మరో షాకింగ్ డెసిషన్..?

Thursday,December 29,2016 - 03:20 by Z_CLU

నిర్ణయాలు తీసుకోవడంలో నటసింహం తనకు తానే సాటి. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సత్యదేవ లాంటి కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చాడంటేనే బాలయ్య మైండ్ సెట్ అర్థం చేసుకోవచ్చు.ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తర్వాత కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతాడట నటసింహం. ఎవరూ ఊహించని ఓ దర్శకుడికి నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. అతడే ఎస్వీ కృష్ణారెడ్డి.

అవును.. రీసెంట్ గా ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పిన ఓ స్టోరీని బాలయ్య విన్నాడట. స్టోరీలైన్ కూడా బాగా నచ్చిందని టాక్. కాకపోతే.. మెగాఫోన్ పట్టుకొని చాలా ఏళ్లయిన ఎస్వీ కృష్ణారెడ్డి.. ఇంత సడెన్ గా సినిమా తీయాలని ఎందుకు అనుకుంటున్నాడు.. దానికి బాలయ్యనే ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడనేది పెద్ద టాపిక్. ఒకవేళ బాలయ్యతో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా ఓకే అయితే, ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై ఆ మూవీ తెరకెక్కే అవకాశం ఉంది. గతంలో బాలయ్య-ఎస్వీ కృష్ణారెడ్డి కాంబినేషన్ లో టాప్ హీరో అనే సినిమా వచ్చింది. అందులో పాాటలు చాలా బాగుంటాయి. కానీ సినిమా మాత్రం ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది.

నిజానికి తన 101వ సినిమా కోసం కృష్ణవంశీని దర్శకుడిగా తీసుకోవాలని అనుకున్నాడు బాలయ్య. దీనికి రైతు అనే టైటిల్ కూడా అనుకున్నారు. ఓ కీలకపాత్ర కోసం బిగ్ బి అమితాబ్ ను కూడా సంప్రదించారు. కానీ ఇంతలోనే సడెన్ గా ఆ ప్రాజెక్టును కొన్నాళ్లపాటు వాయిదావేసి, కృష్ణారెడ్డి సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని బాలయ్య భావిస్తున్నారట. ప్రస్తుతం గాసిప్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాపై క్లారిటీ రావాలంటే, శాతకర్ణి సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.