Lucifer - మెగా రీమేక్ కు లైన్ క్లియర్

Wednesday,December 16,2020 - 05:04 by Z_CLU

టాలీవుడ్ లో చాన్నాళ్లుగా నలుగుతున్న లూసిఫర్ రీమేక్ కు లైన్ క్లియర్. ఆచార్య తర్వాత చిరంజీవి హీరోగా ఈ సినిమానే సెట్స్ పైకి రాబోతోంది. ఈ మేరకు చిరంజీవి నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చింది.

“లూసీఫ‌ర్ సినిమా స్క్రిప్టు ఫైన‌ల్ అయ్యింది. `త‌నిఒరువ‌న్` (ధృవ‌) ఫేం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. రీమేక్ క‌థ ఓకే అయ్యింది. మన నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క స్క్రిప్టును మోహ‌న్ రాజా చాలా బాగా నేరేట్ చేశాడు. సంక్రాంతి త‌ర్వాత సెట్స్ కెళ‌తాం. ఫిబ్ర‌వ‌రి-మార్చి-ఏప్రిల్ లో జరిగే షూటింగ్ తో ఈ నా 153 వ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. నాతో సినిమా చేయాల‌ని వేచి చూస్తున్న‌ చిర‌కాల స‌న్నిహితులు ఎన్వీ ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.”

ఇలా లూసిఫర్ ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు చిరంజీవి. ఈ సినిమా కూడా కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానుంది. NVR సినిమా బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

మోహ‌న్ రాజా ప్ర‌ఖ్యాత ఎడిట‌ర్ మోహ‌న్ వార‌సుడు. ఆయ‌న త‌మిళంలో పాపుల‌ర్ డైరెక్ట‌ర్. ఐదు తెలుగు సినిమాల్ని త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్లు చేసిన రికార్డ్ త‌న‌కు ఉంది. ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన `హిట్ల‌ర్` సినిమాకి ముత్యాల సుబ్బ‌య్య వ‌ద్ద మోహ‌న్ రాజా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశారు. ఇప్పుడు చిరంజీవిని లూసిఫర్ రీమేక్ తో డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.