జీ స్పెషల్.. 60 ఏళ్ల నటసింహం

Wednesday,June 10,2020 - 10:00 by Z_CLU

తెలుగు సినిమా చరిత్రలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారిది ఓ సుస్థిరస్థానం. సినిమా అనే పదం ఉన్నంత కాలం ఆయన్న ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకోవాలి కూడా. అలాంటి మహానుభావుడి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడు అని బిరుదు అందుకొని అగ్ర కథానాయకుడిగా చక్రం తిప్పాడు బాలయ్య. నిజానికి నటనలో తండ్రిని అందుకోవడం అంటే కష్టమే.. కానీ ఆ అసాధ్యాన్ని తండ్రి దీవెనలతో ప్రేక్షకుల అభిమానంతో సుసాధ్యం చేశారు బాలకృష్ణ.

అవును.. తారక రామారావు గారిలా పౌరాణికాలు , జానపదాలతో సినిమాలు చేసి నటుడిగా ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకొని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాడు నందమూరి నటసింహం. కమర్షియల్ మాస్ సినిమా అయినా, పౌరాణికమైనా, ఎలాంటి ప్రయోగమైనా ఆయన ముందు దిగదుడుపే అని చెప్పాలి. హీరోగా అన్ని జోనర్స్ లో సినిమాలు చేసిన నటుడు బాలయ్య. ఇప్పటి తరంలో బాలయ్యలా పౌరాణికాలు, చారిత్రాత్మక , భక్తిరస ,జానపదాలు ఇలా అన్ని టచ్ చేసిన మరో హీరో లేడు. ఇది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అందుకే హీరోగా బాలయ్య ఇప్పటికీ చెక్కు చెదరని ఇమేజ్ తో అదే క్రేజ్ తో యంగ్ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. నేడు నందమూరి నటసింహం బాలయ్య 60వ జన్మదినం సందర్భంగా ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరి.

1960, జూన్ 10న ఎన్టీఆర్ – బసవతారకం దంపతులకు ఆరో కొడుకుగా చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. చిన్నతనం నుండి బాలకృష్ణ అంటే తారకరామారావు గారికి అమితమైన ఇష్టం ఉండేది. ఆ ఇష్టంతోనే బాలయ్యను గొప్ప నటుడిగా తీర్చిదిద్దాలని భావించేవారాయన. అందులో భాగంగానే తండ్రి ప్రోత్సాహంతో చిన్నతనంలోనే నటుడిగా మారాడు బాలకృష్ణ.


1974 లో ‘తాతమ్మ కల’సినిమాతో బాలకృష్ణ బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు రామారావు గారు దర్శకత్వం వహించారు. అలా తండ్రి దర్శకత్వంలో మొదటి సినిమా చేసాడు బాలయ్య. అలా పద్నాలుగేళ్ళ వయసులో నటుడిగా తెరగేట్రం చేసి ఆ తర్వాత తండ్రి ఎన్టీఆర్ గారి సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించాడు. చేసిన అన్ని పాత్రలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న బాలయ్య 1984 లో ‘సాహసమే జీవితం’ సినిమాతో హీరోగా  మారాడు. ఆ తర్వాత హీరోగా ‘డిస్కో కింగ్’, ‘జననీ జన్మభూమి’ సినిమాలు చేసిన యువరత్న ‘మంగమ్మ గారి మనవడు’ తో హీరోగా స్టార్ డమ్ అందుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి బాలయ్య కి మైలురాయిలా నిలిచింది.

హీరోగా కెరీర్ ప్రారంభించిన మొదటి ఏడాదిలో ఏకంగా ఏడు సినిమాలు చేసాడు బాలయ్య. తండ్రితో కలిసి చేసిన చారిత్రాత్మక భక్తిరస చిత్రం ‘శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ కూడా అదే ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత 1987 లో హీరోగా 8 సినిమాలు చేసాడు. అందుకే బాలయ్య సినీ ప్రయాణంలో ఆ ఏడాది చాలా స్పెషల్ గా భావిస్తారు అభిమానులు.


బాలయ్య తొలిసారి ‘అపూర్వ సహోదరులు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఆ తర్వాత ‘రాముడు భీముడు’, ‘బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర’, ‘శ్రీ కృష్ణార్జున విజయం’ , ‘ఆదిత్యా 369’, ‘సుల్తాన్’,, ‘ఒక్కమగాడు’, ‘పెద్దన్నయ్య’ , ‘మాతో పెట్టుకోకు’, ‘చెన్న కేశవ రెడ్డి’,’అల్లరి పిడుగు’, ‘పాండు రంగడు’, ‘సింహ’ , ‘పరమ వీర చక్ర’, ‘లెజెండ్’ ఇలా పదిహేను సినిమాల్లో డ్యూయల్ రోల్ చేసాడు. బాలయ్య త్రిపాత్రాభినయం చేసిన ఒకే ఒక్క సినిమా ‘అధినాయకుడు’.


బాలకృష్ణ నటించిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్సే. ‘ముద్దుల కృష్ణయ్య’,’మువ్వ గోపాలుడు’, ‘రౌడీ ఇన్స్ పెక్టర్’ , ‘బంగారు బుల్లోడు’,’బొబ్బిలి సింహం’, ‘లారీ డ్రైవర్’ ఇలా బాలయ్య లిస్టులో అభిమానులు గర్వంగా చెప్పుకొనే బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఇక మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య , సమర సింహారెడ్డి, నరసింహ నాయుడు సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ అందుకొని బాక్సాఫీస్ ను షేక్ చేసాడు నందమూరి నట సింహం.


జయాపజయాలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేసిన ఘనత బాలయ్యకే దక్కుతుంది. మాస్ హీరోగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న సమయంలో కూడా ‘పాండురంగడు’,’శ్రీ రామరాజ్యం’ లాంటి భక్తి రస చిత్రాలు అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి హిస్టారికల్ కథతోనూ ప్రయోగాలు చేసాడు బాలయ్య. నటుడిగా బాలయ్య ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నాడు. నిర్మాతగా NBK ఫిలిమ్స్ బ్యానర్ స్థాపించి ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,’ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు నిర్మించాడు.


బాలయ్య కి నటుడిగా మంచి గుర్తింపు సినిమాకొచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి అందులో అభిమానులు గర్వంగా చెప్పుకునే వాటిలో ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ ప్రథమంగా ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్ లోనే మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన బాలయ్య ‘రౌడీ ఇన్స్ పెక్టర్’,’లారీ డ్రైవర్’,’సమర సింహా రెడ్డి’,’నరసింహ నాయుడు’,’చెన్న కేశవ రెడ్డి’,’సింహా’,’లెజెండ్’ సినిమాలతో మాస్ కి పూనకాలు తెప్పించి థియేటర్స్ లో విజిల్స్ , క్లాప్స్ అందుకున్నాడు. ముఖ్యంగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ కి కూడా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఆ డైలాగుల కోసమే మళ్ళీ మళ్ళీ ఆయన సినిమాలు చూసిన అభిమానులెందరో.


‘తాతమ్మ కల’ బాలయ్య మొదటి సినిమా కాగా ‘నిప్పులాంటి మనిషి’ ఆయన 25 సినిమా. ఇక 50 వ సినిమాగా ‘నారి నారి నడుమ మురారి’ చేసిన బాలకృష్ణ 75వ సినిమాగా ‘కృష్ణ బాబు’ చేసి ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ తో 100వ సినిమా మైల్ స్టోన్ అందుకున్నారు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 106 వ సినిమా చేస్తున్నాడు.

ఇక ఇటు సినిమారంగంలో కథానాయకుడిగా రాణిస్తూనే మరో వైపు రాజకీయరంగంలోనూ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ‘బసవరతరకం క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ భాద్యతలు చూసుకుంటున్నారు బాలయ్య.

60 ఏళ్ల జీవితంలో 46 ఏళ్లుగా సినీ ప్రయాణం చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తూ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణ ఇలాగే అందరినీ అలరిస్తూ మరెన్నో మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తుంది ‘జీ సినిమాలు’.