చిరంజీవి-విజయశాంతి.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!

Monday,January 06,2020 - 12:10 by Z_CLU

తెలుగుతెరపై సూపర్ హిట్ కాంబినేషన్
దాదాపు 19 సినిమాల్లో నటించిన జోడీ
వాళ్లే చిరంజీవి-విజయశాంతి. వీళ్లిద్దరి పేరు చెప్పగానే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అలా కళ్లముందు కదులుతాయి. అయితే రియల్ లైఫ్ లో మాత్రం వీళ్లిద్దరూ కలిసి దాదాపు 15 ఏళ్లు దాటిపోయింది. ఎట్టకేలకు చిరంజీవి-విజయశాంతి కలిశారు. సరిలేరు నీకెవ్వరు ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో కలిసిన ఈ తారలు స్టేజ్ పైనే మనసు విప్పి మాట్లాడుకున్నారు.

చాన్నాళ్ల తర్వాత విజయశాంతిని కలిసినందుకు ఆనందంగా ఉందన్నారు చిరు. విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ అన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తనను ఎందుకు అంతంత మాటలన్నావంటూ విజయశాంతిని ఓపెన్ గా అడిగేశారు చిరు. విజయశాంతి ఎన్ని కామెంట్స్ చేసినా తానెప్పుడూ ఆమెపై విమర్శలు చేయలేదని గుర్తుచేశారు. తనను విజయశాంతిని కలిపిన మహేష్ కు చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు.

అటు విజయశాంతి కూడా చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నారు. మీరే నా హీరో, నేను మీ హీరోయిన్ అన్నారు. రాజకీయ ధర్మాన్ని పాటిస్తూ విమర్శలు చేయాల్సి వచ్చింది తప్ప, కోపంతో కాదన్నారు. మళ్లీ కలిసి నటిద్దామా అని చిరంజీవిని కోరారు.

రాజకీయం శత్రువుల్ని పెంచుకుంది, మా సినీపరిశ్రమ స్నేహాన్ని పెంచుతుందంటూ విజయశాంతిని అక్కున చేర్చుకున్నారు చిరంజీవి. స్టేజ్ పైనే విజయశాంతితో కలిసి నటించిన సినిమా పాటల్ని చిరంజీవి పాడారు. టోటల్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో వీళ్లిద్దరి సంభాషణే హైలెట్ గా నిలిచింది.