KV Anand - ప్రముఖ దర్శకుడు ఇక లేరు

Friday,April 30,2021 - 07:43 by Z_CLU

కోలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కమెడియన్ వివేక్ మరణాన్ని మర్చిపోకముందే మరో మరణ వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ , దర్శకుడు KV ఆనంద్ కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారు జామున ఆయన గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే ఈ వార్త విని కోలీవుడ్ షాక్ కి గురైంది. సినిమాటోగ్రాఫర్ గా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు ఆనంద్. PC శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఆనంద్ ‘తెన్మవిన్ కొమ్భాత్’ అనే మలయాళ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా మారారు. మొదటి సినిమాకే సినిమాటోగ్రాఫర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారు. తమిళ్ లో ‘కాదల్ దేశం’ సినిమాతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయమయ్యారు. ఆ సినిమా తెలుగులో ప్రేమదేశంగా విడుదలై ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత శంకర్ డైరెక్ట్ చేసిన ‘బాయ్స్’ ,’ఓకె ఒక్కడు’, ‘శివాజీ’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు ఆనంద్. ఆ తర్వాత కెమెరామెన్ గా పలు సినిమాలకు పనిచేశారు.

ఇక తీసే సినిమాలను బట్టి కొంత మంది దర్శకులకు అభిమానులు ఏర్పడతారు. తను డైరెక్ట్ చేసిన సినిమాలతో అలాంటి అభిమానులని పొందారు ఆనంద్. ఈయన డైరెక్ట్ చేసిన ‘వీడోక్కడే’, ‘రంగం’,’బ్రదర్స్’ సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘రంగం’ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా కలెక్ట్ చేసి తెలుగు ప్రేక్షకలనూ ఆకట్టుకుంది. ఆసక్తికరమైన కథలను ఎంచుకోవడం, అంతే ఆసక్తిగా తెరకెక్కించడం ఆనంద్ స్పెషాలిటీ. అందుకే KV ఆనంద్ సినిమాలను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు ఎప్పుడూ అతని సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు.

నేడు తమ అభిమాన దర్శకుడు లేరని, ఇకపై అతని నుండి సినిమాలు రావని తెలిసి విచారంలో మునిగారు. తీసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్ లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు కేవీ ఆనంద్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics