బాహుబలి - ది కంక్లూజన్ ట్రయిలర్ రివ్యూ

Thursday,March 16,2017 - 10:39 by Z_CLU

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఈ వేసవితో ముగియనుంది. దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాహుబలి ది కంక్లూజన్ మూవీ థియేటర్లలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. బాహుబలి పార్ట్-2 ట్రయిలర్ లాంఛ్ తో ఈ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన బాహుబలి-2 సినిమా, ఇప్పుడు ట్రయిలర్ తో ఆ అంచనాల్ని ఇంకాస్త పెంచింది.

తాజాగా విడుదలైన బాహుబలి ది కంక్లూజన్ ట్రయిలర్ అందర్నీ విపరీతంగా ఎట్రాక్ట్ చేస్తోంది. దర్శకుడు రాజమౌళి టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నటీనటుల ఎక్స్ ప్రెషన్స్.. ఇలా అన్నింటినీ పర్ ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ రిలీజైంది బాహుబలి ది కంక్లూజన్ ట్రయిలర్.

పార్ట్-1 ఇప్పటికే అంతా చూసేశారు కాబట్టి లుక్ పరంగా పార్ట్-2లో కొత్తదనం కనిపించదు. కాకపోతే, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఉత్సుకతను మాత్రం ఈ ట్రయిలర్ మరింత పెంచింది. ఎందుకంటే… “నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా” అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ను ట్రయిలర్ లో పెట్టి టెన్షన్ ను మరింత పెంచేశారు.

ఇక మ్యూజిక్ విషయానికొస్తే, కీరవాణి మరోసారి తన మార్క్ చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేశారు. రాజుల సినిమా కదా, సంగీతం ట్రెడిషనల్ గా ఉండాలేమో అనే నియమాల్ని పక్కనపెట్టి… విజువల్స్, గ్రాఫిక్స్ కు తగ్గట్టు కీరవాణి కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సింప్లీ సూపర్బ్. ఓవరాల్ గా ట్రయిలర్ తో బాహుబలి ది కంక్లూజన్ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి.