ఒక్కో కారెక్టర్ ఒక్కో తీరులో ఉంటుంది. ఎవరికి ఉండే ఇంపార్టెన్స్ వారికి ఉంటుంది. నిజంగా సినిమాలో క్యారెక్టర్స్ హైలైట్ గా నిలిస్తే అది వారి గొప్పతనమే అవుతుంది.

 

అదే పెద్ద టాస్క్

ఒక కమర్షియల్ సినిమా చేయడం సులువే. కానీ పీరియాడిక్ అనేసరికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆడియన్స్ ను వెనక్కి తీసుకెళ్ళడం మాములు విషయం కాదు. ఆ వాతావరణాన్ని ఆ లుక్ ను తీసుకురావాలి. సో ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద టాస్క్ అంటే అది పీరియాడికే.

 

ఓన్లీ అనుష్క

సినిమాలో కేవలం అనుష్క మాత్రమే గెస్ట్ రోల్ లో కనిపిస్తుంది. ఇంకా గెస్ట్ రోల్స్ ఏం ఉండవు. అనుష్క పాత్ర ఎలా ఉంటుందో స్క్రీన్ మీద చూడాల్సిందే.

 

 లెంగ్త్ అవసరమే

కొన్ని పక్కా కమర్షియల్ సినిమాలకు నిడివి మైనస్ అవుతుందేమో కానీ ఇలాంటి సినిమాలకు అదే ప్లస్ అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఒకసారి కథలో వెళ్ళిన ప్రేక్షకులు ఇక సమయం పట్టించుకోకుండా సినిమాను చూస్తారు.

 

‘సైరా’ ఇదొక బుక్

సైరా నాకొక బుక్ లాంటింది. సినిమా చేస్తున్నంత సేపు ఎన్నో నేర్చుకున్నాను. అలాగే చాలా విషయాలు తెలుసుకున్నాను. నేనే కాదు సినిమాకు పనిచేసిన వారందరూ వర్క్ నేర్చుకున్నారు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా అయినా చేయొచ్చు అనే దైర్యం అందరికీ వచ్చింది.

ఆలస్యం సహజమే

చారిత్రాత్మక కథతో తెరకెక్కే ఇలాంటి సినిమాలకు షూటింగ్ ఆలస్యం అవ్వడం సహజమే. సినిమాలో వాడే గుర్రాలు వాటి మీద తీసిన సన్నివేశాలకు నరకం చూసాము. వాటికి వాతావరణం సెట్ అవ్వాలి. టైమింగ్ కి పర్ఫాం చేయాలి. డాక్టర్ ఉండాలి. ఇలా ఇన్ని ఉంటాయి. ఒక్కో సారి దానికి మూడ్ బాగోకపోతే సీనులో రావాల్సిన సమయానికి రాదు. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్ అంతే. షూటింగ్ ఆలస్యానికి ఇలాంటి ఎన్నో కారణాలున్నాయి.

 

ఆయన బిజీ.. అందువల్లే

సినిమా మొదలయ్యే ప్రాసెస్ లో ముందుగా రెహమాన్ ను అనుకున్నాం. కానీ మా షూటింగ్ మొదలయ్యే సమయానికి ఆయన బిజీగా ఉన్నారు. మాకేమో అప్పడు వర్క్ స్టార్ట్ అయింది. సో ఆయన చేయలేను అని చెప్పడం వల్లే నేను చరణ్ గారు అనుకోని చిరంజీవి అనుమతి తీసుకోని మళ్ళీ అమిత్ త్రివేది ను తీసుకోవడం జరిగింది.

 

ఇదే ఫస్ట్ టైం

జార్జియా ఎపిసోడ్ కోసం అందరం చాలా కష్టపడ్డాం. అక్కడ నలబై రోజులు 250 క్రూతో ఉండి ఓ వార్ ఎపిసోడ్ షూట్ చేసాం. అంత మంది క్రూను అవుట్ డోర్ తీసుకెళ్ళడం ఇదే మొదటి సారి. ఏ భాషలోనూ అంత మందిని తీసుకెళ్ళి షూట్ చేసిన దాఖలాలు లేదు. ఆ సమయంలో చరణ్ అందరినీ ఎంతో బాగా చూసుకున్నారు. ఆర్టిస్టుల కోసం క్రూ కోసం ఎంతో ఖర్చు పెట్టి షేడ్స్ ఏర్పాటు చేసారు. లోపలి దుమ్ము రాకుండా ప్రొటెక్ట్ చేసి బెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు.

ఐదు సినిమాల కష్టం

‘సైరా’ సినిమాను ఐదు భాషల్లో తీయడం ఒకేత్తైతే ఐదు భాషల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయడం మరో ఎత్తు. సైరా ఒక్క సినిమా ఐదు సినిమాలతో సమానం అనిపించింది. నిన్నటి వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనిలోనే ఉన్నాను. అందుకే ప్రమోషన్స్ లో ఆక్టివ్ గా లేను. కేవలం నిన్న జరిగిన ఈవెంట్ కి మాత్రమే ఎటెండ్ అయ్యాను.

 

చిరంజీవి గారి ఫోటో పెట్టుకోవాలి

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి వంశీకులు లేవదీసిన వివాదం చూసాను. నిజానికి వారు చాలా మంచి వారు. ఎవరో వాళ్ళని మిస్ లీడ్ చేసారు. కచ్చితంగా వారికి మా తరుపున ఏదొ ఒక న్యాయం జరుగుతుంది.

 

నో ప్లాన్స్

నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంకా ఏమి అనుకోలేదు. సైరా రిలీజ్ తర్వాత కొంత బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాను.