సరికొత్త దర్శకుడ్ని తెరపైకి తీసుకొస్తున్న సుకుమార్

Thursday,July 06,2017 - 06:36 by Z_CLU

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా సరికొత్త స్టోరీలైన్ తో వస్తోంది. ప్రేమ, తపన మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే ఎలిమెంట్ సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సాయికార్తీక్ అందించిన పాటలను ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను ఈ నెల 15న ఓ స్టార్ హీరో చేతుల మీదుగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతగా సుకుమార్ కు ఇది రెండో సినిమా.