Chiranjeevi Bobby Movie - సెట్స్ పైకొచ్చిన మెగాస్టార్

Friday,December 03,2021 - 01:38 by Z_CLU

ఆచార్య షూటింగ్ పూర్తిచేసిన చిరంజీవి, ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ కూడా సెట్స్ పైకి తీసుకొచ్చారు. ఇప్పుడీ రెండు సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాను కూడా స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ స్వయంగా బయటపెట్టాడు.

“ఈ రోజు చాలా థ్రిల్లింగ్‌ డే అని చెప్పాలి. నెర్వ‌స్‌గా ఉంది. అదే స‌మ‌యంలో ఉత్సాహం గానూ ఉంది. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవిగారు మాతో ఫస్ట్ డే షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రయాణానికి ఇది గొప్ప ప్రారంభం. మీ అందరి ఆశీస్సులు కావాలి” అని బాబీ ట్వీట్ చేశారు.

కె.ఎస్. రవీంద్ర దర్శకుడు కాక ముందు… స్టూడెంట్‌గా ఉన్న రోజుల్లో నుంచి మెగాస్టార్ కి వీరాభిమాని అని అందరికీ తెలిసిందే. చిరంజీవి సినిమాలు విడుదల అయినప్పుడు కటౌట్లు, ఆయన వచ్చినప్పుడు ర్యాలీల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు బాబీ. ఈ సినిమాతో పూనకాలు లోడ్ అవుతాయని గట్టిగా చెబుతున్నారు.

ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ‘మెగా 154’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను ఫిక్స్ చేయలేదు. శృతిహాసన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టున్నారు.

chiranjeevi bobby movie