భీష్మ సింగిల్స్ ఏంథెమ్ అదిరింది

Friday,February 14,2020 - 01:09 by Z_CLU

ప్రేమికుల రోజు కానుకగా తన సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ చేశాడు నితిన్. భీష్మ సినిమా నుంచి సింగిల్స్ ఏంథెమ్ వచ్చేసింది. ఈ పాటకు సంబంధించి చాలా రోజుల కిందటే ఆడియో వచ్చింది. అది క్లిక్ అయింది కూడా. ఇప్పుడు ఆ పాటకు సంబంధించి 2 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు.

సింగిల్స్ పాటలో నితిన్ రకరకాల గెటప్స్ లో ఆకట్టుకున్నాడు. వింటేజ్ చిరంజీవిని గుర్తుచేసేలా డ్రెస్సులు, స్టెప్పులు వేశాడు. శోభన్ బాబు లుక్ ను కూడా తలపించాడు. చివరికి ఖుషి సినిమాలో గుడి సీన్ ను కూడా రీక్రియేట్ చేసి నవ్వులు పూయించాడు. మొత్తంగా ప్రేయసి కోసం పరితపించే కుర్రాడిగా నితిన్ ను ఈ సాంగ్ లో బాగా చూపించారు.

ఈ పాటతో సినిమాపై ఇంకాస్త అంచనాల్ని పెంచాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే శుక్రవారం రిలీజ్ చేయబోతున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.