కామెడీ కింగ్ కెరీర్ హైలెట్స్

Wednesday,February 01,2017 - 11:34 by Z_CLU

ఆ ఫేస్ చూడగానే ఫక్కున నవ్వొస్తుంది. చిన్న ఎక్స్ ప్రెషన్ ఇస్తే చాలు కడుపు చెక్కలవుతుంది. ఒకప్పుడు డైలాగ్ చెబితేనే హాస్యం పండేది. కానీ బ్రహ్మీని చూస్తే చాలు టన్నుల కొద్దీ కామెడీ పుట్టుకొస్తుంది. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన బ్రహ్మానందం ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పరిశ్రమలో అందరివాడిగా గుర్తింపుపొందిన ఈ హాస్యబ్రహ్మ కెరీర్ లోని కొన్ని మరపురాని సన్నివేశాల్ని చూద్దాం.

వెయ్యికి పైగా చిత్రాలతో ఇప్పటికే గిన్నిస్ బుక్ లో చోటుసంపాదించుకున్నారు బ్రహ్మానందం. దశాబ్దాలుగా కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ బ్రహ్మి కామెడీకి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ బ్రహ్మానందం తెరపై మెరుస్తూనే ఉన్నారు. కోట్లాది మందికి నవ్వులు పంచుతూనే ఉన్నారు. గురువు జంధ్యాల చలవతో సినీ రంగంలో నిలదొక్కుతున్న బ్రహ్మానందం… జంధ్యాల సినిమాలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యారు.

హీరో ఎవరైనా ఆ సినిమాలో బ్రహ్మి ఉండాల్సిందే. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇలా సీనియర్ హీరోలతో పాటు… రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్, మహేష్ లాంటి ఇప్పటితరం హీరోలతో కూడా కలిసినటిస్తూనే ఉన్నారు బ్రహ్మానందం. అంతెందుకు.. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో కామెడీ పండించిన హాస్య బ్రహ్మ… తర్వాత నాగార్జున సినిమాల్లో మెరిసి, ఇప్పుడు లేటెస్ట్ గా అఖిల్ సినిమాలో కూడా నవ్వించారు. అలా తరతరాలుగా ప్రేక్షకులు బ్రహ్మానందం కామెడీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.

ప్రతి నటుడికి ఉన్నట్టుగానే బ్రహ్మానందం కెరీర్ లో కూడా ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఒకప్పుడు బ్రహ్మానందం కామెడీని ఆహా..ఓహో అని మెచ్చుకున్న నోళ్లే ఆ తర్వాత విమర్శించాయి. చాలామంది దర్శకులు… మొనాటనీ పేరుతో బ్రహ్మానందాన్ని పక్కనపెట్టారు కూడా. సరిగ్గా ఇక్కడే బ్రహ్మానందంలో టాలెంట్ మనకు కనిపిస్తుంది. ట్రెండ్, జనరేషన్, ప్రేక్షకుల టేస్ట్ కు తగ్గట్టు తనను తాను మార్చుకున్నారు బ్రహ్మి. ఆ కష్టమే బ్రహ్మానందాన్ని లెజండరీ నటుడిగా నిలబెట్టింది.

త్రివిక్రమ్ రాకముందు ఒక లెక్క. త్రివిక్రమ్ వచ్చిన తర్వాత మరో లెక్క. బ్రహ్మానందం విషయంలో మాత్రం దీన్ని కచ్చితంగా చెప్పుకోవాలి. తన సినిమాలతో త్రివిక్రమ్ ప్రేక్షకుల్ని ఎంతలా ఎంటర్ టైన్ చేశాడో.. ఆ సినిమాల్లో బ్రహ్మానందానికి అంతమంచి క్యారెక్టర్లు ఇచ్చాడు. నువ్వు నాకు నచ్చావ్ నుంచి మొన్నటి అత్తారింటికి దారేదిలో బద్దం భాస్కర్ క్యారెక్టర్ వరకు ఎన్నో పాత్రలతో బ్రహ్మానందాన్ని డిఫరెంట్ గా చూపించాడు త్రివిక్రమ్. ఈ దర్శకుడితో పాటు వినాయక్, శ్రీనువైట్ల లాంటి దర్శకులు బ్రహ్మిలోని కామెడీ యాంగిల్ ను పర్ ఫెక్ట్ గా వాడుకున్నారు.

ఒక దశలో ఏడాదికి 20 సినిమాలు చేసిన రికార్డు బ్రహ్మానందానిది. ఇప్పటికీ బ్రహ్మానందం లేకుండా సినిమాలు చేయలేరు కొందరు హీరోలు. అంతెందుకు.. మెగాస్టార్ చిరంజీవికే తన ప్రతిష్టాత్మక రీఎంట్రీ మూవీకి
బ్రహ్మానందం కావాల్సి వచ్చింది. చిరంజీవి చెప్పడంతోనే బ్రహ్మానందం కామెడీ ట్రాక్ ను పెట్టామని స్వయంగా దర్శకుడు వినాయక్ చెప్పుకొచ్చాడు.

గతేడాదిలోనే వెయ్యి సినిమాల రికార్డును క్రాస్ చేసి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకున్నాడు బ్రహ్మానందం. కెరీర్ లో లెక్కలేనన్ని అవార్డులు అందుకున్న ఈ లెజెండరీ నటుడికి పద్మశ్రీ పురస్కారం కూడాా దక్కింది. 61 ఏళ్ల బ్రహ్మానందం.. మరిన్ని కెవ్వు కామెడీ సీన్లతో మనల్ని అలరించాలని కోరుకుంటూ… లెజెండ్ బ్రహ్మానందానికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది జీ-సినిమాలు.