Chitram Bhalare Vichitram - కల్ట్ కామెడీకి 30 ఏళ్లు

Monday,June 07,2021 - 04:34 by Z_CLU

సీనియర్ నటుడు నరేష్ అచ్చం వాళ్లమ్మ విజయ నిర్మలలానే ఉంటారు. ఎవరైనా ఈ విషయాన్ని నమ్మకపోతే ఒక్కసారి చిత్రం భళారే విచిత్రం సినిమా చూడండి. అందులో ఆడ వేషం వేసిన నరేష్.. విజయనిర్మలలా కనిపిస్తారు. ఇప్పుడీ ముచ్చటంతా ఎందుకంటే, ఆ సినిమా రిలీజై ఇవాళ్టికి (జూన్ 7)
సరిగ్గా 30 ఏళ్లు అవుతుంది.

యాక్షన్ జానర్ లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. రొమాన్స్, ఫ్యామిలీ జానర్స్ లో కూడా ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. కానీ కామెడీ జానర్ లో మాత్రం ఎక్కువ బ్లాక్ బస్టర్స్ కనిపించవు. ఈ ఒక్క విశ్లేషణ చాలు, ఆ జానర్ లో హిట్ కొట్టడం ఎంత కష్టమో. అలాంటి కష్టమైన జానర్ లో ఇష్టంగా నటిస్తూ.. అలవోకగా హిట్స్ కొట్టారు సీనియర్ నరేష్. అందులో ముందు వరుసలో ఉండే సినిమాల్లో ఒకటి చిత్రం భళారే విచిత్రం.

ప్రేమ అనే అమ్మాయి పాత్రలో నరేష్, ఆడవేషం వేసుకొని నటించిన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఓ చిన్న సినిమాగా వచ్చి అఖండ విజయం అందుకుంది ఈ మూవీ. అడుగడుగునా నవ్వులు పంచుతూ, స్టార్టింగ్ నుంచి చివరి వరకు కడుపుబ్బా నవ్విస్తూ కాసులు కొల్లగొట్టింది ఈ సినిమా.

పీఎన్ రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సాంబశివరావు, మధు తోటపల్లి (డైలాగ్స్) రచయితలుగా పనిచేశారు. విడుదలైన ప్రతి సెంటర్ లో నవ్వులు పూయిస్తూ సూపర్ హిట్టయింది ఈ సినిమా. హైదరాబాద్ లోని శ్రీనివాస్ థియేటర్లలో ఏకథాటిగా 175 రోజులాడింది. ఆ ఏడాది డైరక్ట్ సిల్వర్ జూబ్లీ మూవీస్ లో ఇది కూడా ఒకటి.

బ్యాచిలర్స్ కు ఎవ్వరూ అద్దెకు ఇవ్వరు. అలాంటి టైమ్ లో హీరో నరేష్ ఆడవేషం వేసుకొని ఓ అద్దె ఇంట్లో దిగుతాడు. ఆమెకు భర్తగా సుధాకర్, మామయ్యగా బ్రహ్మానందం, తమ్ముడిగా రాఘవ నటించారు. ఇక అక్కడ్నుంచి వీళ్లు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. నరేష్ యాక్టింగ్ తో పాటు ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ మరో హైలెట్. దేవుడి ఫొటో కనిపిస్తే చాలు అదో టైపులో దండాలు పెట్టే బ్రహ్మానందం తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టారు. జనరేషన్స్ తో సంబంధం లేకుండా ఇప్పటికీ ఈ సీన్ చాలామందికి హాట్ ఫేవరెట్.

ఈ సినిమాలో నరేష్ లేడీ వాయిస్ కు ప్రముఖ ఆర్టిస్ట్ రోజారమణి డబ్బింగ్ చెప్పారు. విద్యాసాగర్ సంగీతం అందించారు. ఈ కథను తరువాతి రోజుల్లో కన్నడలో ‘బంబాట్ హెండ్తీ’గా, తమిళంలో ‘అనళగన్’గా తీశారు. అక్కడ కూడా ఇది సూపర్ హిట్టయింది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics