బాలకృష్ణ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్ - 1

Tuesday,January 10,2017 - 04:32 by Z_CLU

* నాన్నగారే చేయాలనుకున్నారు

గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను నాన్నగారే చేయాలనుకున్నారు. కానీ రాజకీయ బాధ్యతల వల్ల చేయలేకపోయారు. మళ్ళీ ఇన్నాళ్ళకు క్రిష్ కి ఈ సినిమా చేయాలన్న ఆలోచన రావడం, నాకు ఆ అదృష్టం దొరకడం నా పూర్వజన్మ సుకృతం.

* హాట్సాఫ్ టు క్రిష్

క్రిష్ ఈ సినిమాని అద్భుతంగా ఆవిష్కరించాడు. తానిప్పటివరకు చేసిన ఒక్కో సినిమాలో ఒక్కో విభిన్నత ఉంటుంది. ఈ సినిమా కూడా తన కరియర్ లో అద్భుతమైన సినిమాగా నిలిచిపోతుంది.

*అన్ని రకాలుగా కలిసొచ్చింది

అమరావతిని ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం, అదే టైంలో ఈ సినిమా తీయాలనుకోవడం… మంచి చేసేవారికి పంచ భూతాలు సైతం సహకరిస్తాయి అన్నట్టు, ఈ సినిమా చేయటానికి అన్ని రకాలుగా అన్నీ కలిసివచ్చాయి.

gpsk-117

 *కథలు విన్నాను

100 వ సినిమా కోసం చాలా కథలు విన్నాను. ఎన్ని కథలు విన్నా గౌతమీపుత్ర శాతకర్ణుని కథ ఇచ్చినంత సంతృప్తి ఏ కథ ఇవ్వలేదు. ఆయన గురించి కచ్చితంగా తెలుగు జాతికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేశాను.

*అదృశ్య శక్తే నడిపించింది

ఈ సినిమా తెరకెక్కడానికి ఆ గౌతమీ పుత్రుడే పూనుకున్నాడేమో అనిపిస్తుంది. ఇలా దృశ్య రూపంలో తెలుగు ప్రజలకు మళ్ళీ చేరువ కావడానికి ఆయనే క్రిష్ కి ఈ ఆలోచన రగిలించాడేమో అనిపిస్తుంది.

*యుద్ధంతో మొదలవుతుంది

గౌతమీ పుత్ర శాతకర్ణీ సినిమా యుద్ధం నుండి మొదలై చివరికి గ్రీకు మహారాజును ఓడించడంతో ముగుస్తుంది. సినిమా అవుట్ పుట్ చూశాక అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది.

*రీసెర్చ్ కేవలం కథ కోసమే చేయలేదు

చాలా రిసెర్చ్ చేయడం జరిగింది. గౌతమీపుత్రుని గురించి తెలుసుకోవడం కాదు, ఆ కాలంలో వేసుకునే దుస్తులు, చెప్పుల దగ్గర్నుంచి ప్రతీది క్షుణ్ణంగా పరిశీలించాం. T.T.D. మ్యూజియం నుండి కొంత, పుస్తకాల నుండి కొంత, శిల్పాల నుండి కొంత సమాచారాన్ని సేకరించగలిగాం.

gpsk-112

*శ్రియ అత్యద్భుతంగా నటించింది

వాశిష్టి దేవిగా శ్రియ చాలా బాగా నటించింది. శ్రియ తన పాత్రకు 150 % న్యాయం చేసింది.

*ఆయన చేయరేమో అనుకున్నాను

కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో కీలక పాత్ర చేయరేమో అనుకున్నాం. ఆయన ఇతర భాషా సినిమాల్లో ఇప్పటివరకు నటించలేదు. చేసినా ఆయన ఫ్యాన్స్ ఒప్పుకుంటారో లేదో కూడా తెలియలేదు. అలాంటిది ఆయన కూడా ఈ సినిమాని ఒప్పుకొని చేయడం చాలా సంతోషంగా ఉంది.

*ఆవిడ లేకపోతే ఈ సినిమా లేదు

హేమామాలిని గారు గతంలో పాండవ వనవాసం సినిమాలో ఒక పాటలో నర్తించారు. ఆ తరవాత ఇన్నాళ్ళకు ఈ సినిమాలో చేశారు. నిజానికి ఆవిడ లేకపోతే అసలీ సినిమానే లేదు. అంత బాగా గౌతమీబాల పాత్రలో హేమమాలిని ఇమిడిపోయారు.