Chiranjeevi INDRA - జీ సినిమాలు స్పెషల్ స్టోరీ

Saturday,July 24,2021 - 03:28 by Z_CLU

ఇంద్ర.. ఈ పేరు చెబితే మెగాభిమానుల గుండెలు ఉప్పొంగుతాయి. వాళ్ల కళ్లలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఒక్కసారిగా అంతా 18 ఏళ్ల వెనక్కి వెళ్లిపోతారు. అప్పటి థియేటర్ జ్ఞాపకాలు, ఈలలు, అరుపులు, వంద రోజుల వేడుకలు, కాకినాడలో జరిగిన కారు ర్యాలీలు… ఇలా ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటారు. మెగా ఫ్యాన్స్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఇంద్ర సినిమా ఇవాళ్టితో (జులై 24) 19 ఏళ్లు పూర్తిచేసుకుంది.

Chiranjeevi INDRA Movie 19 years

మెగాస్టార్ వేసిన వీణ స్టెప్పు..
మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అనే డైలాగ్
రాననుకున్నారా రాలేననుకున్నారా అనే డైలాగ్
చిరంజీవి మీసకట్టు
మణిశర్మ పాటలు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్..
సోనాలి బింద్రే అందాలు
ఇలా ఒకటి కాదు.. ఇంద్ర సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇలాంటి ప్రత్యేకతలు చాలా కనిపిస్తాయి. అంతెందుకు.. చివరికి ఓ చిన్న పిల్లాడు తొడకొట్టి కుర్చీలో కూర్చునే సీన్ కు కూడా గూస్ బంప్స్ వచ్చాయంటే ఇంద్ర మేజిక్ గురించి చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు.

బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు కాశీ నేపథ్యాన్ని, ఇటు రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని మిక్స్ చేసి చూపించింది. అప్పట్లో దీన్ని ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీలయ్యారు. హీరో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, మళ్లీ డబుల్ ఎనర్జీతో సీన్ లోకి రావడం చాలా సినిమాల్లో చూశాం. అలాంటి రొటీన్ ఎపిసోడ్ కు కూడా కాశీ బ్యాక్ డ్రాప్, హీరోయిజం ఎలివేషన్ సీన్స్ యాడ్ చేసి సూపర్ హిట్ చేశారు పరుచూరి బ్రదర్స్. నిజానికి ఈ సినిమాకు గోదావరి బ్యాక్ డ్రాప్ అనుకున్నారు. ఎన్నో డిస్కషన్స్ తర్వాత కాశీ బ్యాక్ డ్రాప్ కు మారింది.

Chiranjeevi INDRA Movie 19 years

సినిమాలో సూపర్ హిట్టయిన రాననుకున్నారా.. రాలేననుకున్నారా అనే డైలాగ్ వెనక కూడా గమ్మత్తైన కథ ఉంది. అప్పటికే షూటింగ్ పూర్తయింది. అంతా ఇంటికెళ్లిపోయారు. సడెన్ గా పరుచూరి బ్రదర్స్ కు ఈ సీన్ తట్టింది. అర్థరాత్రి 12 గంటలకు చిరంజీవిని ఒప్పించి, మరుసటి రోజు ఈ సీన్ షూట్ చేయించి యాడ్ చేశారు. అలా ఈ డైలాగ్ చరిత్రలో నిలిచిపోయింది.

ఇక మణిశర్మ మ్యూజిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్టయింది. పాటలు ఎంత హిట్టయ్యాయో.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత కంటే పెద్ద హిట్టయింది. ఇంద్ర అనే శబ్దంతో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే చాలు అప్పటి రోజుల్లోకి వెళ్లిపోతుంది మనసు.

ఆడియో ఫంక్షన్ నుంచే అంచనాలు పెంచిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రభంజనం సృష్టించింది. ఏకంగా 122 కేంద్రాల్లో వంద రోజులాడింది. అప్పటికి సౌత్ లోనే ఇదొక రికార్డ్. ఇక 32 సెంటర్లలో 175 రోజులాడింది. ఇది కూడా రికార్డే.

ఇక వసూళ్ల పరంగా చూసుకుంటే అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న రికార్డులన్నింటినీ (ఆల్రెడీ చిరంజీవి స్థాపించిన సొంత రికార్డులు కూడా) తుడిచిపెట్టింది ఇంద్ర. 7 కోట్ల బడ్జెట్ (అప్పటికి ఇదే భారీ బడ్జెట్)తో తెరకెక్కిన ఈ సినిమా 28 కోట్ల షేర్ సాధించి రికార్డు సృష్టించింది. తెలుగులో పాతిక కోట్ల షేర్ రాబట్టిన మొట్టమొదటి సినిమా ఇదే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించారు ఈ సినిమాని.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics