డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంటర్వ్యూ

Monday,September 16,2019 - 01:29 by Z_CLU

రీమేక్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చాటి చెప్పిన హరీష్ శంకర్ మరోసారి రీమేక్ సినిమాతో రెడీ అయ్యాడు. వరుణ్ ను ‘వాల్మీకి’గా మార్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న హరీష్ శంకర్ ఈ సినిమా గురించి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు హరీష్ మాటల్లోనే…

వరుణ్ నా రూట్లోకి వచ్చాడు

‘దాగుడు మూతలు’ సినిమా ప్రాసెస్ లో వరుణ్ ని కలిసాను. ‘ఫిదా’, ‘తొలి ప్రేమ’ సినిమాలు చేసావు కదా అలాంటి ఓ లవ్ స్టోరీ చేద్దాం అని అడిగాను. అప్పుడు మీరు నా టైప్ సినిమా చేయడం కాదు నేనే మీ టైప్ సినిమా చేస్తా నాకు కొత్తగా ఉంటుంది అన్నాడు. అలా నేను తన రూట్లోకి వెళ్లి ఓ క్లాస్ లవ్ స్టోరి చేద్దామనుకుంటే తనే నా రూట్లోకి వచ్చి ‘వాల్మీకి’ చేసాడు.

‘వాల్మీకి’ విషయంలోనూ అదే జరిగింది

‘డీ.జే’ తర్వాత రీమేక్ సినిమా చేయాలి అనుకోలేదు. అలా కుదిరేసింది అంతే. మిరపకాయ్ తర్వాత కూడా స్ట్రెయిట్ సినిమా చేద్దామనుకొని కళ్యాణ్ గారిని కలిసాను. కానీ కళ్యాణ్ గారు దబాంగ్ రీమేక్ చేద్దామని చెప్పారు. అలా అనుకోకుండా ‘గబ్బర్ సింగ్’ చేసాను. మనం సినిమాను వెతుక్కోవడం కాదు సినిమానే మనల్ని ఎంచుకుంటుంది అని నా నమ్మకం. ‘వాల్మీకి’ విషయంలో కూడా అదే జరిగింది.

ఫేవరేట్ సినిమా అందుకే

డీజే తర్వాత కథ రాసుకుంటున్న టైంలో ‘పేట’ రిలీజ్ అయింది. అప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన ‘జిగర్తాండ’ సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమా నా ఫేవరేట్ కూడా. ఎప్పటి నుండో సినిమాను తెలుగులో తీయాలని ఉండేది. రాజు గారితో కూడా డిస్కస్ చేసాను. కానీ ఎప్పుడూ సిద్దార్థ్ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుందా అనుకునే వాణ్ణి. కానీ ఎప్పుడూ సీరియస్ గా ఆలోచించలేదు. నాలుగేళ్ల తర్వాత మళ్ళీ సినిమా చూసి ఎందుకో బాబి సిన్హా క్యారెక్టర్ మోర్ ఎట్రాక్టివ్ గా అనిపించింది. సిద్దార్థ్ క్యారెక్టర్ గురించే ఆలోచించాను కానీ ఆ బాబీ క్యారెక్టర్ ని ఎవారైనా హీరోతో చేయిస్తే బాగుంటుంది కదా అని ఆలోచించాను. ఆసక్తిగా అనిపించి అప్పుడు వరుణ్ ని కలిసాను. వరుణ్ కూడా ఎగ్జైట్ అయ్యాడు.

ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని అడిగారు

వరుణ్ ని ఫైనల్ చేసి సినిమా మొదలు పెట్టినప్పటి నుండి అందరూ సిద్దార్థ్ క్యారెక్టర్ వరుణ్ చేస్తున్నాడు ఒకే మరి బాబీ సిన్హా క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు.. అని అడిగేవారు. కొంత మంది విలన్స్ పేర్లు చెప్పి వీళ్ళల్లో ఎవరు అడిగారు. ఆ తర్వాత ఆ రోల్ వరుణ్ చేస్తున్నాడని తెలుసుకొని షాక్ అయ్యారు.


వరుణ్ కోసం కొన్నిమార్పులు

ఈ రీమేక్ లో ఈసారి పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. మన నేటివిటీకి తగ్గట్టుగా వరుణ్ హీరో కాబట్టి కొన్ని లిబర్టీస్ తీసుకొని చిన్న చిన్న మార్పులు చేశాను అంతే. గబ్బర్ సింగ్ లో చేసిన మార్పులు అయితే ఇందులో చేయలేదు. దానికి రీజన్ కార్తీక్ సుబ్బరాజ్. తను ఆల్రెడీ బెస్ట్ సీన్స్ రాసాడు. సో అవే వాడుకున్నాను.

ఆ ధైర్యంతోనే

‘జిగర్తాండ’ తెలుగులోనూ డబ్బింగ్ సినిమాగా విడుదలైంది. కానీ ఎవ్వరూ పెద్దగా చూడలేదు. ఆ ధైర్యంతోనే మళ్ళీ రైట్స్ తీసుకొని తీసాం.

ఇమేజ్ ఉండకూడదు అనుకున్నా

సినిమాలో హీరో క్యారెక్టర్ కి తెలుగులో ఎలాంటి ఇమేజ్ లేని హీరో అయితే బాగుంటుంది అనుకున్నాను. ఆ టైంలో నాకు అధర్వ స్ట్రైక్ అయ్యాడు. బెస్ట్ ఆప్షన్ అనిపించింది. వెంటనే చెప్తే తను కూడా ఎగ్జైట్ అయ్యాడు. సో అలా సిద్దార్థ్ ప్లే చేసిన క్యారెక్టర్ కి అధర్వ ని తీసుకోవడం జరిగింది.

నా సినిమాల్లో ఎక్కువ లెంగ్త్ ఇదే

సినిమాల్లో అన్నిటికంటే ఈ సినిమా లెంగ్త్ ఎక్కువ. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లేవు. ఫైట్ మాస్టర్స్ కూడా రెండు మూడు రోజులే చేసారు. పాటలు కూడా ఎక్కువగా లేవు. కానీ ఈసారి మోర్ కంటెంట్ తో వస్తున్నా. అందుకే లెంగ్త్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు.


కథలో వచ్చే సాంగ్

‘దేవత’ సినిమాలో వెల్లువచ్చి గోదారమ్మ అనే సాంగ్ ను ఇందులో రీమిక్స్ చేసాం. అది కూడా కథలో వచ్చే సాంగ్. ఏదో పెట్టాలని పెట్టింది కాదు. ఆ సాంగ్ ను థియేటర్స్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఈ తరానికి ఆ తరం పాటను గుర్తుచేసి వినిపించాలనే ఉద్దేశ్యంతో సినిమా చేసాను.

రెండు నెలలు ఆలస్యం అదే కారణం

వరుణ్ లుక్ కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత వరుణ్ మేకోవర్ గురించి ఇంకా మాట్లాడుకుంటారు. చాలా కష్టపడి గెడ్డం పెంచాడు. తన గెడ్డం కోసం రెండు నెలలు షూటింగ్ లో ఆలస్యం జరిగింది. ఇక సమ్మర్ లో ఆ గెడ్డంతో చాలా ఇబ్బంది పడుతూ నటించాడు. కానీ వరుణ్ డెడికేషన్ కి ఫిదా అయిపోయాను. షూటింగ్ స్పాట్ కి వచ్చాక మొబైల్ వాడకపోవడం అతనిలో నాకు బాగా నచ్చింది.

పూజా హెగ్డే కూడా గెస్ట్ రోలే

సినిమాలో బ్రహ్మానందం గారు , సుకుమార్ గారు గెస్ట్ రోల్స్ చేసారు. నిజం చెప్పాలంటే పూజా హెగ్డే కూడా గెస్ట్ రోలే. తక్కువ సేపు కనిపించినా పూజా క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయింది.

 

గ్యాప్ తీసుకోలేదు వచ్చింది

‘డీజే’ తర్వాత ఇమిడియట్లీ సినిమా చేయాలనుకున్నా. కానీ కుదరలేదు. రెండేళ్ళు గ్యాప్ వచ్చింది. ‘అల వైకుంఠపురములో’ టీజర్ లో బన్నీ చెప్పినట్టు గ్యాప్ తీసుకోలేదు వచ్చింది అంతే.


వరుణ్ విజృంభించడం చూస్తారు

మెగా ఫ్యాన్స్ కి , సినిమా లవర్స్ కి నేను చెప్పేది ఒక్కటే సినిమాలో వరుణ్ విజృంభించడం చూస్తారు. గద్దల కొండ గణేష్ గా వరుణ్ కచ్చితంగా మెస్మరైజ్ చేస్తాడు.

ఇంకా అనుకోలేదు

ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా ‘వాల్మీకి’ రిలీజ్ మీదే ఉంది. నెక్స్ట్ రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేంటనేవి త్వరలోనే చెప్తాను.