డైరెక్టర్ బుచ్చి బాబు ఇంటర్వ్యూ

Wednesday,February 10,2021 - 05:00 by Z_CLU

మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. టాక్ బయటికి రాలేదు. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు బుచ్చిబాబు.  సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్న బుచ్చి బాబు మరో రెండు రోజుల్లో తను కొన్నేళ్ళ క్రితం రాసుకున్న కథను తెరపై చూపించబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానున్న సందర్భంగా బుచ్చిబాబు మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు తన మాటల్లోనే…

రకరకాల కథలు 

మా బాస్ సుకుమార్ గారి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నప్పుడే డైరెక్టర్ గా ఎలాంటి కథతో రావాలి..? అని ఆలోచిస్తుండేవాడిని. ఆ టైంలో రకరకాల కథలు అనుకునే వాడిని. కానీ ఏ కథ చేయాలన్నా ముందుగా మా ఇంటి గుమ్మంలో ఏమైనా కథా ఉందా ? లేదా మా ఇంటి ఎదురుగా కానీ ఊరిలో గానీ ఏదైనా కథ ఉందా ? అని ఆలోచిస్తా. బేసిక్ గా మన చుట్టూ మనం చూసిన కథల్ని తెలుసుకున్న కథల్ని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తాను. అలా నా మనసులో పుట్టిన కథే ‘ఉప్పెన’.

అందులో నేనొకడిని 

సుకుమార్ గారు నాకు మ్యాథ్స్ టీచర్. కాకినాడ ఆదిత్య కాలేజీలో చదివే రోజుల్లో ఆయన నాతో చాలా క్లోజ్ గా ఉండేవారు. ఆ టైంలో ఇండస్ట్రీకి వెళ్తానని ఆయన రాసుకున్న కథలు చెప్పిన అతి కొద్ది మందిలో నేనూ ఒకడ్ని.  తర్వాత హైదరాబాద్ వచ్చి MBA కంప్లీట్ చేసి సుక్కు సార్ దగ్గర ఆర్య 2 సినిమాకు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. అక్కడి నుండి రంగస్థలం వరకు ఆయన సినిమాలను వర్క్ చేశాను. ‘ఉప్పెన’ రిలీజ్ అయ్యాక కూడా ‘పుష్ప’ సినిమా కి వర్క్ చేయాలనుకుంటున్నా. బికాజ్ సుకుమార్ గారి దగ్గర ఏదో ఒక విషయం నేర్చుకోవాలని ఉంటుంది.

నా అదృష్టం

‘ఉప్పెన’ కథ రాసుకున్నాక ‘రంగస్థలం’ టైంలో సుకుమార్ గారికి చెప్పాను. ఆయనకి బాగా నచ్చింది. ఈ కథతో ప్రొసీడ్ అవ్వు అంటూ సపోర్ట్ ఇచ్చారు. వెంటనే రవి గారితో, నవీన్ గారితో మాట్లాడి ప్రాజెక్ట్ సెట్ చేశారు. ఒక స్టూడెంట్ కెరీర్ కోసం అంతలా తపన పడే గురువు దొరకడం నా అదృష్టం.

 

తెలుగులో రావెందుకు

కొన్ని తమిళ్ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి సినిమాలు మన తెలుగులో రావెందుకు ? అనుకునే వాడిని. మన కంటెంట్ తో ఇలాంటివి చెప్పొచ్చు కదా అనిపించేది. అన్ని కథలకు ఆ నేపథ్యం కుదరదు. లక్కీగా ఈ కథకి అది కుదిరింది.

వైష్ణవ్ నే ఫిక్సయ్యా 

ఈ కథ ఒకే అవ్వగానే ఇన్స్టాలో వైష్ణవ్ తేజ్ ఫోటో చూసి ఇతనే నా హీరో అని ఫిక్సయ్యాను.  వైష్ణవ్కి కథ చెప్పడం తనకి బాగా నచ్చడంతో సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. నిజానికి వైష్ణవ్ లేకపోతే ‘ఉప్పెన’ ఉండేది కాదేమో అనిపిస్తుంది.

చిరంజీవి గారు అలా అనేసరికి 

వైష్ణవ్ చిరంజీవి గారికి కూడా కథ చెప్పమని అడిగాడు. కానీ మెగాస్టార్ గారికి స్క్రిప్ట్ నెరేట్ చేయాలంటే చాలా భయమేసింది. ఏదైతే అది అయ్యిందని వెళ్లి కూల్ గా కథ చెప్పేసా. ఆయనకీ బాగా నచ్చింది. హిట్ ఫార్ములాతో కథ రెడీ చేశావ్ బాగుంది. అంతే బాగా తీస్తే మంచి సినిమా అవుతుందని చెప్పి వైష్ణవ్ ఈ సినిమా నువ్వు చేస్తావా లేదా నన్ను చేయమంటావా ? అని అన్నారు. ఆ మాట విని మురిసిపోయాను.

చాలా కష్టమనిపించింది

కొత్త వాళ్ళని డైరెక్ట్ చేయడం, అదీ నాలాంటి కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో తేజ గారిని నిజంగా మెచ్చుకోవాలి. ఆయన ఎంతో మంది కొత్త వాళ్ళను పరిచయం చేసి వాళ్ళతో సినిమాలు చేశారు. వైష్ణవ్ తేజ్ కి నటుడిగా సినిమా అంటే తెలుసు కాబట్టి పరవాలేదు కానీ కృతితో ఆ క్యారెక్టర్ చేయించడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఆ అమ్మాయి తక్కువ టైంలో తెలుగు నేర్చుకొని క్యారెక్టర్ లో ఇమిడిపోయింది.

 

ఆ ఆలోచనే రాలేదు 

‘ఉప్పెన’ కథ ఎవరికైనా నరేట్ చేసేటప్పుడు విలన్ పేరు రాగానే విజయ్ సేతుపతి  అని చెప్పే వాడిని. అలా స్క్రిప్ట్ స్టేజిలోనే విలన్ గా విజయ్ సేతుపతి గారినే ఫిక్సయ్యాను. అసలు ఆయన చేయకపోతే అనే ఆలోచనే రాలేదు. ఉప్పెన కథే విజయ్ సేతుపతి గారిని తెచ్చుకుంది అని ఫీలవుతున్నా.

ఆయన కూడా హైలైట్ 

నిజానికి ‘ఉప్పెన’లో అందరు విజయ్ సేతుపతి నటన హైలైట్ గా ఉంటుందని అనుకుంటున్నారు. ఆయనతో పాటు సాయి చంద్ గారి నటన కూడా సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో విజయ్ సేతుపతి గారిని కూడా డామినేట్ చేసేలా ఆయన పెర్ఫార్మెన్స్ ఉంటుంది.

దేవి గారు ప్రాణం పెట్టారు

ఈ కథ చెప్పగానే దేవి గారు బాగా ఎగ్జైట్ అయ్యారు. స్క్రిప్ట్ అయ్యే లోపు రెండు సార్లు సుకుమార్ గారికి కాల్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. నిజంగా దేవి గారి మ్యూజిక్ లేకపోతే సినిమాకి ఇంత బజ్ వచ్చేది కాదేమో. నీ కన్ను నీలి సముద్రం పాటతో పాటు మిగతా పాటలన్నీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఫైనల్ గా  దేవి గారిచ్చిన రీ రికార్డింగ్ కూడార్ కూడా సినిమాకు ప్రాణం పోసింది.

 

‘ఉప్పెన’ ఒక జీవితం

‘ఉప్పెన’ చూస్తుంటే సినిమా చూస్తున్నట్టు ఉండదు. తెరపై ఓ జీవితం చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక మంచి లవ్ స్టోరీతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ చక్కని ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కించిన సినిమా ఇది. కొన్ని సందర్భాల్లో ఆడియన్ కథకి కనెక్ట్ అయి ఎమోషనల్ అవుతారు.

అవన్నీ ఫ్రెష్ గా ఉంటాయి.

స్టోరీ ఓల్డ్ ఫార్మేట్ లోనే ఉండొచ్చు కానీ క్యారెక్టరైజేషన్స్, సన్నివేశాలు,  డైలాగ్ డెలివరీ , స్విచువేషణ్స్ ఇలా అన్ని ఫ్రెష్ గా అనిపిస్తాయి. సినిమా ఎండింగ్ లో మాత్రం ఒక కొత్త ప్రేమకథ చూశామని ఆడియన్స్ ఫీలవుతూ థియేటర్స్ నుండి బయటికొస్తారు.

క్లైమాక్స్ అలా ఉంటుంది 

సినిమాలో క్లైమాక్స్ గురించి రకరకాల ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ గా నేను ఒక్కటి మాత్రం చెప్పగలను. క్లైమాక్స్ హత్తుకునేలా ఉంటుంది. ఇప్పటి వరకు సినిమా చూసిన అందరు అలాగే ఫీలయ్యారు.

మైత్రి లోనే మరో సినిమా 

నెక్స్ట్ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ లోనే ఉండనుంది. కథ సిద్దంగా ఉంది. ఒక స్టార్ హీరోతో ఆ సినిమా చేయబోతున్నాను. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం.

 

Also Read వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూ