డైరెక్టర్ రాహుల్ ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Friday,November 16,2018 - 12:02 by Z_CLU

ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే ఆ డైరెక్టర్ వెంటనే మరో సినిమా  చేయడం ఖాయం. అయితే దానికి రాహుల్ సంక్రిత్యన్ మాత్రం మినహా అని చెప్పాలి.. ‘ది ఎండ్’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఈ యంగ్ డైరెక్టర్ హిట్టు కొట్టినా రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏకంగా నాలుగేళ్ళు పట్టింది. మరీ ఈ  యంగ్ డైరెక్టర్ కి రెండో సినిమా చేయడానికి ఎందుకిన్నేళ్ళు పట్టింది…? ‘టాక్సీ వాలా’తో రాహుల్ జర్నీ ఎలా సాగింది..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ .

 

అలా మొదలైంది...

సినిమాల్లోకి రావాలన్న ఉద్దేశ్యంతో ముందుగా షార్ట్ ఫిలిమ్స్ చేసాను. ఆ తర్వాత ‘ది ఎండ్’ సినిమా చేసాను. ఇండిపెండెంట్ సినిమాగా మొదలుపెట్టిన ‘ది ఎండ్’ సినిమా ఫీచర్ ఫిలిం అయింది. ఆ సినిమా చేసినప్పుడు మాకు నిర్మాణం గురించి పెద్దగా అవగాహన లేదు. అవగాహనలేకపోవడం వల్లే సినిమాను మార్కెట్ చేసుకోలేకపోయాం. 50 లక్షల్లో తీసిన ఆ సినిమా దాదాపు 3 కోట్ల గ్రాస్ రాబట్టింది. చూసిన వాళ్ళందరూ మంచి రివ్యూస్ ఇచ్చారు. కానీ ఇంకా రీచ్ అయ్యే టైంలో సినిమా థియేటర్స్ నుండి వెళ్ళిపోయింది. ఆ సినిమా నుండి నేను మా కజిన్ చాలా నేర్చుకున్నాం.

 

తెలియకపోవడం వల్లే….

నిజానికి చాలా మంది ‘టాక్సీ వాలా’ నా మొదటి సినిమా అనుకుంటున్నారు. నా దగ్గర వర్క్ చేసిన టీం కూడా మొదట్లో మీ మొదటి సినిమాకు ఇంత మంచి ఆఫర్ రావడం రెండు పెద్ద బ్యానర్స్ దొరకడం గ్రేట్ అంటుండే వారు. ఇది నా రెండో సినిమా అని చెప్పాక అప్పుడు ది ఎండ్ సినిమా గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మా టీంలో ఎవరైనా ఇది నా మొదటి సినిమా అని చెప్తే అది వారికి తెలియకపోవడం వల్లే తప్ప మరొకటి కాదు.

ఈ స్క్రిప్టే నచ్చింది

మొదటి సినిమా హారర్ జోనర్ కాబట్టి… ఈ కథతో పాటు వేరే జోనర్స్ లో కూడా స్క్రిప్ట్స్ రాసుకున్నాను. కానీ ఆల్మోస్ట్ అందరికీ ఈ స్సిప్టే నచ్చింది. అందుకే సెకండ్ ఫిలింకి ఈ కథే ఎంచుకున్నాను. కాకపోతే ఇది కంప్లీట్ హారర్ జోనర్ లో ఉండే సినిమా కాదు.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్, కామెడి డ్రామా ఇలా కొన్ని జోనర్స్ కలిసి ఉంటాయి.

అందుకే గ్యాప్

‘ది ఎండ్’ సినిమా 2014 లో వచ్చింది.. ఆ సినిమా తర్వాత కొన్ని నెలలు స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాను. దాదాపు అంతా సెట్ అయ్యి సెట్స్ పైకి వెళ్ళడానికి రెండేళ్ళు పట్టింది. సో గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు.

మారుతి గారు నమ్మారు

ఈ సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ మారుతీ గారికే చెప్పాను. ఆయనకీ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ఆయన ప్రొడక్షన్ లో సినిమా చేద్దామని చెప్పారు. ఈ కథను బాగా నమ్మారాయన. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆయన యూ.వి క్రియేషన్స్ కి రిఫర్ చేసారు. అలా మారుతి గారి ద్వారా యూ.వి లోకి ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత ఎస్.కే.ఎన్ కూడా స్క్రిప్ట్ వినడం తర్వాత బన్నీ వాస్ గారిని కూడా కలవడం జరిగింది.

 

పెళ్ళిచూపులు తర్వాత

ఈ స్క్రిప్ట్ ఎవరికీ సూట్ అవుతుందా.. అనుకుంటున్న టైంలో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు రిలీజ్ అయింది. విజయ్ అయితే బాగుంటుందని అందరం ఫీలయ్యాం. వెంటనే యూ.వి.ద్వారా విజయ్ ని కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేసాను. విజయ్ కి కూడా స్క్రిప్ట్ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడు.

 

జాలీ రైడ్

‘టాక్సీ వాలా’ ఓ జాలీ రైడ్ మూవీ … ఆడియన్స్ కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథతో సరదాగా ట్రావెల్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకూ అందరికీ నచ్చుతుంది. అందులో డౌటే లేదు.

అసలు కథ వేరే

నిజానికి ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ అయ్యాక కొన్ని సినిమాలతో కంపేర్ చేస్తూ కంటెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి ట్రైలర్ లో మేం చూపించిన పాయింట్ వల్లే అలాంటి కంపెరిజన్స్ వస్తున్నాయి. కానీ సినిమా అసలు కథ వేరు… అది సినిమా చూస్తే తెలుస్తుంది. ఆ పాయింట్ ట్రైలర్ లో రివిల్ చేయదలుచుకోలేదు. సినిమా చూసాక ట్రైలర్ ఇంతకంటే ఏం కట్ చేస్తారని ఆడియన్స్ ఫీలవుతారు.

 

ఎస్.కే.ఎన్ ఫుల్ సపోర్ట్

నిర్మాతగా ఎస్.కే.ఎన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా తనే చూసుకుంటూ మాకు అన్నీ సమకూరుస్తూ ఎప్పటికప్పుడు సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చాడు. టాక్సీ వాలా నిర్మాతగా ఎస్.కే.ఎన్ కి మంచి పేరు తెస్తుంది.

 

మాళవిక క్యారెక్టర్… రీజన్ అదే

సినిమాలో మాళవిక నాయర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. తన క్యారెక్టర్ ఏంటి.. ఎలా ఉంటుందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.. అందుకే టీజర్, ట్రైలర్ లో తన క్యారెక్టర్ ని దాచి ఉంచాం. ఆ క్యారెక్టర్ కి ఎవరైతే బాగుంటుందా..? అని అనుకుంటుండగా విజయ్ మాళవిక నాయర్ ని రిఫర్ చేసాడు. సినిమా చూసాక ఆ రోల్ కి మాళవిక పర్ఫెక్ట్ అనిపిస్తుంది.

 

హైలీ టాలెంటెడ్

ఈ సినిమాకు జేక్స్ అందించిన సౌండింగ్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేసాయి. మాటే వినదుగా సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తన వర్క్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది.. రీసెంట్ గా ఫైనల్ కాపీ చూసాక మా రైటర్ సాయి అర్జెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ని ముద్దు పెట్టుకోవాలనుంది అన్నాడు. అంతలా తన ఎఫర్ట్ పెట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు జేక్స్. సినిమా రిలీజ్ తర్వాత తనకి మరిన్ని ఆఫర్స్ వస్తాయి.

 

చాలా కష్టపడ్డాడు

నిజానికి ఈ సినిమాకు అందరి కంటే ఎక్కువగా కష్టపడింది మా సినిమాటోగ్రాఫర్ సుజీత్… ఈ సినిమాను ఎక్స్ట్రీం వెథర్ కండిషన్ లో షూట్ చేసాం. ఎక్కువ పార్ట్ పీక్ సమ్మర్ లో షూట్ చేసాం. అప్పుడు కెమెరామెన్ గా తను ఎక్కువ ఎఫ్ఫెక్ట్ అయ్యాడు. అలాగే హ్యాండ్ హెల్డ్ షాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల కెమెరా భుజం మీదే పెట్టుకొని షూట్ చేయాలి. దాదాపు 20 కిలోల బరువు ఉండే కెమెరాను మోయడం వల్ల భుజం భాగం కొద్దిగా ఎఫెక్ట్ అయ్యింది. ప్రతి రోజు పెయిన్ కిల్లర్ వేసుకొని షూట్ మొదలుపెట్టేవాడు. అందుకే సినిమా లీక్ అవ్వడం అతనికి ఎక్కువ బాధ కలిగించింది. తప్పకుండా సుజీత్ కెమెరా వర్క్ కి మంచి ఎప్లాస్ వస్తుంది.

 

65 రోజుల్లో

కథ లాక్ అయినప్పుడు 50 డేస్ లో షూట్ కంప్లీట్ చేయాలనుకున్నాం.. కానీ కొన్ని సీన్స్ షూట్ చేయడానికి టైం పట్టింది. ఫైనల్ గా 65 రోజుల్లో టోటల్ షూట్ ఫినిష్ చేయగలిగాం.

అందుకే ఆలస్యం

విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ అవసరం ఉన్న సినిమాలు ఆలస్యంగా రిలీజ్ అవుతాయి. అది అందరికీ తెలిసిందే.. రాజమౌళి గారు కూడా ఈగ టైంలో విజువల్ ఎఫెక్ట్స్ వల్లే డీలే అవుతుందని చెప్పారు.. శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ సినిమా సైతం విజువల్ ఎఫెక్ట్స్ వల్లే లేట్ అయింది. టాక్సీ వాలా కి విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన పోర్షన్ ఎక్కువ ఉండటం వల్లే రిలీజ్ ఆలస్యం అయ్యింది. ముందుగా ఒక టీం చేసిన వర్క్ నచ్చకపోవడంతో మళ్ళీ వేరే టీమ్స్ కి ఇచ్చాం. విజువల్ ఎఫెక్ట్స్ కోసం మకుట, B2H, D2, పిక్సలాయిడ్, M9fx కంపెనీస్ వర్క్ చేసాయి.

 

ఐడియా నాదే

విజయ్ దేవరకొండ కి ఒక పర్సనల్ పి.ఆర్ టీం ఉంది. కిడ్స్ తో మొదట చేసిన వీడియో ఐడియా వాళ్ళదే.. అది బాగా రీచ్ అయినందువల్లే మళ్ళీ కిడ్స్ తోనే మళ్ళీ ఎక్స్టెండెడ్ వెర్షన్ వీడియో చేస్తే బాగుంటుందనిపించింది. సెకండ్ వీడియో ఐడియా నాదే.. ఆ తర్వాత వాళ్ళు దానికి స్క్రిప్ట్ రెడీ చేసి ఆ వీడియో చేసారు. ఆడియన్స్ ఆ వీడియో చూసాక సినిమా గురించి వచ్చిన టాక్ నమ్మరని ఫీలవుతున్నాం.

 

లీక్ అక్కడి నుండే

డేటా బ్యాంక్ సంబదించి ఓ కంపెనీ కి కంటెంట్ ఇచ్చాం.. అక్కడి నుండే దాదాపు మూడు గంటల నిడివి గల అన్ ఎడిట్ కంటెంట్ లీక్ అయింది.. ఆ కంపెనీ లో కొత్తగా చేరిన ఓ వ్యక్తి వల్లే లీక్ అయిందని తెలిసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసారు. నిజానికి లీక్ లో మా నెగ్లెజెన్సీ కూడా ఉంది. కానీ కొన్ని సార్లు కొందరినీ నమ్మాల్సిందే తప్పదు. అక్కడే మేం పొరపాటు చేసామని రియలైజ్ అయ్యాం.

 

వాళ్ళ టాలెంట్ ఇలా కాకుండా….

నిజానికి పైరసీని ఎవ్వరూ అరికట్టలేకపోతున్నారంటే వాళ్ళు ఏ రేంజ్ క్రిమినల్స్ అయి వుంటారో ఆలోచించాలి… ఒక సినిమా విడుదల కాకుండానే పైరసీ చేసే వాళ్ళ టాలెంట్ ని ఇలా కాకుండా మరోదానికేదైనా వాడితే బాగుంటుంది. ఇక చూసే ఆడియన్స్ ని తప్పు పట్టలేం కానీ సినిమా మేకింగ్ గురించి తెలుసుకుంటే వారికి పెయిన్ తెలుస్తుందని నా భావం.

 

క్లైమాక్స్ క్రెడిట్ అతనికే

కథ రాసాక క్లైమాక్స్ ఎలా ఉంటే బాగుంటుందా అనే డిస్కర్షన్స్ జరిగాయి. అప్పుడు మా రైటర్ సాయి కుమార్ ఒక మంచి క్లైమాక్స్ చెప్పాడు. సినిమాలో హైలైట్ గా నిలిచే క్లైమాక్స్ కి కంప్లీట్ క్రెడిట్ సాయి కే దక్కుతుంది.

 

డిప్రెషన్ లోకి వెళ్ళా….

సినిమా లీక్ అవ్వడం, విజయ్ నటించి సినిమాలు వరుసగా రిలీజ్ అవుతుండటం, సినిమా రిలీజ్ ఉండదనే మాటలు విని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. దాదాపు మూడు వారాలు పట్టింది డిప్రెషన్ నుండి బయటపడ్డానికి. ఆ టైంలో నా టీం నన్ను నమ్మిన వ్యక్తులు మంచి సపోర్ట్ ఇచ్చారు.

 

ఆ నలుగురు

నిజానికి ఈ సినిమా ట్రావెలింగ్ లో నన్ను బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు నలుగురు.. అందులో ఒకడు నా రైటర్ సాయి కుమార్, హీరోయిన్ ప్రియాంక , విజయ్ ఫాథర్, అల్లు వెంకటేష్ గారు. ముఖ్యంగా విజయ్ ఫాథర్ ఎప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళినా ఇది మంచి సినిమా అవుతుంది డోంట్ వర్రీ అంటుండే వారు. అలాగే అల్లు బాబీ గారు కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేసారు.

 

గర్వపడుతున్నా

ఈ సినిమా ట్రావెలింగ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ ఫైనల్ అవుట్ పుట్ చూసి దర్శకుడిగా గర్వపడుతున్నాను. అందరి సపోర్ట్ తో ఒక మంచి ప్రొడక్ట్ బయటికి తీసుకోచ్చాననే ఫీల్ కలిగింది. రిలీజ్ తర్వాత ఆడియన్స్ కూడా అలాగే ఫీలవుతారని నమ్ముతున్నా.