రిటైర్మెంట్ ప్రకటించిన చార్మి

Monday,May 18,2020 - 01:53 by Z_CLU

నటి ఛార్మి అఫీషియల్ గా రిటైర్మెంట్ ప్రకటించింది. ఇకపై తను స్క్రీన్ పై కనిపించనని, ఎలాంటి పాత్రలు అంగీకరించనని క్లారిటీ ఇచ్చేసింది. ఈ మేరకు ఓ మీడియా హౌజ్ తో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయటపెట్టింది చార్మి.

“నూటికి రెండు వందల శాతం ఇకపై నేను నటించను. నటిగా ఇక తెరపై కనిపించేది లేదు. జ్యోతిలక్ష్మి టైమ్ లోనే నటిగా నా రిటైర్మెంట్ ప్రకటిస్తానంటే పూరి గారు, కళ్యాణ్ గారు వద్దన్నారు. అనౌన్స్ చేయడం అవసరమా? చేయడం మానేస్తానంటే మానేయ్ అన్నారు. అందుకే బయటకు చెప్పలేదు. ఇప్పుడు చెబుతున్నా. ఇకపై నటించేది లేదు.”

ఇలా తన రిటైర్మెంట్ వ్యవహారాన్ని అఫీషియల్ గా ప్రకటించింది చార్మి. ప్రస్తుతం తను ప్రొడక్షన్ వ్యవహారాలతో బిజీగా ఉన్నానని, నటించడం కంటే నిర్మాణంలోనే కిక్ ఉందని అంటోంది.

నీతోడు కావాలి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది చార్మి. శ్రీ ఆంజనేయం, మాస్ లాంటి సినిమాలతో టాప్ రేంజ్ కు వెళ్లింది. మంత్ర సినిమాతో ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకుంది. తన కెరీర్ లో నితిన్ నుంచి నాగార్జున వరకు దాదాపు అందరి హీరోలతో నటించింది.

2015లో వచ్చిన మంత్ర-2 తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తోంది చార్మి.