చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం

Sunday,October 28,2018 - 01:14 by Z_CLU

ఖైదీ.. చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రం. మెగాస్టార్ ఇమేజ్ కు పునాదిరాళ్లు వేసిన చిత్రం. చిరంజీవిని మాస్ హీరోగా మలిచిన మొదటి చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే ఖైదీ గురించి ఎన్నో విశేషాలు. మరెన్నో ప్రత్యేకతలు. మెగాస్టార్ చిరంజీవికే కాదు, తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమా విడుదలై ఈరోజుకు (అక్టోబర్ 28) సరిగ్గా 35 ఏళ్లు అయింది.

కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1983లో ఓ ప్రభంజనం. చిరంజీవి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయింది. పరుచూరి బ్రదర్స్ మాటలకు, చక్రవర్తి సంగీతానికి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. విడుదలైన మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విజయవాడ, హైదరాబాద్ లోని 2 థియేటర్లలో ఏకంగా 365 రోజులాడి రికార్డు సృష్టించింది.

ఇప్పటికీ, ఎప్పటికీ ఖైదీ సినిమా తనకు ఎంతో ప్రత్యేకం అంటారు మెగాస్టార్. ఖైదీ లేని కెరీర్ ను ఊహించుకోలేనని ఎన్నోసార్లు ప్రకటించారు. ఈ సినిమా పై ఇష్టంతో తన వందో సినిమాకు ఖైదీ నంబర్-786 అనే టైటిల్ ను, 150వ సినిమాకు ఖైదీ నంబర్-150 అనే టైటిల్స్ పెట్టుకున్నారు చిరంజీవి.