దర్శకుడు 'ఓంకార్' ఇంటర్వ్యూ

Thursday,October 17,2019 - 03:20 by Z_CLU

‘రాజు గారి గది’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న ఓంకార్ ఇప్పుడు ‘రాజు గారి గది 3’ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. రేపు గ్రాండ్ గా రిలీజవుతున్న ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు ఓంకార్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

 

వాడికి ఇచ్చిన మాట నెరవేరింది

అశ్విన్ ను పూర్తి స్థాయి హీరోగా మార్చి సినిమా చేస్తానని మాటిచ్చాను. వాడికిచ్చిన మాటను ఈ సినిమాతో నిలబెట్టుకున్నాను. ఇప్పటికే నాలుగైదు సినిమాలు చేసినా అశ్విన్ పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా ఇది. తను ఈ సినిమాతో హీరోగా కచ్చితంగా నిలబడతాడని నమ్ముతున్నాను.

మూడు మెట్లు ఎక్కనంటారు

‘రాజు గారి గది 2’ తర్వాత మళ్ళీ అశ్విన్ ని హీరోగా పెట్టి, అవికా లాంటి అమ్మాయిను తీసుకొని ఈ సినిమా చేసినందుకు కిందకి దిగానని అనుకోవడం లేదు. ఒక వేళ అనుకునే వాళ్ళు సినిమా చూసాక మూడు మెట్లు ఎక్కానని ఫీలవుతారు. అది మాత్రం కచ్చితంగా చెప్పగలను.

వెంకటేష్ చేయాల్సింది

‘రాజు గారి గది’ రిలీజ్ అయ్యాక వెంకటేష్ గారితో పార్ట్ 2 ప్లాన్ చేసాను. కానీ అనుకోని కారణాల చేత నాగార్జున గారితో చేయాల్సి వచ్చింది. వెంకటేష్ గారితో కచ్చితంగా రాజు గారి గది సిరీస్ చేస్తాను. అదెప్పుదనేది మాత్రం ఇప్పుడే చెప్పలేను.


ఆ క్రేజ్ తోనే

సాధారణంగా ప్రాంచైజీ అనేది కష్టం. టైటిల్ క్రేజ్ వల్ల సినిమాపై అంచనాలు పెరుగుతాయి. నిజానికి ఆ క్రేజ్ సినిమాకు కలిసొస్తుంది. ఆ క్రేజ్ తో సినిమాకు వేల్యూ వస్తుంది. ‘రాజు గారి గది 3’ విషయంలోనూ అదే రుజవైంది. బిజినెస్ కూడా బాగానే జరిగింది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణాలో వరంగల్ శ్రీను గారు రిలీజ్ చేస్తున్నారు. శాటిలైట్ & డిజిటల్ కూడా అమ్ముడుపోయింది.

నచ్చేలా చెప్పాలి

ఇప్పుడు హార్రర్ కామెడీతో వచ్చే సినిమాలు నడుస్తాయా అంటే నడుస్తాయనే అంటాను. దానికి రీజన్ ఉంది. సినిమా అనేది రెండున్నర గంటల ఎంటర్టైన్ మెంట్. ఆ ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేలా ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీస్తే విజయం అందుకోవడం సులువే. అది నమ్మే సినిమా చేసాను.


ఎంటర్టైన్ మెంట్ డోస్ పెరిగింది

రాజు గారి గది మంచి సక్సెస్ అయింది. కానీ ‘రాజు గారి గది 2’ ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. అందులో కామెడీ మిస్సయిందనే కంప్లైంట్ విన్నాను. అందుకే ఈసారి మళ్ళీ పార్ట్ వన్ లో ఉండే ఎంటర్టైన్ మెంట్ ఉండేలా చూసుకొని డోస్ పెంచాను. అందువల్ల సినిమా చిన్న పిల్లలను కూడా అలరిస్తుంది.

రీమేకే…. కానీ

‘రాజు గారి గది 3’ ను తమిళ సినిమా ‘దిల్లుకు దుడ్డు 2’ అనే సినిమాను ఆదరంగా తీసుకొని తెరకెక్కించిన మాట వాస్తవమే. కానీ మన చాలా మార్పులు చేసి తెరకెక్కించడం జరిగింది.

అశ్విన్ కి కలిసొచ్చింది

డేట్స్ లేకపోవడంతో సినిమా నుండి తమన్నా తప్పుకుంది. ఆ తర్వాత కాజల్ కి కథ వినిపించాను. తనకి కథ బాగా నచ్చింది కానీ తను పూర్తి స్థాయిలో డేట్స్
ఇవ్వలేకపోయింది. అందుకే ఫైనల్ గా అవికా ను తీసుకున్నాం. తనకి కూడా ఈ సినిమా తెలుగులో మంచి కం బ్యాక్ అవుతుందని భావించాం. తమన్నా తప్పుకున్నాక అశ్విన్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెంచాను. ఆ విధంగా చూస్తే తమన్నా తప్పుకోవడం అశ్విన్ కి కలిసొచ్చింది.


అనుకోని సెంటిమెంట్

‘రాజు గారి గది’ ను అప్పుడు అక్టోబర్ లో రిలీజ్ చేసాం. అనుకోకుండా మంచి డేట్ దొరకడంతో ‘రాజు గారి గది 2’ ను కూడా మళ్ళీ అక్టోబర్ లోనే రిలీజ్ చేసాం. ఇప్పుడు మూడు కూడా అక్టోబర్ లోనే రిలీజవుతుంది. నిజానికి ప్లాన్ చేసింది కాదు కానీ అలా కలిసొచ్చింది. పైగా నేను పుట్టింది కూడా అక్టోబర్ లోనే. ఇదంతా దేవుడి ఆశీర్వాదంలా భావిస్తాను.

రెండు కథలు రెడీ

స్పోర్ట్స్ డ్రామాతో ఓ కథను సిద్దం చేసాను. అలాగే ‘రాజు గారి గది 4’ కథ కూడా ఉంది. వీటిలో ఏది ముందు ఎవరితో చేస్తాననేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. మధ్యలో టివీను కూడా మైంటైన్ చేయాలి. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ప్లాన్ చేసుకుంటున్నాను.