బ్రాండ్ బాబు డైరెక్టర్ ప్రభాకర్ ఇంటర్వ్యూ

Wednesday,August 01,2018 - 02:40 by Z_CLU

హిలేరియస్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది బ్రాండ్ బాబు. మారుతి కథ, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి P. ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్ తానే అయినా సినిమాలో కంప్లీట్ గా మారుతి బ్రాండ్ కనిపిస్తుందని చెప్తున్న ప్రభాకర్, ఈ సినిమా గురించి, తన ఫ్యూచర్ సినిమాల గురించి చాలా విషయాలు మాట్లాడాడు అవి మీకోసం..

మారుతి బ్రాండ్ కనిపిస్తుంది…

నెక్స్ట్ నువ్వే తరవాత మారుతి గారు నాకీ కథ వినిపించినప్పుడు ‘బ్రాండ్ బాబు’ అనే వంటకాన్ని ఆయన ఆల్రెడీ వండేశారు. జస్ట్ వడ్డించి ఆ వంటకానికి నా పేరు వేసుకొమ్మంటున్నారు అనిపించింది. సినిమాకి డైరెక్టర్ ని నేనే అయినా సినిమాలో మారుతి మార్క్ కనిపిస్తుంది.

నాకా ప్రాబ్లమ్ లేదు…

ఈ సినిమాలో నేను నా మార్క్ క్రియేట్ చేసుకోలేకపోయాను అనే ఫీలింగ్ నాకు లేదు. ఇక్కడ నాకన్నా మారుతి గారు బ్రాండెడ్. ఆయన బ్రాండ్ లోనే సినిమా చేయాలని ప్రొడ్యూసర్, హీరో అనుకున్నారు.. నేను కూడా అదే అనుకున్నాను… సినిమా మారుతి సినిమాలా ఉండాలనే చేశాను… అది నాకు ప్లస్ అవుతుందనే నా ఫీలింగ్…

ఫస్ట్ సీన్ హైలెట్…

హీరో ఫాదర్ కి ఎంత బ్రాండ్ పిచ్చి అంటే… తన ఫాదర్ చనిపోతే తల్లిని కనీసం ఏడవడానికి వీళ్ళేదు అంటాడు. ఏడిస్తే బ్రాండ్ పడిపోతుందని ఫీలింగ్… అలాంటి సిచ్యువేషన్ లోను తల్లిని వైట్ సారీ కట్టుకుని కోడ్ మెయిన్ టైన్ చేయమంటాడు… అంతలా బ్రాండ్ పిచ్చి ఉంటుంది…

ఇక హీరో విషయానికి వస్తే…

ఎవరైనా ఇద్దరు హీరోని కలవడానికి వస్తే అతని అసిస్టెంట్స్ ముందు వాళ్ళను టెస్ట్ చేస్తారు. ఏ బ్రాండ్ సూట్ వేసుకున్నారు.. ఏ బ్రాండ్ పర్ఫ్యూమ్ కొట్టుకున్నారు.. అని టెస్ట్ చేసి అన్నీ బ్రాండెడ్ అని కన్ఫమ్ చేసుకుని.. అప్పుడు మీరు అతన్ని కలవచ్చు… హీ ఈజ్ బ్రాండెడ్ అని క్లియరెన్స్ ఇస్తే అప్పుడు హీరో వాళ్ళతో మాట్లాడతాడు…

కథ కంప్లీట్ గా టర్న్ అవుతుంది..  

అంతలా బ్రాండ్ ని ఫాలో అయ్యే హీరో, ఇంటికి వచ్చే కోడలికి కూడా బ్రాడ్ ఉండాలని హోమ్ మినిస్టర్ కూతురిని చేసుకోవాలనుకుంటాడు… ఆ ప్రాసెస్ లో పనమ్మాయినే హోమ్ మినిస్టర్ కూతురనుకుని లవ్ లో పడతాడు.. కథ అక్కడ కథ అడ్డం తిరుగుతుంది…

ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు…

సినిమాకి 50 రోజులు షూట్ చేశాం… ఈ 50 రోజుల్లో మారుతి గారు మహా అయితే 4, 5 సార్లు సెట్ కి వచ్చి ఉంటారు… అంతకు మించి పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఒకరోజు మాత్రం మా తమ్ముడు చనిపోవడంతో నేను వెళ్ళాల్సి వచ్చింది. షూటింగ్ క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక, ఆ రోజు ఆయన చూసుకున్నారు…

అదీ హీరో రియల్ క్యారెక్టర్…

సుమంత్ శైలేంద్ర గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి. ప్రొడ్యూసర్ గారి అబ్బాయిని, హీరోని అని ఏ మాత్రం ఫీల్ లేకుండా అందరి కన్నా ముందు సెట్ లో ఉండేవాడు… తన షాట్స్ లాస్ట్ కి షూట్ చేయాల్సి వచ్చినా ఓపిగ్గా కూర్చునేవాడు…

కెమెరామెన్ కి స్పేస్…

సినిమాని హడావిడిగా కంప్లీట్ చేయలానే ఆంగిల్ లో కాకుండా, ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ గా చెక్కి తెరకెక్కించడం జరిగింది. సెట్ లో కెమెరా మెన్ కి కూడా స్కోప్ ఇవ్వడంతో, సీన్స్ అద్భుతంగా వచ్చాయి… అందుకే సినిమా షూటింగ్ కి 50 రోజులు పట్టింది.

నా కథలు వేరు…

నేను రాసుకునే కథలు కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉంటాయి. కథల్లో అయినా సరే ఇమోషన్స్, రిలేషన్స్ వీటికే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను…

 

నచ్చకపోతే చేయను….

నేను రాసుకునే కథలు వేరైనా.. నేను చేసిన ఈ 2 సినిమాల కథలు నచ్చే చేశాను… నేను రాసుకునే స్టైల్ ఇది కాకపోవచ్చు కానీ, డెఫ్ఫినేట్ గా చాలా మంచి కథలు. ఫ్యూచర్ లో కూడా ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి సినిమా చేయమని చెప్పినా కథ నచ్చకపోతే చేయను…

నెక్స్ట్ కూడా మారుతి బ్రాండే…

నెక్స్ట్ కూడా మారుతి గారి సినిమానే అయ్యేలా ఉంది. ఇంకో సినిమా చేద్దాం తొందరపడకండి అన్నారు. ఈ సినిమా  రిజల్ట్స్ పైనే నా నెక్స్ట్ ఏంటనేది డిపెండ్ అయి ఉంటుంది.

అప్పుడే నేనేంటో తెలుస్తుంది..

7 సొంత కథలు రాసి పెట్టుకున్నాను. ఎపుడు అవకాశం దొరికితే అప్పుడు సొంత కథతో సినిమా చేస్తాను. అప్పుడే నా ఒరిజినాలిటీ ఏంటనేది బయటికి వస్తుంది.

సినిమాలో ఈషా గురించి…

ఈషా గురించి చెప్పాలంటే తనని చూస్తుంటే సావిత్రి గారు, సౌందర్య ను చూసినట్టు అనిపిస్తుంది. ఈ సినిమా కోసం తనను అప్రోచ్ అయినప్పుడు అందరిలా హీరో ఎవరు..? బ్యానర్ ఏంటి అని అడగలేదు. కథేంటి..? నా క్యారెక్టర్ ఏంటి..? అని ఆలోచించింది. అది తనలో గొప్పతనం..