నిరీక్షణ.. వీళ్లకు ఇది చాలా కష్టం

Wednesday,May 20,2020 - 01:15 by Z_CLU

సినిమాలు వాయిదాపడడం కొత్త కాదు, కాకపోతే ఈసారి కాస్త ఎక్కువ నెలలు వాయిదా పడుతున్నాయి. కానీ ఎన్నో ఆశలతో సినిమా రిలీజ్ ల కోసం చూస్తున్న కొంతమందికి మాత్రం ఈ లాక్ డౌన్ తీవ్ర నిరాశను మిగిల్చింది. మరెంతో టెన్షన్ పెడుతోంది. దీనికి కారణం ఆ సినిమాలు వీళ్లకు ఫస్ట్ మూవీస్ కావడమే. ఆ సినిమాలేంటో… వాటిపై ఆశలు పెట్టుకున్న వారెవరో చూద్దాం.

మెగాస్టార్ మేనల్లుడు, సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ ‘ఉప్పెన’ అనే సినిమా చేశాడు. మొదటి సినిమాకే ఓ ప్రేమకథను ఎంచుకొని సినిమా చేసాడు. షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉండగానే ఏప్రిల్ 2న విడుదల అంటూ మేకర్స్ ప్రకటించారు. ఇక రిలీజైన రెండు పాటలు కూడా సూపర్ హిట్టవ్వడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. సరిగ్గా రిలీజ్ దగ్గరికొచ్చే సరికి లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. దీంతో సమ్మర్ లో మొదటి సినిమాతో హంగామా చేయాలనుకున్న వైష్ణవ్ తేజ్ మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఇక ఇదే సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న బుచ్చిబాబు కూడా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ అయ్యే రోజు కోసం ఎదురుచూస్తున్నారిద్దరు.

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ హీరోగా మారి తొలి ప్రయత్నంగా ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా చేశాడు. మున్నా అనే డెబ్యూ డైరెక్టర్ తో ఈ సినిమా చేసి రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నాడు ప్రదీప్. నీలి నీలి ఆకాశం అనే సాంగ్ తో మంచి బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా కూడా లాక్ డౌన్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. మొదటి సినిమాతో వెండితెరపై హీరోగా ప్రేక్షకులను అలరించి మంచి హిట్ కొట్టాలని భావిస్తున్న ప్రదీప్ కు ఇంకొన్ని రోజుల పాటు నిరీక్షణ తప్పదు.

‘మహానటి’ తర్వాత కీర్తి సురేష్ తో ‘మిస్ ఇండియా’ అంటూ సినిమా తీసిన దర్శకుడు నరేంద్ర నాథ్ ది కూడా ఇదే పరిస్థితి. ఇదే అతని మొదటి సినిమా కావడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి సినిమా థియేటర్స్ లోకి వచ్చేది. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలిచినట్టుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతం దర్శకుడితో పాటు నిర్మాత కూడా త్వరగా పరిస్థితులు చక్కబడితే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు.


‘జాను’తో ఇటివలే ప్రేక్షకుల ముందుకొచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’ అనే సినిమాతో సమ్మర్ బరిలో దిగాలనుకున్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న కిషోర్… మొదటి సినిమాతో మంచి విజయం అందుకోవాలని చూసాడు. కానీ ఇప్పుడు సమ్మర్ మిస్ అయినట్టే.


గతేడాది ప్రతి రోజు పండగే తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల 1న ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ థియేటర్స్ లో మంచి వినోదం అందించే వాడు. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న సుబ్బు కూడా విడుదలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కట్ చేస్తే షూటింగ్ ఫినిషింగ్ స్టేజిలో ఉండగా షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూసివేయడం జరిగింది. దీంతో ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే ఫినిష్ చేసి థియేటర్స్ లోకి దింపాలని భావిస్తున్నారు.

ఇలా తమ డెబ్యూ సినిమాతో ప్రేక్షకులకు వినోదం అందించి సమ్మర్ హిట్స్ అందుకోవాలని చూసిన వీరందరి ఆశలను నిరాశ చేసి వెయిటింగ్ మూడ్ లోకి తోసింది లాక్ డౌన్. ప్రస్తుతం షూటింగ్ పర్మీషణ్ కోసం , అలాగే థియేటర్స్ తెరుచుకునే రోజు కోసం ఎదురుచూస్తున్న వీళ్ళు ఎలాంటి హిట్స్ అందుకుంటారో చూడాలి.