'బాహుబలి' తర్వాత రాజమౌళి పరిస్థితి ఏంటి?

Wednesday,September 21,2016 - 01:09 by Z_CLU

ప్రస్తుతం బాహుబలి-2 చిత్రీకరణలో బిజీ గా ఉన్న రాజమౌళి తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడన్నది క్లారిటీ లేదు. ఇంతకంటే ముందు ప్రేక్షకులు మరో క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు. ‘స్టూడెంట్ నెం 1’ నుంచి తాజాగా ‘బాహుబలి’ వరకూ తమ కాంబినేషన్ తో సినీ అభిమానుల్ని అలరించిన రాజమౌళి-కీరవాణి…. ‘బాహుబలి-2’ తరువాత మళ్ళీ కలిసి పని చేస్తారా? అనే అంశం పై ప్రస్తుతం చర్చ నడుస్తుంది.

సంగీత దర్శకుడిగా రిటైర్ అవుతానని రెండేళ్ల కిందటే కీరవాణి ప్రకటించడమే దీనికి కారణం. 2017 తర్వాత ఇక సినిమాలు చేయనని, కీరవాణి గతంలోనే ప్రకటించారు. కీరవాణి తాజా చిత్రం ‘బాహుబలి-2’ ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. కీరవాణి స్టేట్ మెంట్ ప్రకారం… ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా కీరవాణి కెరీర్ ఆగిపోనుంది. ప్రస్తుతం చేస్తున్న ఓం నమో వేంకటేశాయ సినిమా బాహుబలి-2 కంటే ముందే థియేటర్లలోకి వస్తుంది కాబట్టి… కీరవాణి చివరి ప్రాజెక్టు బాహుబలి-2 కానుంది.

rajamouli-and-keeravani

    ‘బాహుబలి-2’ తరువాత కీరవాణి తన ఆలోచనను మార్చుకుంటాడా? మాటకు కట్టుబడి కీరవాణి సినిమాలు చేయకపోతే… రాజమౌళి పరిస్థితేంటి? ఇప్పటి వరకూ కీరవాణి తో తప్ప మరో సంగీత దర్శకుడి తో పని చేయని జక్కన్న… కీరవాణి స్థానాన్ని ఎవరికి ఇస్తాడు…? తన కుటుంబంలో మరో సంగీత దర్శకుడిగా కొనసాగుతున్న కళ్యాణ్ కోడూరి కి అవకాశం ఇస్తాడా? లేదా భారీ చిత్రాలు రూపొందిస్తున్నాడు కాబట్టి ఏ.ఆర్.రెహ్మాన్ లాంటి స్టార్ కంపోజర్ తో కూడా పనిచేసే అవకాశం ఉంది.