Bommarillu: ఆ ఇంటికెళ్ళి పద్నాలుగేళ్ళవుతోంది

Sunday,August 09,2020 - 11:32 by Z_CLU

ప్రేక్షకులు తమ కుటుంబంతో కలిసి ఆ ఇంటికెళ్ళి సమపాళ్ళల్లో వినోదం పొంది నేటికి పద్నాలుగేళ్ళవుతోంది. వినోదం పొందేందుకు థియేటర్స్ లో అడుగుపెట్టడమే ఆలస్యం ఆడియన్స్ ను సిద్దు, హాసినీ మెస్మరైజ్ చేసి ఓ మంచి అనుభూతి కలిగించి మళ్ళీ ఇంటికి సాగనంపారు. అవును సిద్దార్థ్ , జెనిలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘బొమ్మరిల్లు’ విడుదలై ఇవాల్టి (ఆగస్ట్ 9)కి 14 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా బొమ్మరిల్లు మేజిక్ గురించి ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరి.

2006 ఆగస్ట్ 9 “మమ్ము కాచిన వాడు మా మనసు దోచిన వాడు” అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పేరు తెరపై పడటమే ఆలస్యం ప్రేక్షులకు మంచి సినిమా చూడబోతున్నామనే ఓ పాజిటివ్ ఫీలింగ్. సముద్రపు తీరాన తండ్రికొడుకుల గురించి చెప్తూ మురళి మోహన్ వాయిస్ ఓవర్. దాంతో ఇరవై నాలుగేళ్ళు వచ్చాక కూడా తన చేయి వదలకుండా పెంచిన తండ్రి ప్రేమతో నలిగిపోయే అబ్బాయి కథతో సినిమా చూడబోతున్నామని ఆడియన్స్ కి అర్థమయిపోయింది. ఆ తర్వాత దేవి మ్యూజిక్ తో ‘బొమ్మరిల్లు’ అని టైటిల్ పడగానే లోపల ఏదో తెలియని హ్యాపీ నెస్ కలిగిందరికి. అక్కడి నుండి ఎండింగ్ లో సిద్దు ,జెనిలియా ఇంటికెళ్ళి ఓ ఏడు రోజులుండే వరకు ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించి బెస్ట్ డెబ్యూ అనిపించుకున్నాడు భాస్కర్. అప్పటికే సిద్దుకి పెళ్లి కుదిర్చిన తండ్రి తన కొడుకు మరో అమ్మాయిను ప్రేమిస్తున్నాడని తెలుసుకునే సీన్, సరిగ్గా అక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ పడటంతో పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి డిస్కషన్ నడుస్తుందో చూడాలని ఇంటర్వెల్ కి బయటికెళ్ళకుండా సీటుకి అతుక్కుపోయిన వాళ్ళూ ఉన్నారు. ముఖ్యంగా తను ప్రేమించిన అమ్మాయి వ్యక్తిత్వం, మంచితనం గురించి తండ్రికి తెలియజేయడం కోసం ఓ వారం రోజులు ప్రియురాలిని ప్రియుడు ఇంటికి తీసుకురావడమనే ఆలోచన అందరికీ కొత్తగా అనిపించి సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. అక్కడి నుండి హాసిని చిన్న పిల్లల చేష్టలు చూసి మనకీ అమ్మయి వద్దంటూ తన తండ్రి ఏం రీజన్స్ చెప్తాడోనని సిద్దు పడే పాట్లు థియేటర్ లో మంచి హాస్యాన్ని పండించి ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. అన్ని ఒకెత్తయితే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో తండ్రితో సిద్దు డిస్కషన్ సీన్ సినిమాకి ఆయువు పట్టులా నిలిచింది. ఆ సీనులో సిద్దు డైలాగ్స్ చెప్తుంటే చాలా మంది కుర్రాళ్ళకి తమ తండ్రి గుర్తొచ్చి సిద్దులో తమని చూసుకుంటూ క్లాప్స్ కొట్టారు. అలాగే ఆ డైలాగ్స్ విని కొడుకుల్ని మరీ ఇంత ఇబ్బంది పెడుతూ పెంచకూడదని, వారికి నచ్చిందిచ్చి సంతోషపెట్టాలని తెలుసుకున్న తండ్రులూ ఉన్నారు. ఇప్పటికి ‘బొమ్మరిల్లు’ అనగానే మనందరికీ ముందు గుర్తొచ్చే సీన్ అదే. ఆ తర్వాత గుర్తొచ్చే డైలాగ్ అంతేనా..? అవును హాసినీ పాత్రలో జెనిలియా చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో రింగ్ టోన్స్ రూపంలో మారుమ్రోగింది. ఇక పోను పోను ఆ డైలాగ్ తో పేరడీలు, కామెడీ ఆడియో క్లిప్పులు కూడా వచ్చాయ్.

సినిమా చూసి భాస్కర్ స్క్రీన్ ప్లే, సన్నివేశాలకి ఫిదా అయిన ప్రేక్షకుడు లేడు. సినిమా రిజల్ట్ తో భాస్కర్ పేరు ముందు బొమ్మరిల్లు చేరి ఇండస్ట్రీలో బొమ్మరిల్లు భాస్కర్ గా ముద్ర పడింది.
యూత్ తో పాటు ఫ్యామిలీస్ కి కూడా కనెక్ట్ అయ్యే సినిమా తీయడమంటే కష్టమే. ఆ కష్టంతోనే అందరు ఇష్టపడేలా ‘బొమ్మరిల్లు’ తీర్చిదిద్దాడు భాస్కర్. ముఖ్యంగా హీరోయిన్ జెనిలియాకి హాసిని అనే ఓ క్యూట్ క్యారెక్టర్ రాసి తన కెరీర్ లో బెస్ట్ రోల్ ఇచ్చాడు దర్శకుడు. అందుకే హీరోయిన్ క్యారెక్టర్ బాగా రిజిస్టరయిన కొన్ని తెలుగు సినిమాలు చెప్పమంటే మనకి వెంటనే హాసిని పాత్ర అంటూ టక్కున ‘బొమ్మరిల్లు’ గుర్తొస్తుంది. ఇక సిద్దు పాత్రలో ఒదిగిపోయి కుర్రకారుని బాగా ఎట్రాక్ట్ చేసిన సిద్దార్థ్ ఈ సినిమాతో తెలుగులో మంచి స్టార్డం అందుకున్నాడు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ తర్వాత సిద్దుకి తెలుగులో మళ్ళీ ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చిన సినిమా ఇదే. ‘బొమ్మరిల్లు’ తర్వాత డేట్స్ కోసం చాలా మంది దర్శక నిర్మాతలు అతని వెంట వెంటపడ్డారు. కానీ ఆ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసిన ఆ రేంజ్ హిట్ మళ్ళీ తెలుగులో చూడలేకపోయాడు సిద్దు.

కెమిస్ట్రీ ఓ రేంజ్ వర్కౌట్ అయిన హీరో -హీరోయిన్ తర్వాత సినిమాను భుజాలపై నడిపించింది ప్రకాష్ రాజే. అవును ప్రకాష్ రాజ్ కాకపోతే తండ్రి- కొడుకుల సన్నివేశాలు థియేటర్స్ లో ఆ రేంజ్ లో పండేవి కావు ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రకాష్ రాజ్ నటన వల్లే సిద్దు క్యారెక్టర్ అంతలా ఎలివేట్ అయ్యింది. తల్లి పాత్రలో జయసుధ కూడా సహజ నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా కొట్టేస్తా మిమ్మల్ని అంటూ జయసుధ డైలాగ్ చెప్పగానే థియేటర్స్ లో క్లాప్స్ పడ్డాయ్. కమెడియన్ గా సునీల్ కి కూడా హాస్యం పండించగలిగే మంచి పాత్ర దక్కడంతో సత్తి (ఓ మంచి పనోడు) పాత్రలో ఒదిగిపోయి మంచి హాస్యం పండించాడు. అలాగే కోటా శ్రీనివాస రావు , ధర్మవరపు లు కూడా విజయంలో మంచి పాత్ర పోషించారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కనిపించిన విజయ్ , చిత్రం శీను, రవి వర్మ కి ఈ సినిమా మరిన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. అలాగే హీరోకి లిఫ్ట్ ఇచ్చి అతని కథను మనకి తెలియజేసిన సత్యకృష్ణ , హీరో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గా కనిపించిన సురేఖ వాణి , సుదీప పింకీ క్యారెక్టర్స్ కూడా థియేటర్స్ లో క్లిక్ అయ్యాయి.

సాంకేతిక పరంగా ‘బొమ్మరిల్లు’ ఘన విజయంలో కీలక పాత్ర దేవికే దక్కుతుంది. అవును ‘బొమ్మరిల్లు’ కోసం ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించే అదిరిపోయే ఆల్బం ఇచ్చి సినిమా హాల్లోకి అడుగుపెట్టాక కూడా ప్రేక్షకులు మురిసిపోయేలా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చి సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాడు. దేవి పాటల కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూసి కౌంటర్ లో డబ్బులు నింపిన ప్రేక్షకులెందరో… ముఖ్యంగా “అపుడో ఇపుడో ఎపుడో కల గన్నానే చెలి” ,”బొమ్మను గీస్తే నీలా ఉంది” పాటలని థియేటర్ లో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. దేవి తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సింది మాటల రచయిత అబూరి రవి గురించి. అవును కుటుంబ సన్నివేశాలకు ఇంకా బలం చేకూర్చే మాటలు అందించి తన కలం పవర్ చూపించాడు. ఈ సినిమాతో స్టార్ రైటర్ కేటగిరీలో చేరిపోయాడు అబ్బూరి రవి. ఇక విజయ్ సి.చక్రవర్తి విజువల్స్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాకు ఓ క్లాస్ లుక్ తీసుకొచ్చాయి. ఎడిటర్ మార్తాండ్ వెంకటేష్ తన కత్తెర పదును చూపి సినిమాను పర్ఫెక్ట్ మీటర్ లో కట్ చేసారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథను ప్రేక్షకుడిలా ఓన్ చేసుకొని ఇంతటి ఘనవిజయాన్ని ముందే ఊహించి అందరికంటే ఎక్కువగా సినిమాను నమ్మి నిర్మించిన దిల్ రాజును కచ్చితంగా మెచ్చుకోవాలి. ఇలా అన్ని సమకూరిన ‘బొమ్మరిల్లు’ ఫైనల్ గాప్రేక్షకులు మెచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

విడుదల రోజు మార్నింగ్ షో నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిన ‘బొమ్మరిల్లు’ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టి ఫైనల్ గా 40 కిపైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆరు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 25 కోట్లు కొల్లగొట్టి దిల్ రాజుకి భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అందుకే దిల్ రాజు ఎన్ని సినిమాలు నిర్మించినా ఆయనకి ఈ సినిమా చాలా స్పెషల్. ఇక కలెక్షన్లే కాదు అవార్డులు కూడా అందుకుంది బొమ్మరిల్లు. వివిధ కేటగిరిలో ఏడు నంది అవార్డులు , పడి ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకుంది.

ఇప్పటికీ ‘బొమ్మరిల్లు’ టైటిల్ వినబడితే చాలు పద్నాలుగేళ్ళ క్రితం థియేటర్స్ లో ఎంజాయ్ చేసిన గోల్డెన్ డేస్ ప్రతీ సినిమా ప్రేక్షకుడికి గుర్తొస్తాయి. టివీలో సినిమా ఎప్పుడొచ్చినా రిమోట్ పట్టుకోలెం. ఛానెల్ మార్చలేం. అదీ ‘బొమ్మరిల్లు’ స్పెషాలిటీ. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే బోర్ కొట్టని సినిమాల లిస్టులో ఎప్పటికీ ఉంటుందీ సినిమా. అందులో సందేహమే లేదు.

రాజేష్ మన్నె.