కాన్స్ చిత్రోత్సవం.. కౌంట్ డౌన్ షురూ

Tuesday,May 02,2017 - 02:04 by Z_CLU

మే నెల వచ్చిందంటే చాలు సినిమా అభిమానులంతా కాన్స్ చిత్రోత్సవం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఆస్కార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఎట్రాక్ట్ చేసే అతిపెద్ద ఫిలింఫెస్టివల్ గా కాన్స్ కు పేరుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ చిత్రాలకు అవార్డులు అందించడంతో పాటు తారల తళుకులు కాన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్స్. అలాంటి మోస్ట్ ఎవెయిటింగ్ ఫిలిం ఫెస్టివల్ కు ఈసారి కూడా గ్రాండ్ గా స్వాగతం చెబుతోంది ఫ్రాన్స్ లోని కాన్స్ నగరం.

ఈసారి కాన్స్ ఫిలింఫెస్టివల్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఇది 70వ చిత్రోత్సవం కావడం విశేషం. అందుకేే ప్రతి ఏటా ఉండే హంగులతో పాటు ఈ ఇయర్ ఫిలిం ఫెస్టివల్ లో కాస్త ఎక్స్ ట్రా హంగామాను యాడ్ చేశారు. సినిమాలు, డాక్యుమెంటరీస్ తో పాటు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఫ్యాషన్ పై ఎక్కువ ఫోకస్ పెడుతూ.. రెడ్ కార్పెట్ తో పాటు గ్రీన్ కార్పెట్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు.

ఎప్పట్లానే ఈసారి కూడాా కాన్స్ లో ఇండియా అందాలు మెరవనున్నాయి. ఐశ్వర్యరాయ్, సోనమ్ కపూర్, దీపిక పదుకోన్ లాంటి తారలు కాన్స్ లో సందడి చేయబోతున్నారు. వీళ్లకు ఇప్పటికే అధికారిక ఎంట్రీ లభించగా.. అలియాభట్, ప్రియాంక చోప్రా లాంటి మరికొందరు తారలకు త్వరలోనే అఫీషియల్ ఎంట్రీస్ దక్కనున్నాయి. రెడ్ కార్పెట్ పై జిగేల్ మనిపించేందుకు ఇప్పటికే వీళ్లకు సంబంధించి కాస్ట్యూమ్ డిజైనింగ్ ప్రారంభమైంది. ప్రపంచప్రఖ్యాత డిజైనర్లు ఈ కాస్ట్యూమ్స్ ను తయారుచేస్తున్నారు. ఈనెల 17 నుంచి 28 వరకు కాన్స్ ఫిలింఫెస్టివల్ జరుగుతుంది.