నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రినాథ్

Monday,April 20,2020 - 12:52 by Z_CLU

తరాలు మారినా ఈ డైలాగ్ మాత్రం తన ప్రయాణాన్ని ఆపలేదు. 20 ఏళ్ల కిందట పుట్టిన ఈ డైలాగ్, ఇప్పటి జనరేషన్ యూత్ కు కూడా కనెక్ట్ అయిందంటే అది పవన్-పూరి కలిసి చేసిన మేజిక్. ఆ సినిమానే బద్రి. 20 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు బద్రి సినిమా థియేటర్లలోకొచ్చింది.

బద్రిలో చాలా హైలెట్స్ ఉన్నాయి. ఈ సినిమాతోనే పూరి జగన్నాద్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతోనే అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా కూడా పరిచయమయ్యారు. నిజానికి రిలీజైన మొదటి వారం రోజులు ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. క్లైమాక్స్ బాగాలేదన్నారు చాలామంది. ఆ తర్వాత అదే సూపర్ హిట్టయింది. 47 సెంటర్లలో వంద రోజులాడింది.

నిజానికి బద్రి క్లైమాక్స్ ను పవన్ మార్చమని కోరారు. ఓ వారం తర్వాత పూరి వెళ్లి, క్లైమాక్స్ మార్చలేకపోతున్నానని చెప్పాడు. దీంతో పూరి రాసిన ఒరిజినల్ కథతోనే సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఉద్దేశంతో క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ ఇస్తారు. కానీ ఇప్పటివరకు బద్రి-2 రాలేదు. పవన్ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా బద్రి-2 డిస్కషన్ వచ్చింది.

రమణగోగుల ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ చికిత, బంగాళాఖాతంలో లాంటి పాటలు ఇప్పటికీ హిట్టే. అంతేకాదు.. ఈ సినిమా లవ్ సీన్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

నెల రోజుల్లో ఒక అమ్మాయిని పడేయాలనే కాన్సెప్ట్ ను అప్పట్లో ప్రేక్షకులు చాలా కొత్తగా ఫీలయ్యారు. పవన్ తన కాలర్ లోపల నుంచి మెడపైకి చేతులు పెట్టే మేనరిజమ్ కూడా ఈ సినిమా నుంచే స్టార్ట్ అయింది.