అభినవ్ గోమటం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Thursday,July 05,2018 - 11:48 by Z_CLU

‘స్టీవ్ చూడు ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో’.. ఈ నగరానికి ఏమైంది ట్రయిలర్ లో ఇలా ఒకే ఒక్క డైలాగ్ తో కామెడీ పుట్టించి అందర్నీ తనవైపు ఎట్రాక్ట్ చేసుకున్నాడు అభినవ్ గోమటం. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇతడి టాలెంట్ ఏంటనేది ఆడియన్స్ కు పూర్తిగా అర్థమైంది. అలా కమెడియన్ గా తనదైన ముద్రవేసిన అభినవ్.. జీ సినిమాలతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడాడు.

 

డైరెక్టర్ అవుదామనుకున్నా…కానీ

చిన్నతనం నుండే సినిమాలు బాగా చూసే వాణ్ణి. కాలేజిలో ఉన్నప్పుడు సినిమాలు చూసి ఆ సినిమా ఇలా తీస్తే బాగుండే ఇలా చేస్తే బాగుండేదని ఫ్రెండ్స్ తో కలిసి డిస్కషన్ పెట్టేవాడ్ని. ఆ టైంలో డైరెక్టర్ అవుదామనుకున్నాను. ఆ దిశగా ప్రయత్నించాను కూడా. కాలేజి డేస్ లో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ప్లాన్ చేసి సీరియస్ నెస్ లేక మళ్ళీ మధ్యలో ఆపేసే వాణ్ణి. కట్ చేస్తే నటుడినయ్యా.

 

కాన్ఫిడెన్స్ పెరిగింది

ఇంటర్ అయిపోయాక విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ లో ఇంజినీరింగ్ చేసాను. ఆ కాలేజ్ లో మా సీనియర్ కాలేజ్ ఫెస్టివ్ కి మైమ్ చేస్తున్నాం.. నువ్వు కూడా చేయాలి అన్నాడు. సీనియర్ కదా అని ఇష్టం లేకపోయినా ఏదో ట్రై చేశా.. అందులో నా పెర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరు స్పెషల్ గా మెచ్చుకున్నారు. డైలాగ్స్ లేకుండా ఎంటర్టైన్ చేసానంటే డైలాగ్స్ ఉంటే ఇంకా బెటర్ గా చేస్తానేమో అనిపించింది. ఆ ప్రోగ్రాం నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. అప్పుడే యాక్టర్ అవ్వాలనే కోరిక పుట్టింది.

థియేటర్ ఆర్టిస్ట్ గా 2 ఏళ్ళు

ఇంజినీరింగ్ పూర్తయ్యాక యాక్టర్ అవుదామనుకుని డిసైడ్ అయ్యాను. కానీ రూట్ ఎలా అనేది తెలియలేదు. ఆ టైమ్ లో థియేటర్ పెర్ఫార్మెన్స్ చేస్తే బెటర్ అని ఐడియా వచ్చింది. ఒక కంపెనీ లో జాబ్ చేస్తూ థియేటర్ గ్రూప్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాను. మహేష్ దత్తా అని చాలా ఫేమస్ రైటర్.. ఆయన డైరెక్షన్ లో ’30 డేస్ ఇన్ సెప్టెంబర్’ అనే నాటకంలో నటించాను. మూడు గంటల నాటకం అది. అందులో రెండు గంటలు నేను స్టేజి మీద ఉంటాను. చాలా తక్కువ టైంలో ఎక్కువ రిహార్సల్స్ చేయకుండానే అందులో నటించాను. స్టేజి నుండి దిగగానే అందరూ మెచ్చుకున్నారు. అలా ఆ నాటకంతో మొదలు పెట్టి దాదాపు రెండేళ్ళు థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేసాను.

 

మొదటి సినిమా

థియేటర్ ఆర్టిస్ట్ గా జర్నీ సాగిస్తుండగా ‘జగన్నాటకం’ అనే సినిమాలో అనుకోకుండా అవకాశం వచ్చింది. అందులో ఒక దొంగ పాత్ర చేసాను. అక్కడి నుండి నాలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ వచ్చింది. ట్రై చేస్తే ఇంకా సినిమా అవకాశాలొస్తాయనే నమ్మకం ఏర్పడింది.

అప్పుడు మొదలైంది

కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘మళ్ళీ రావా’ నాకు నటుడిగా మంచి గుర్తింపు అందించింది. నిజానికి ఆ సినిమా తర్వాతే మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మడం మొదలు పెట్టారు. వీడు ఏదో చేస్తాడు అని వాళ్ళల్లో ఓ నమ్మకం వచ్చింది. ఆ సినిమాలో చాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గౌతమ్ కి నవీన్ గారికి థాంక్స్ చెప్పాలి.

 

ఐదేళ్ల స్నేహం

ప్రియదర్శి నేను మంచి ఫ్రెండ్స్… మా ఇద్దరిదీ 5 ఏళ్ల స్నేహం. ఇద్దరం కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాం. అప్పటి నుండి బాగా క్లోజ్ అయ్యాం. ప్రియదర్శి వల్లే తరుణ్ భాస్కర్ పరిచయం అయ్యాడు.

 

అస్సలు ఊహించలేదు

పరిచయం అయ్యాక నేను తరుణ్ ని కలిసింది కొన్ని సార్లే… పెళ్లి చూపులు తర్వాత అప్పుడప్పుడూ కలుస్తూ ఉండే వాడ్ని. అయితే ఓ రోజు సోషల్ మీడియాలో తరుణ్ నెక్స్ట్ సినిమాకు లీడింగ్ యాక్టర్స్ కోసం చూస్తున్నాం అని ఒక పోస్ట్ పెట్టాడు. అది చూసి వెంటనే ఫొటోస్ పంపించాను. కట్ చేస్తే ఒక రోజు ఫోన్ చేసి సినిమాలో నలుగురు హీరోలు ఉంటారు. అందులో ఒకడిగా నిన్ను అనుకుంటున్నాం. ఒక చిన్న ఆడిషన్ ఇచ్చి వెళ్ళు అని చెప్పాడు. వెంటనే వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. కానీ ఈ సినిమాలో ఇంత మంచి లీడింగ్ క్యారెక్టర్ ఇస్తాడని అస్సలు ఊహించలేదు.

ఆ గ్యాప్ లో బాగా క్లోజ్ అయ్యాం

షూటింగ్ వెళ్ళే ముందు మాకు ఒక రెండు నెలలు టైం దొరికింది. విశ్వక్, సుశాంత్, వెంకటేష్ నేను రోజూ కలుస్తూ ఉండే వాళ్ళం. స్టూడియో కి రావడం స్క్రిప్ట్ చదువుకోవడం అలా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని బాగా క్లోజ్ అయిపోయాం. కొన్ని పార్టీలకు కూడా వెళ్ళే వాళ్ళం… కలిసి డిన్నర్ చేసే వాళ్ళం, అలా మా మధ్య క్లోజ్ నెస్ పెరిగింది. అలా ప్రీ ప్రొడక్షన్ టైంలో మాకు దొరికిన టైం మా మధ్య కెమిస్ట్రీ కి వర్కౌట్ అయ్యేలా చేసింది. అందుకే సినిమాలో మా క్యారెక్టర్స్ ఓన్ చేసుకొని ఇన్వాల్వ్ అయిపోయాం.

 

ఫోకస్ అంతా సినిమా మీదే

షూటింగ్ అంతా గోవాలో జరిగినా ఎంజాయ్ మెంట్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కారణం మేము వెళ్ళింది షూటింగ్ కోసం కాబట్టి మా ఫోకస్ అంతా సినిమా మీదే పెట్టాం. రాత్రి షూటింగ్ అవ్వగానే అందరం కలిసి డిన్నర్ చేసి కొంచెం సేపు మాట్లాడుకొని మళ్ళీ మరుసటి రోజు ఉదయం నాలుగు గంటలకు లేచి 6 అయ్యేసరికి షూటింగ్ స్పాట్ లో ఉండే వాళ్ళం.

 

ట్రైలర్ నుండే

ట్రైలర్ లో నేను చెప్పిన డైలాగ్స్ కి, నా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుండి నా కామెడీ థియేటర్స్ లో పేలుతుందని నమ్మకం కలిగింది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మంది కాల్స్ చేసారు. ఇండస్ట్రీ నుండి కొందరు స్పెషల్ గా మెచ్చుకోవడం ఎప్పటికి మర్చిపోలేను.


క్లారిటీ ఉన్న దర్శకుడు

నిజానికి తరుణ్ క్లారిటీ ఉన్న డైరెక్టర్… తనకేం కావాలో చాలా క్లారిటీ తో రాబట్టుకుంటాడు. ఆ క్లారిటీ తోనే ఈ సినిమాను తక్కువ టైంలో ఫినిష్ చేయగలిగాడు. పెళ్లిచూపులు సినిమాతో అతని టాలెంట్ ఏంటో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు తరుణ్ గురించి కొత్తగా చెప్పేదేం లేదు.

 

ఈ బ్యానర్ లో చేస్తా అనుకోలేదు

చిన్నప్పుడు కొన్ని సినిమాలకు స్టార్టింగ్ లో సురేష్ ప్రొడక్షన్స్ అని చూసి చాలా గొప్ప నిర్మాణ సంస్థ అనుకునే వాణ్ని.. కానీ అదే బ్యానర్ లో సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఒక విధంగా ఇది నా అదృష్టం అనుకుంటున్నా. ముఖ్యంగా సినిమా చూశాక చాలా బాగా చేశావ్ గుడ్ అంటూ సురేష్ బాబు గారు చెప్పడం మంచి ఫీల్ కలిగించింది. ఆయన వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది.

డిఫరెంట్ క్యారెక్టర్స్ పై దృష్టి

ఈ సినిమాలో నాలో కామెడీ పేలింది..కానీ నటుడిగా నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనుంది. ఒకే టైప్ కాకుండా వేరియేషన్స్ చూపించే క్యారెక్టర్స్ చేయాలనుంది. ఇకపై అలాంటి క్యారెక్టర్సే ఎంచుకుంటాను. అలాగని కామెడి క్యారెక్టర్స్ వదులుకోను.

 

త్వరలోనే గ్యాంగ్ తో చూస్తా

సినిమాను మా గ్యాంగ్ తో చూడలేదు. ఒక్కొక్కరూ ఒక్కో ప్లేస్ లో ఉన్నారు. రిలీజ్ అయ్యాక చాలా మంది కాల్స్ చేసి చాలా హ్యాపీ గా ఫీలయ్యారు. త్వరలోనే మా గ్యాంగ్ అందరం కలిసి సినిమా చూడబోతున్నాం.

 

ఆఫర్స్ వస్తున్నాయి

ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాను. ఇంకో రెండు సినిమాలు కూడా చేస్తున్నాను. వీటితో పాటు ఓ పెద్ద సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలతో కూడా ప్రేక్షకులను తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను.