ఈ 'విజేత'కు 33 ఏళ్లు

Tuesday,October 23,2018 - 05:23 by Z_CLU

80ల్లో వరుస సినిమాలతో చిరంజీవి దూసుకుపోతున్న టైమ్ అది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కూడా వస్తున్న పీరియడ్. అలాంటి టైమ్ లో ప్రయోగం చేయడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ చిరంజీవి చేశారు. తన స్టయిల్ మార్చుకొని చిరంజీవి చేసిన సినిమా విజేత. 1985లో సరిగ్గా ఇదే రోజున (అక్టోబర్ 23) విడుదలైన ఈ సినిమా 33 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది.

కోదండరామి రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నిజానికి స్ట్రయిట్ మూవీ కాదు. హిందీలో అప్పటికే హిట్ అయిన ఓ సినిమాకు రీమేక్. అనీల్ కపూర్ హీరోగా నటించిన సాహెబ్ అనే సినిమాకు రీమేక్ గా విజేత వచ్చింది. ఫీల్ చెడకూడదనే ఉద్దేశంతో, హిందీ సినిమా తీసిన లొకేషన్లలోనే విజేతను కూడా పిక్చరైజ్ చేశారు.

ఈ సినిమాతో చిరంజీవి, కోదండరామిరెడ్డి బంధం మరింత బలపడింది. అప్పటికే వీళ్లిద్దరి కాంబోలో ఛాలెంజ్, ఖైదీ లాంటి సూపర్ డూపర్ హిట్స్ వచ్చాయి. విజేత సినిమాతో తమ కాంబోలో ప్రయోగాలు కూడా చేయొచ్చనే విషయాన్ని తెలుసుకున్నారు.

ఈ సినిమా టైటిల్ వెనక కూడా గమ్మత్తయిన కథ ఉంది. ఒక దశలో చినబాబు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. చివరికి ఎటూ నిర్ణయించుకోలేక, జ్యోతిచిత్ర అనే ఫిలిం మ్యాగజైన్ లో సర్వే చేపట్టారు. ఎక్కువ ఓట్లు విజేత టైటిల్ కే రావడంతో ఆ పేరునే ఫిక్స్ చేశారు. పోల్ లో పాల్గొన్న వారిలో లక్కీ డిప్ ద్వారా కొందర్ని ఎంపిక చేసి, ఆ పేర్లను టైటిల్ కార్డులో కూడా వేశారు.

రీసెంట్ గా చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్, ఇదే టైటిల్ తో హీరోగా ఎంట్రీ ఇవ్వడం విశేషం.