పూరి జగన్నాధ్ ఇంటర్వ్యూ

Tuesday,July 16,2019 - 12:48 by Z_CLU

గురువారం ఇస్మార్ట్ శంకర్ వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. ఈసారి కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. సినిమాలో చాలా ప్రత్యేకతలున్నాయని చెబుతున్నాడు.

ఆ టెన్షన్ ఉంది
టెంపర్ తర్వాత సరైన హిట్ లేదు. ఆ టెన్షన్ ఉంది. అందుకే ఈసారి ఇస్మార్ట్ గా ఆలోచించా. ఓ కొత్త పాయింట్ డిస్కస్ చేస్తున్నాం ఈసారి. ఎప్పట్నుంచో రామ్ తో సినిమా అనుకున్నాం. రకరకాల కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. మా ఇద్దరి కాంబోలో సినిమా అంటూ మీడియాలో చాలాసార్లు వచ్చింది. కానీ ఏదీ జరగలేదు. ఇన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో కుదిరింది.

రామ్ తో కలిసి రాసిన కథ
రామ్ ను కలిసినప్పుడు కథ కూడా లేదు. గుడ్ బాయ్ గా చేసి బోర్ కొట్టింది, నన్ను బ్యాడ్ బాయ్ ను చేయండని రామ్ అడిగాడు. అలా ఇద్దరం కూర్చొని ఓ బ్యాడ్ బాయ్ స్టోరీ రాసుకున్నాం. అదే ఇస్మార్ట్ శంకర్.

హాలీవుడ్ స్ఫూర్తి
ఏ ఆలోచనైనా నేను హాలీవుడ్ నుంచే ఇన్ స్పైర్ అవుతాను. నేను రాసిన కథలన్నింటినీ హాలీవుడ్ సినిమాలే స్ఫూర్తి. ఈ సినిమాలో హీరోది బ్యాడ్ క్యారెక్టరైజేషనే. కానీ ఆ చెడులో కూడా మంచి కనిపిస్తుంది. నా సినిమాల్లో అది ఎప్పుడూ ఉంటుంది.

తెలంగాణ యాసలో..
కథ స్టార్ట్ చేసిన తర్వాత తెలంగాణ యాస పెట్టాలని అనిపించింది. సినిమాలో కథ లోకల్ రౌడీ. మేడిన్ హైదరాబాద్. అందుకే తెలంగాణ యాస పెడితే బాగుంటుందని అనుకొని పెట్టాం. రామ్ ఇప్పటివరకు ఏ సినిమాలో కానీ, బయటగానీ తెలంగాణ యాస మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైమ్. సినిమాలో తెలంగాణ డైలాగ్స్ రాయడానికి నా కో-డైరక్టర్ శ్రీధర్ హెల్ప్ చేశాడు. అతడి సహకారంతో పెద్దగా హోంవర్క్ చేయకుండానే రాశాను.

మన ఇండియన్స్ అంతే
పబ్లిక్ లో షూటింగ్ ఎప్పుడూ కష్టం. మరీ ముఖ్యంగా చార్మినార్ లాంటి ప్లేస్ లో ఇంకా కష్టం. జనం మీద పడుతుంటారు. మాకు పెద్ద టెన్షన్ ఏంటంటే.. కొన్ని వందల మంది వీడియోలు తీసేసి వెంటనే ఫేస్ బుక్ లో పడేస్తుంటారు. అది చాలా పెద్ద ప్రాబ్లమ్. మన ఇండియన్స్ అంతా అంతే. తప్పదు మరి.

కేసులు కామన్
మా సినిమాపై కొన్ని కేసులు కూడా నడిచాయి. మెమొరీ ట్రాన్సఫర్ కాన్సెప్ట్ తనదే అంటూ ఒకాయన కేసు పెట్టారు. మేం దానికి రిప్లయ్ ఇచ్చాం. ఇక వేరొకరు వచ్చి, నేను రాసిన స్క్రిప్ట్ మొత్తం తన దగ్గర ఉందని.. డబ్బులు ఇవ్వకపోతే మొత్తం బయటపెట్టేస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. దానిపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాం.

మణిశర్మకు థ్యాంక్స్
సినిమాపై చాలా పాజిటివ్ టాక్ ఉంది. ఆడియోకు, టీజర్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతిది క్లిక్ అయ్యాయి. ఆడియో సాంగ్స్ అయితే అన్నీ ట్రెండ్ అయ్యాయి. ఈ విషయంలో మణిశర్మకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు.

ఆ క్రెడిట్ రామ్ దే
రామ్ లుక్, డ్రెస్సింగ్ క్రెడిట్ మొత్తం రామ్ కే ఇవ్వాలి. నేను డిజైన్ చేసిందేం లేదు. తను ఎందుకో సరదాగా ఆమధ్య ఓ హెయిర్ కట్ చేయించుకున్నాడు. అది నేను చూశా. ఇది బాగుంది పెట్టుకోమన్నాను. అదొక్కటే నేను చెప్పాను. మిగతాదంతా రామ్ చూసుకున్నాడు.

హీరోయిన్లు కిర్రాక్
సినిమాకు హీరోయిన్లు బాగా ప్లస్ అయ్యారు. నభా, నిధి ఇద్దరూ బాగా చేశారు. నభాది బాగా హైపర్ గా ఉంటుంది. ఆ అమ్మాయిది కూడా తెలంగాణ బేస్డ్ రోల్. ఇక నిధిది వెరీ డిసెంట్ రోల్. సైంటిస్ట్ గా చేసింది. ఇద్దరూ సినిమాలో బాగా కనిపించారు. రామ్ లో లోపల చాలా ఎనర్జీ ఉంది. ఆయన్ని నేను మార్చాల్సిన అవసరం లేదు. ఆయన ఎనర్జీ నాకు సరిపోయింది. రామ్ ఇమేజ్, ఎనర్జీకి తగ్గట్టు కొన్ని సన్నివేశాల్లో మార్పు చేశాం.

రామ్ ను చూసి నేర్చుకుంటారు
సినిమాలో ఘాటు డైలాగ్స్ అంటూ పెద్దగా ఏం లేవు. ఇక నేను రిలీజ్ చేసిన రెండో ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా లేడీస్ ఫోన్ చేసి బాగుందని మెచ్చుకున్నారు. హీరోలు నన్ను ప్రత్యేకంగా మెచ్చుకోవడానికి ఒకటే కారణం. నేను ఎవర్నీ టెన్షన్ పెట్టను. ఎట్మాస్ఫియర్ మొత్తం కూల్ గా ఉంచుతాను. యాక్టింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాను. ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా యాక్టింగ్ పై ప్రభావం చూపిస్తుంది. అలాంటి ఇబ్బందుల్లేకుండా చేస్తానంతే. ఈ సినిమాలో రామ్ యాక్టింగ్ చూసి కొత్తగా వచ్చి నటులు చాలా నేర్చుకోవచ్చు.

ఆల్ ఈజ్ వెల్
సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత టెన్షన్ మొత్తం తీరిపోయింది. రామ్ కూడా సినిమా చూశాడు. అతడు చాలా ఎక్సయిట్ అయ్యాడు. బిగ్ హగ్ ఇచ్చాడు. చాలా హ్యాపీగా, మనశ్శాంతిగా విదేశాలకు వెళ్లిపోయాడు. సినిమా కథ గురించి అప్పుడే చెప్పను. ఆ విషయం పక్కనపెడితే రామ్ క్యారెక్టర్, సాంగ్స్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటాయి.

చార్మి.. ది హార్డ్ వర్కర్
చార్మి చాలా హార్డ్ వర్కింగ్. ఆమె సెట్స్ లో ఉంటే హ్యాపీ. మగాళ్ల కంటే ఎక్కువగా కష్టపడుతుంది. నేను బయట ప్రొడ్యూసర్లతో సినిమాలు చేసేటప్పుడు బడ్జెట్ లెక్కలు ఆలోచిస్తాను. నేనే నిర్మాతగా సినిమాలు చేస్తున్నప్పుడు అవేం ఆలోచించను. కేవలం క్రియేటివ్ సైడ్ మాత్రమే చూసుకుంటాను.

ఇస్మార్ట్ బజ్ నడుస్తోంది
ఇస్మార్ట్ శంకర్ సినిమాపై చాలా పాజిటివ్ బజ్ ఉంది. ట్రయిలర్, సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి. ఓపెనింగ్స్ బాగా వచ్చేలా ఉన్నాయి. ఈ ఏడాది అన్నీ సాఫ్ట్ కథలే వచ్చాయి. మనది మాత్రం పక్కా మాస్ కథ. సినిమా బిజినెస్ కూడా బాగా జరిగింది.

బాలయ్య కోసం కథ రాయాలి
ఆకాష్ పూరి సినిమాను నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. దాదాపు 50శాతం షూటింగ్ పూర్తయింది. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయిన తర్వాత పూర్తిగా ఆకాష్ సినిమాపైనే దృష్టిపెడతాను. బాలయ్యతో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఇంకా కథ రెడీ అవ్వలేదు. స్టోరీ రెడీ అవ్వగానే కలిసి వినిపిస్తాను. నా దగ్గరున్న కథలతో ఆయనతో సినిమా చేయలేం. బాలయ్య కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయాలి. వెయిటింగ్ ఫర్ బాలయ్య. నెక్ట్స్ సినిమాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.