Interview - మోహన్ రాజా (గాడ్ ఫాదర్)

Monday,October 03,2022 - 04:45 by Z_CLU

ఇరవై ఏళ్ల క్రితం ‘హనుమాన్ జంక్షన్’ తో తెలుగులో దర్శకుడిగా పరిచయమైన మోహన్ రాజా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో మెగా స్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ గాడ్ ఫాదర్ గురించి తాజాగా మోహన్ రాజా మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు దర్శకుడు మోహన్ రాజా మాటల్లోనే..

అవకాశం అలా వచ్చింది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్యాప్ ఉంది కానీ తమిళ్ లో నేను చేసిన సినిమాలన్నీ తెలుగు రీమేకులే అందువల్ల తెలుగు సినిమాలు పదే పదే చూస్తూ అవి మళ్ళీ రీమేక్ చేస్తూ పెద్ద గ్యాప్ అనిపించడం లేదు.  ఎన్.వి.ప్రసాద్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన చాలా సార్లు తెలుగులో సినిమా చేయమని అడిగారు. ఒకసారి మహేష్ బాబు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళారు. ఫైనల్ గా గాడ్ ఫాదర్ తో తెలుగు రీ ఎంట్రీ ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. తమిళ్ లో వచ్చిన నా సినిమా తనిఒరువన్ ఇక్కడ దృవ గా రీమేక్ అయింది. ఆ సినిమాను చరణ్ గారు నన్ను చేయమని అడిగారు కానీ ఆ సమయంలో నాకు వీలు కాలేదు. అప్పటి నుండి చరణ్ బాబుతో మంచి అనుబంధం ఉంది. గాడ్ ఫాదర్ కి చిరంజీవి గారు , చరణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వెరీ హ్యాపీ.

అప్పుడు హిట్లర్ ..ఇప్పుడు గాడ్ ఫాదర్ 

చిరంజీవి గారితో మా బేనర్ లో నిర్మించిన హిట్లర్ సినిమా షూటింగ్ వెళ్తూ ఉండే వాడిని. అప్పుడు చిరంజీవి గారిని చూస్తూ గొప్ప స్టార్ అనుకునే వాడిని. ఇప్పుడు ఆయన్ని డైరెక్ట్ చేయడం ఊహించని అవకాశం అనిపించింది. ఆయన నుండి ఎంతో నేర్చుకున్నాను. సెట్స్ లో ఆయన తోటి ఆర్టిస్ట్ కి అలాగే టెక్నీషియన్ కి ఇచ్చే  గౌరవం వేరు. నిబద్దత , మంచితనం పదాలకు ఆయనే ఎగ్జాంపుల్.

సల్మాన్ ఖాన్… అలా వచ్చారు

ఈ సినిమాలో పృథ్వి రాజ్ చేసిన పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చాలా ఆలోచించాను. చిరంజీవి గారి ఫ్యామిలీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ ఆ పాత్ర గురించి వారి కుటుంబంలో ఒక హీరోతో చెప్పించే కంటే మరో స్టార్ తో చెప్పిస్తే బెటర్ అని అనుకున్నాను. చిరంజీవి గారి ఫ్యామిలీతో క్లోజ్ గా ఉండే హీరోల లిస్టు వేసుకొని అందులో నుండి సల్మాన్ ఖాన్ గారిని సెలెక్ట్ చేసుకొని ఆ విషయం ఆయనతో చెప్పాను. సో చిరంజీవి గారు విన్న వెంటనే పాసిబుల్ అయ్యే హీరో సల్మాన్ ఖాన్ అనిపించింది. ఆయన కథ వినకుండానే ఈ సినిమా ఒప్పుకున్నారు. సినిమాలో ఆయన పాత్ర చిన్నదే అయినా ఫ్యాన్స్ సంతోష పడేలా ఉంటుంది.

గాడ్ ఫాదర్…కొన్ని మార్పులతో 

లూసిఫర్ రీమేక్ అవకాశం రాగానే చాలా సార్లు ఆ సినిమా చూశాను. అందులో నాకు అనిపించిన ఓ పాయింట్ తీసుకొని దాన్ని ఇలా తీస్తే బాగుంటుందని భావించి అదే విషయం చిరంజీవి గారికి చెప్పాను. నేను చూసిన కోణం ఆయనకి బాగా నచ్చింది. అప్పటి నుండి వర్క్ మొదలు పెట్టాను. అంతకు ముందు మిగతా దర్శకులతో ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి వారు ఎలాంటి వర్షన్ అనుకున్నారో తెలియదు. లూసిఫర్ కి గాడ్ ఫాదర్ కి చాలా మార్పులు ఉంటాయి. అవన్నీ సినిమా చూశాక మీకే తెలుస్తుంది. అందుకే మలయాళంలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. మెయిన్ గా స్క్రీన్ ప్లేలో చేంజ్ ఉంటుంది.

మెగా పవర్ ఉంటుంది 

లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ గారు కనిపించేది 50 నిమిషాలే. మిగతా పార్ట్ లో ఆయన కనిపించరు. కానీ గాడ్ ఫాదర్ చిరంజీవి గారు రెండు గంటలు కనిపిస్తారు. ఆయన కనిపించకపోయినా సర్వాంతర్యామిలా ప్రతీ సీన్ ఆయన గురించి చెప్పేలా ఉంటుంది. సినిమాలో మెగా పవర్ కనిపిస్తుంది. అది ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంటుందనుకుంటున్నాను.

 

సత్య దేవ్ గురించి మాట్లాడుకుంటారు

సినిమాలో పవర్ ఫుల్ విలన్ కేరెక్టర్ కోసం యంగ్ స్టర్ సత్య దేవ్ ను తీసుకున్నాం. ఆ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. సినిమా చూశాక చిరంజీవి గారి తర్వాత అందరూ మాట్లాడుకునేది సత్యదేవ్ గురించే. సినిమా చూసి మీరే చెప్తాం అతని పెర్ఫార్మెన్స్ గురించి.

సీక్వెల్ కి స్కోప్ ఉంది  

ఈ సినిమా మొదలు పెట్టి ఫినిష్ చేసే వరకూ మాకు సీక్వెల్ ఆలోచన లేదు. రెండు మూడు రోజులుగా సీక్వెల్ గురించి న్యూస్ వింటున్నా. మలయాళంలో పృథ్వి రాజ్ లూసిఫర్ కి సీక్వెల్ మొదలు పెట్టారు. తెలుగులో ప్రస్తుతానికి మాకు ఆలోచన లేదు. కానీ ఒకరికి అధికారం వచ్చాక కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి అయ్యాక ఎండ్ అయ్యే ఈ కథకి సీక్వెల్ చేసే స్కోప్ ఉంది. ప్రస్తుతానికి సీక్వెల్ గురించి మేము డిస్కస్ చేయలేదు.

తనిఒరువన్ …సీక్వెల్ 

దర్శకుడిగా తని ఒరువన్ సినిమా నాకు చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా చూసిన ఆడియన్స్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడారు. ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. నా తమ్ముడు జయం రవి లేదా రామ్ చరణ్ గారితో ఆ సీక్వెల్ ఉంటుంది. ఆ సినిమాను పాన్ ఇండియా సినిమాగా చేసే ఆలోచన ఉంది.

నాగార్జున గారితో ప్లానింగ్ 

నాగార్జున గారితో ఓ స్టైలిష్ యాక్షన్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలోనే మిగతా వివరాలు తెలియజేస్తాను.