బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూ

Wednesday,May 22,2019 - 05:33 by Z_CLU

వరుసగా యాక్షన్ సినిమాలతో మెప్పించి యాక్షన్ హీరో అనిపించుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’ సినిమాతో డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయబోతున్నాడు. తేజ డైరెక్షన్ లో కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మరో రెండ్రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.

రెండు కథలు

ముందుగా తేజ గారు నాకు రెండు కథలు వినిపించారు. నాన్న కూడా నా పక్కనే ఉంది ఆ కథలు విన్నారు. నాన్న కి ఇంకో కథ నచ్చింది. నాకు మాత్రం సీత కథే బాగా నచ్చింది. తేజ గారు చెప్పిన ఇంకో కథ మాస్ యాక్షన్ సినిమా. అందువల్లే నాన్నకి ఆ కథ బాగా నచ్చింది. నేను మాత్రం ‘సీత’ లాంటి కథ కోసం ఎదురుచూస్తున్నాను. నటుడిగా ప్రూవ్ చేసుకునే ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి.

తేజ గారు… ఊహించలేదు

షూటింగ్ మొదటి రోజు తేజ గారు నాకో పేజీ డైలాగ్ ఇచ్చి చెప్పాలన్నారు. అబ్బో ఈయన మనకి టెస్ట్ పెట్టారనుకోని క్యార్ వాన్ లోకెళ్ళి. శ్రద్ధగా నేర్చుకొని ఓ పది నిమిషాల్లో చెప్పేసాను. ఆయన షాక్ అయ్యారు. ఆ డైలాగ్ అంత పర్ఫెక్ట్ గా చెప్తానని తేజ గారు ఊహించలేదు. నువ్వు ఈ క్యారెక్టర్ చేయగలవా ..? అనుకున్నా. నటుడివే అన్నారు. సీత విషయంలో అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.


ఛాలెంజింగే

ఈ కథ చెప్పాక ఒకే అయిపోయాక అసలు నేను ఈ క్యారెక్టర్ చేయగలనా..? అనే డౌట్ ఉండేది. నాన్న గారికి కూడా ఆ సందేహం ఉండడం వల్లే ఈ కథ వద్దన్నారేమో(నవ్వుతూ). అయితే రఘు రామ్ నాకో చాలెంజింగ్ క్యారెక్టర్. నటుడిగా ఎదగడానికి ఎవరికైనా ఇలాంటి క్యారెక్టర్స్ పడాలి. అందుకే నా కెరీర్ లో ఫస్ట్ టైం నటన పరంగా ఛాలెంజింగ్ గా తీసుకొని చేసిన సినిమా ఇది. అన్ని క్యారెక్టర్స్ మర్చిపోతాం. కానీ రఘురాం లాంటి క్యారెక్టర్ ని ఎప్పటికీ మర్చిపోలేం.

 

అరగంట.. ఎమోషనల్ గా

సినిమా చివర్లో వచ్చే అరగంట చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ‘సీత’ రెండు గంటల సేపు నవ్వించి చివర్లో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. నిన్నే మా అమ్మ -తమ్ముడు సినిమా చూసారు. క్లైమాక్స్ లో అమ్మ ఏడ్చేసింది. అంత ఎమోషనల్ గా ఉంటుంది ఆ బ్లాక్. ఆ క్లైమాక్స్ ఏంటనేది సినిమా చూసి అనుభూతి పొందాల్సిందే.

 

చాలా వేరియేషన్స్ ఉంటాయి

క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎంత పెద్ద సమస్యైనా చిన్నదిగా చూస్తూ లైట్ గా తీసుకునే క్యారెక్టర్. అడవిలో పెరిగి బాగా చదువుకొని సమాజంలో మనుషుల గురించి ఏం తెలియని క్యారెక్టర్ ఇది. చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు.

‘అల్లుడు శీను’ తర్వాత

సినిమాలో అమాయకంగా కనిపిస్తూనే కామిక్ టైమింగ్ తో ఎంటర్టైన్ చేస్తాను. అల్లుడు శీను తర్వాత కామెడీ చేసిన సినిమా ఇదే. లక్కీ గా మళ్ళీ ఇన్నేళ్ళకి నాలో కామిక్ టైమింగ్ ని బయటపెట్టే అవకాశం రఘురాం క్యారెక్టర్ రూపంలో వచ్చింది.

ఇదే ఫస్ట్ టైం

తేజ గారు ఇంత లార్జ్ స్కేల్ లో సినిమా తీయడం ఇదే మొదటి సారి. ప్రతీ ఫ్రేం గ్రాండియర్ గా ఉంటుంది. ముఖ్యంగా లోకేషన్స్ ఎట్రాక్ట్ చేస్తాయి. కంబోడియాలో షూట్ చేసిన సీన్స్ మెస్మరైజ్ చేస్తాయి. అక్కడ షూట్ చేయాలని చాలా మంది ఫిలిం మేకర్స్ ట్రై చేసి లెటర్ పెట్టారట. కానీ దైవ సంకల్పం వల్ల మాకా అవకాశం వచ్చింది.


బ్రేక్ చేయాలనుకున్నా

నా చుట్టుపక్కల ఉండే అందరూ ఈ టైటిల్ పెట్టకూడదు అంటూ చెప్పారు. కానీ నేను మాత్రం అదే టైటిల్ పెట్టమని చెప్పాను. సీతతో అది బ్రేక్ చేయాలనిపించింది. టైటిల్ పెట్టగానే ఒక మీడియా పర్సన్ కాల్ చేసి నిజంగా ఇలాంటి టైటిల్ పెట్టాలంటే హీరోలు ఒప్పుకోరు. కొంత మంది హీరోల వల్ల రిజిస్టర్ అయ్యాక కూడా టైటిల్ మార్చాల్సి వచ్చిందన్నారు. హిందీలో సుయ్ ధాగా సినిమా చూసాను. ఆ సినిమా ప్రారంభంలో ముందు అనుష్క పేరు వస్తుంది ఆ తర్వాతే వరుణ్ దావర్ పేరు పడుతుంది. వరుణ్ పెద్ద స్టార్ అయినప్పటికీ ఒక మహిళ కి ఇచ్చిన రెస్పెక్ట్ బాగా నచ్చింది. తెలుగులో కూడా కొన్ని బ్రేక్ చేసి ముందుకెళ్ళాల్సిన టైం వచ్చేసింది.

కాజల్… పర్ఫెక్ట్

సీత క్యారెక్టర్ కాజల్ చేస్తుందని తేజ గారు చెప్పగానే హ్యాపీ గా ఫీలయ్యాను. నిజానికి తనకీ క్యారెక్టర్ పర్ఫెక్ట్ . కాజల్ లాంటి ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరోయిన్ మాత్రమే ఇలాంటి క్యారెక్టర్ చేయగలరు. కాజల్ విషయంలో తేజ గారిది పర్ఫెక్ట్ ఛాయిస్.

చాలా మంచి వ్యక్తి

సోనూ సూద్ గారు చాలా మంచి వ్యక్తి. అతనితో ఈ సినిమా చేయడం మంచి అనుభూతి కలిగించింది. ఇండస్ట్రీ లో ఫస్ట్ టైం నేనొక వ్యక్తి బాగా కనెక్ట్ అయ్యాను అంటే అది సోనూ సూద్ గారితోనే. షూటింగ్ అయిపోయాక ఇద్దరం కలిసి జిమ్ చేయడం, రాత్రి భోజనం చేయడం ఇలా ఫ్రెండ్లీ గా ఉండేవాళ్ళం. మా ప్రొడక్షన్ లో అయన కందిరీగ సినిమా చేసారు. అప్పటి నుండే ఆయనతో పరిచయం ఉంది. అది ఈ సినిమాతో ఇంకా బలపడింది.

ముగ్గురం కలిసి …

2017 లో నేను హీరోగా నటించిన జయ జానకి నాయక , తేజ గారు డైరెక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రి , అనిల్ సుంకర గారు ప్రొడ్యూస్ చేసిన లై ఒకటే రోజు విడుదలయ్యాయి. మళ్ళీ రెండేళ్ళకి ముగ్గురం కలిసి ఒకే సినిమా చేసాం.

అందరూ అదే చెప్తున్నారు

సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే మా ఎడిటర్ చంటి గారు అలాగే అనూప్ రూబెన్స్ ఇంకొంత మంది కూడా యాక్టర్ గా ‘సీత’ నీకు రెస్పెక్ట్ తీసుకొస్తుందనన్నారు. నిజంగానే ఈ సినిమా తర్వాత నటుడిగా నాకో గౌరవం వస్తే సంతోషమే. లెట్స్ వెయిట్ అండ్ సీ.

 

పోలీస్ క్యారెక్టర్ అంటే…

పోలీస్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. ‘కవచం’లో పోలీస్ గా నటించాను. కానీ అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. లక్కీ గా అదే టైంలో ‘రట్సాసన్’ రీమేక్ వచ్చింది. థ్రిల్లర్ అన్నారు. సినిమా చూసాక డిసైడ్ అవుదామని సినిమా చూడటం మొదలు పెట్టాను. చాలా నచ్చించి. అందుకే వెంటనే ఓకే చేసేసాను. మళ్ళీ ‘రాక్షసుడు’ లో పోలీస్ గా నటిస్తున్నాను. ఎక్కడ పోగుట్టుకున్నమో అక్కడే వెతుక్కోవాలని అంటుంటారు కదా…కవచం వర్కౌట్ అవ్వకపోయినా పోలీస్ గా ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి ఓ ఏడు రోజులు షూటింగ్ మినహా సినిమా పూర్తయింది. హిందీ కోసం కొన్ని ప్రత్యేకమైన ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నాం.

 

డిస్కర్షన్స్ జరుగుతున్నాయి

అజయ్ భూపతి గారితో సినిమాకి సంబంధించి డిస్కర్షన్స్ జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే సినిమా ఉంటుంది. ప్రస్తుతానికైతే ‘రాక్షసుడు’ సినిమా ఒక్కటే చేస్తున్నాను. అది అయ్యాక నెక్స్ట్ సినిమా ఫైనల్ అవుతుంది.