స్టార్ హీరోల్ని కలుపుతున్న బడా సినిమాలు !

Sunday,November 10,2019 - 03:15 by Z_CLU

ప్రస్తుతం కొన్ని బడా బైలింగ్వెల్ సినిమాలు స్టార్ హీరోల్ని ఏకం చేస్తూ ప్రమోషన్స్ తో ముందుకెళ్తున్నాయి. విజయ్ దేవరకొండ నుండి సూపర్ స్టార్ రజినీ వరకూ తమ బైలింగ్వెల్ సినిమా ప్రమోషన్స్ కోసం కొందరు స్టార్ హీరోల హెల్ప్ తీసుకుంటున్నారు. రజినీ కాంత్ ‘దర్బార్’ సినిమా మోషన్ పోస్టర్ ను నాలుగు భాషల్లో నలుగురు స్టార్ హీరోలు సోషల్ మీడియా ద్వారా లాంచ్ చేసారు.

‘దర్బార్’ హిందీ మోషన్ పోస్టర్ ను సల్మాన్ ఖాన్ విడుదల చేయగా , మలయాళ పోస్టర్ ను మోహన్ లాల్ , తమిళ్ పోస్టర్ ను కమల్ హాసన్ రిలీజ్ చేసారు. ఇక తెలుగులో మహేష్ బాబు ఆ లీడ్ తీసుకొని మోషన్ పోస్టర్ ఆవిష్కరించి రజినీ సినిమాకు ప్రమోషన్ చేసి పెట్టాడు.

మెగా స్టార్ చిరంజీవి ‘సైరా’ విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమాలో ఓ మూడు పాత్రలకు నాలుగు భాషలో నలుగురు స్టార్లను తీసుకున్నారు. బాలీవుడ్ నుండి బిగ్ బీ , కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి, శాండల్ వుడ్ నుండి సుదీప్ కిచ్చా తలో చెయి వేసి సినిమాలో పాత్రలు చేసారు. ఇక ప్రమోషన్స్ లో కూడా నలుగురు స్టార్లు పాల్గొన్నారు. అంతే కాకుండా బెంగళూర్ లో జరిగిన ఈవెంట్ లో శివ రాజ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరై సినిమాను కన్నడలో ప్రమోట్ చేసాడు.

‘డియర్ కామ్రేడ్’ కి సంబంధించి విజయ్ కూడా ఇతర భాషల్లో ఉండే స్టార్ హీరోల హెల్ప్ తీసుకున్నాడు. సినిమాలోని ఒక పాటను మలయాళంలో దుల్కర్ తో , తమిళ్ లో విజయ్ సేతుపతితో పాడించి వారి గొంతును ప్రమోషన్స్ కి వాడుకున్నాడు విజయ్. ఇక బెంగళూరులో జరిగిన ఈవెంట్ లో కన్నడ స్టార్ హీరో యష్ ముఖ్య అతిథిగా హాజరై అక్కడ ‘డియర్ కామ్రేడ్’  సినిమా ప్రమోషన్స్ లో ఊపు తీసుకొచ్చాడు.

ఇలా ఇప్పుడొస్తున్న బడా బైలింగ్వెల్ సినిమాలు భాషా బేదం లేకుండా అందరి హీరోల్ని కలుపుతూ ప్రమోషన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాయి.