దిల్ రాజు స్పెషల్ ఇంటర్వ్యూ

Monday,December 18,2017 - 03:01 by Z_CLU

వరుస విజయాలతో దూసుకుపోతున్న దిల్ రాజు ఈరోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 5 హిట్స్ కొట్టిన ఈ నిర్మాత.. ఎంసీఏతో డబుల్ హ్యాట్రిక్ కు రెడీ అవుతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ ఎత్తుపల్లాల్ని మీడియాతో పంచుకున్నాడు దిల్ రాజు.

 

ఓవైపు సంతోషం.. మరోవైపు బాధ
ఈరోజుతో నాకు 47 ఏళ్లు పూర్తయ్యాయి. పరిశ్రమకొచ్చి 22 సంవత్సరాలైంది. నిర్మాతగా 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ ఏడాది బర్త్ డే లో బాధ, సంతోషం రెండూ ఉన్నాయి. ఈసారి బర్త్ డేకి నా భార్య నా పక్కన లేదు. అది బాధ కలిగించే విషయం. ఇక ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. ఈ ఏడాది ఏకంగా 5 హిట్స్ వచ్చాయి. ఎంసీఏతో డబుల్ హ్యాట్రిక్ కూడా రాబోతోంది.

 

అన్నీ సమానంగా తీసుకుంటా
నా కెరీర్ లో ఎత్తుపల్లాలన్నీ ఉన్నాయి. నిర్మాతగా సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ. 28 సినిమాలు తీస్తే 22 సినిమాలు హిట్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్ గా ఈ ఏడాది బ్యాడ్ ఇయర్ నాకు. వ్యక్తిగతంగా నా భార్యను కోల్పోయాను. బాధ, సంతోషం అన్నింటినీ ఈక్వెల్ గా తీసుకోవాలి.

 

పంపిణీ అంటే భయమేస్తోంది
ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే భయమేస్తోంది. నిర్మాతగా సక్సెస్ అయ్యాను కాబట్టి ఆర్థికంగా బ్యాలెన్స్ అయింది. లేకపోతే చాలా నష్టాలు చూసేవాడ్ని. డిస్ట్రిబ్యూషషన్ కింద చాలా డబ్బులు పెట్టాను. కానీ ఏదీ ఆడలేదు. ఇకపై డిస్ట్రిబ్యూషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. నిజానికి డిస్ట్రిబ్యూషన్ తగ్గించేద్దాం అనుకుంటున్నాను.

 

అప్ డేట్ అవ్వాల్సిందే
ఆడియన్స్ అభిరుచి ప్రతి ఏటా మారిపోతుంది. అంతే ఫాస్ట్ గా మనం కూడా మారాలి. ఇప్పుడు జనాలకు చాలా ఎంటర్టైన్ మెంట్ ఉంది. వాటన్నింటినీ దాటి మన సినిమా కోసం థియేటర్లకు రావాలంటే మనం చాలా కొత్తగా ఆలోచించాలి.
బాగా ప్రచారం చేయాలి. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండాలి.

 

ఈ ఏడాది డీజే నా బెస్ట్
ఈ ఏడాది నా బ్యానర్ నుంచి 5 సినిమాలొచ్చాయి. వీటిలో నాకు నిర్మాతగా బాగా నచ్చిన సినిమా డీజే. నా 14 ఏళ్లప్రొడక్షన్ కెరీర్ లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అది. అందుకే ఈ ఏడాది ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టం.ఆ సినిమా తర్వాతే నాకు మిగతా సినిమాలన్నీ. ఫిదా, శతమానంభవతి, నేను లోకల్, రాజా ది గ్రేట్ సినిమాలంటే కూడా చాలా ఇష్టం. ఇప్పుడు ఆరో సినిమాగా ఎంసీఏ వస్తోంది.

 

కలెక్షన్ల విధానం మారాలి
కలెక్షన్ల విషయంలో టాలీవుడ్ రాంగ్ ట్రాక్ లో వెళ్తోంది. మొదటి రోజు షేర్ అని చెబుతున్నారు. కానీ అందులో హైర్స్ కూడా కలుపుతున్నారు. హైర్స్ ను రాబడి కింద ఎలా చూపిస్తారు. అది తప్పంటాను నేను. హైర్స్ (Hires) లేకుండా షేర్ చెప్పాలి. అసలు ఇవన్నీ కాదు.. బాలీవుడ్ స్టయిల్ లో గ్రాస్ చెప్పాలి. అప్పుడు ఎవరికీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. కానీ ఇక్కడ అనాదిగా షేర్ చెప్పడం కామన్ అయిపోయింది. దాని వల్లే వివాదాలు వస్తున్నాయి.

 

వివాదాలు తగ్గాలంటే..
ఒక సినిమా స్టామినా వారం తర్వాత మాత్రమే తెలుస్తుంది. మొదటి రోజు, రెండో రోజు, వీకెండ్ వసూళ్లు చూడ్డం వేస్ట్. దానివల్ల క్షణికానందం తప్ప ఎవరికీ ఏదీ ఒరిగేది ఉండదు. వారం తర్వాత గ్రాస్ తీసుకొని అందులోంచి షేర్ ఇస్తే జెన్యూన్ ఫిగర్స్ వస్తాయి. అప్పుడు వివాదాలు తగ్గుతాయి. బాలీవుడ్ లో షేర్లు మాట్లాడరు. గ్రాస్ మాత్రమే చెబుతారు.

 

నేను వ్యాపారం చేస్తున్నాను కానీ..
అల్టిమేట్ గా ఒక ప్రాజెక్టు ఖరీదు 10 కోట్లు అనుకుంటే, మొత్తం ఎంత కలెక్ట్ చేసింది అనేది చూస్తాను. అందులో శాటిలైట్,డిజిటల్, ఆడియో.. ఇలా అన్నీ కలుపుకొని ఫైనల్ గా ఆఖరి రోజు ఎంత గ్రాస్ వచ్చింది. ఖర్చుల కింద ఎంత పోయింది.
ఎంత మిగిలింది అనేది చూస్తాను. డబ్బులు మిగిలితే అది హిట్ సినిమా. లేదంటే నా దృష్టిలో అది ఫ్లాప్. ఇది వ్యాపారం. నేను ఏ సినిమానైనా డబ్బుతోనే చూస్తాను.

 

డిస్ట్రిబ్యూటర్లతో అన్నీ షేర్ చేసుకుంటా
సినిమా రిలీజ్ అప్పుడు నాకు భయం ఉండాలి. డిస్ట్రిబ్యూటర్లు ఏమౌతారు అనే ఆలోచన ఉండాలి. అప్పుడే నేను నిర్మాతగా రాణిస్తాను. ప్రతి విషయంలో నాదే బాధ్యత. కృష్ణాష్టమి సినిమాను ఓవర్సీస్ లో కొత్తవాళ్లు టేకప్ చేశారు. 90 లక్షలు కట్టారు. మొత్తం పోయింది వాళ్లకు. ఆ విషయం నాకు అవసరం లేదు. నేను పట్టించుకోనక్కర్లేదు. కానీ ఏడాదిన్నరగా వాళ్లతో టచ్ లో ఉన్నాను. వాళ్లకు డబ్బులు ఇప్పిస్తున్నాను. ఇలా అన్ని విధాలుగా షేర్ చేసుకుంటూనే
సక్సెస్ ఫుల్ గా నిలబడతాం.

 

భ్రమలో బతకను
ఫేక్ లో బతకాల్సిన అవసరం నాకు లేదు. ఈ ఏడాది 6 సినిమాలు ఆడాయని నన్ను నేను మభ్యపెట్టుకోను. డబుల్ హ్యాట్రిక్ అనేది నాకు సంతృప్తినిచ్చే విషయం. నేను హ్యాపీగా ఉన్నానా లేదా అనేది నన్ను నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను.

 

సాయిపల్లవి మంచి పిల్ల
శ్రీనివాస కల్యాణం అనే సినిమా కథను సాయిపల్లవి విని రిజెక్ట్ చేసిందంటూ వార్తలొచ్చాయి. నిజానికి ఆ అమ్మాయికి శ్రీనివాస కల్యాణం కథ కూడా చెప్పలేదు. ఆమెకు ఆ సినిమాకు సంబంధమే లేదు. నామీద ఇలాంటి వార్తలు చాలావస్తుంటాయి. కానీ నేను పట్టించుకోను. సాయిపల్లవి లేట్ గా వస్తుంటూ వార్తలొచ్చాయి. అందులో కూడా వాస్తవం లేదు.ఫిదాకు ఎంసీఏకు ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. మా బ్యానర్ లో సాయిపల్లవి మరో సినిమా చేస్తుంది.

 

కొత్త కథలు ఎందుకు తీయాలి
కొత్త సినిమాలు తీయరా అని నన్ను అడుగుతుంటారు. చాలా డబ్బు పెడుతున్నప్పుడు కేవలం ఆ యాంగిల్ లోనే ఆలోచించాలి. మంచి సినిమా ద్వారా డబ్బు రాదు. కొన్ని ప్రయోగాలు చేస్తే పేరు వస్తుంది. కానీ డబ్బు రాదు. అది నాకు
అక్కర్లేదు. ఫిదా సినిమాలా ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తే పేరు, డబ్బు రెండూ వచ్చాయి. అలాంటివి నాకు కావాలి. నెక్ట్స్ ఇయర్ మరిన్ని మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేస్తాను.

 

అజ్ఞాతవాసి నాదే
నైజాంలో అజ్ఞాతవాసి నేను కొన్నాను. అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కానీ నాకు నిర్మాత చినబాబుకు మధ్య ఎప్పుడూ ఓ మంచి రిలేషన్ ఉంటుంది. మామధ్య అగ్రిమెంట్లు అక్కర్లేదు. రేపు ఇంకేదైనా సినిమాకు నాకు డ్యామేజ్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్ గా ఆయన నన్ను కాపాడతాడు. నేను కోరుకునేది అదే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ప్రొడ్యూసర్ మొత్తం తిరిగి ఇచ్చేయాలని కోరుకోకూడదు. కోటి నష్టం వచ్చిన దగ్గర 30 లక్షలు వెనక్కి వచ్చినా సంతోషమే కదా.

 

అన్ని చిన్న సినిమాలు ఆడవు
పెళ్లిచూపులు ఆడగానే అన్ని చిన్న సినిమాలు ఆడేస్తాయా.. అర్జున్ రెడ్డి ఆడితే మిగతావన్నీ ఆడేస్తాయా.. ఇలాంటి చిన్నసినిమాలు చూసి మరిన్ని సినిమాలు తీస్తున్నారు. కంటెంట్ పై ప్రధానంగా దృష్టిపెట్టకుండా డబ్బులు పెడితే నష్టాలే
వస్తాయి. ఈమధ్య అమెరికాలో ఉంటున్న నా మిత్రుడొకరు 5 కోట్లు పెట్టి సినిమా తీశాడు. నాకు చూపించాడు. మొత్తంపోతాయని చెప్పాను. కనీసం పబ్లిసిటీ అయినా తగ్గించుకో అని చెప్పాను. దానికి మళ్లీ 95 లక్షలు పెట్టాడు. నా మాట వినలేదు. 5 కోట్ల 95 లక్షలు పోయాయి. సినిమా మేకింగ్ పై అవగాహన, కంటెంట్ పై కంట్రోల్ ఉంటే నష్టాలు తగ్గుతాయి.అన్ని సినిమాలు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లా అయిపోవు.

 

వచ్చే ఏడాది మరో ఇద్దరు
కొత్త ఏడాదిలో మరో ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేయబోతున్నాను. అదే నువ్వు అదే నేను సినిమా ఓకే చేసాను. దీనికి శశి అనే షార్ట్ ఫిలిం మేకర్ డైరక్టర్. మరో కథ కూడా ఓకే అయింది. ఈ ఇద్దరూ వెయిటింగ్ లో ఉన్నారు. వచ్చే ఏడాది వీళ్లతో సినిమాలు చేస్తాను.

 

వాళ్లతో గ్యాప్ లేదు
నితిన్, రవితేజ లాంటి హీరోలకు నేను గ్యాప్ ఇవ్వలేదు. వాళ్లతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. గ్యాప్ అలా వచ్చేసిందంతే. నా కథకు, మైండ్ సెట్ కు సెట్ అయితే వెంటనే చేసేస్తాను. నితిన్ నే తీసుకుంటే.. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాకు ఓకే అయ్యాడు. ఆ వెంటనే హరీష్ శంకర్ సినిమా దాగుడు మూతల్లో కూడా ఓకే అయ్యాడు.

 

ఇండియన్-2 నుంచి తప్పుకున్నాను
ఇండియన్-2 చేద్దామని అనుకున్నాను. కానీ ప్రస్తుతం నాకున్న కమిట్ మెంట్స్, ఒత్తిడి వల్ల అంత పెద్ద సినిమాకు న్యాయం చేయలేమోనని అనిపిస్తోంది. ఇక్కడున్న సినిమాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. అందుకే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాను. గతంలో దర్శకుడు శంకర్ ను సినిమా చేద్దామని అడిగాను. అది గుర్తుంచుకొని శంకర్ పిలిచి అవకాశం ఇచ్చాడు. వెంటనే నచ్చి ఒప్పుకున్నాను. కానీ వర్కవుట్ అవ్వదని తర్వాత తెలిసింది. నా మెంటాలిటీకి అది నాకు సూట్ అవ్వదు. అదొక సినిమా అవుతుంది తప్ప నా సినిమా కాదు.