దర్శకత్వం బాలయ్యది.. పర్యవేక్షణ వేరొకరిది

Wednesday,May 02,2018 - 05:30 by Z_CLU

నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఇన్నేళ్ళ కెరీర్ లో  ఎప్పుడూ దర్శకత్వం ట్రై చేయని బాలయ్య.. మొత్తానికి యాక్షన్-కట్ చెప్పబోతున్నాడు. విషయమేమిటంటే బాలయ్య తన తండ్రి కథతో ‘NTR’అనే టైటిల్ తో  బయోపిక్ చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో తండ్రి తారకరామారావు పాత్రలో కనిపించనున్నాడు నందమూరి నటసింహం.

ఈ మూవీకి మొదట తేజను దర్శకుడిగా అనుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా తేజ బయటకొచ్చేశాడు. తర్వాత రాఘవేంద్రరావు, తేజ, క్రిష్ లాంటి దర్శకుల పేర్లు పరిశీలించినప్పటికీ ఫైనల్ గా తానే సొంతంగా డైరక్ట్ చేస్తూ నటించాలని ఫిక్స్ అయ్యారు బాలయ్య. నటసింహం డైరక్ట్ చేస్తుంటే.. దానికి దర్శకత్వ పర్యవేక్షకుడిగా చంద్ర సిద్దార్థ్ వ్యవహరించబోతున్నారు.

స్క్రిప్ట్ రెడీ గా ఉండటంతో ఈ సినిమాను మీరే  డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని కొందరు సన్నిహితులు బాలయ్య కి సలహా ఇచ్చారట. ఇక తప్పని పరిస్థితుల్లో ఈ సినిమా కోసం  బాలయ్యే స్వయంగా రంగంలో దిగారు. గతంలో ‘ఆ నలుగురు’ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న దర్శకుడు చంద్ర సిద్దార్థ్ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.