గురుతో పోటీపడుతున్న సింగం

Sunday,December 18,2016 - 01:12 by Z_CLU

గురు సినిమాను సంక్రాంతికే విడుదల చేద్దామని అనుకున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కానీ బాక్సాఫీస్ వద్ద అనవసరంగా పోటీ సృష్టించడం ఇష్టంలేక, సోలోగా వద్దామనే ఉద్దేశంతో వెంకీ తన సినిమాను సంక్రాంతి బరి నుంచి తప్పించాడు. అదే నెలలో జనవరి 26న రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా మూవీని విడుదల చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ వెంకీకి అక్కడ కూడా పోటీ తప్పలేదు.

ఇప్పటికే రెండు సార్లు వాయిదాపడిన సింగం-3 సినిమా ఇప్పుడు జనవరి 26 డేట్ పై కన్నేసింది. కుదిరితే తన సినిమాను ఆ రోజున విడుదల చేయాలని సూర్య భావిస్తున్నాడు. దీంతో వెంకీ-సూర్య సినిమాల మధ్య పోటీ తప్పదని తెలుస్తోంది. నిజానికి సింగం-3 సినిమాను ఈనెల 16న విడుదల చేద్దామనుకున్నారు. కానీ ధృవ సినిమా ఉండడంతో, చెర్రీ కోసం తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు సూర్య. అయితే అంతలోనే సింగం-3 సినిమాను సెన్సార్ సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఆ తర్వాత అనుకున్న తేదీకి కూడా సినిమా రావడం లేదు. సో.. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని, జనవరి 26న తన సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాడట సూర్య.