బాహుబలి-2 - ది సౌత్ సెన్సేషన్

Saturday,April 29,2017 - 01:35 by Z_CLU

సౌత్ లో కేవలం కొందరు హీరోలవి మాత్రమే ఓవరాల్ గా ఆడుతాయి. రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్ లాంటి నటుల సినిమాలకు సౌత్ మొత్తం రీచ్ ఉంది. ఇప్పుడీ హీరోల సినిమాల్ని క్రాస్ చేసింది బాహుబలి-2 మూవీ. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో బాహుబలి-2 సినిమా సంచలనాలు ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

కేరళలో బాహుబలి-2 సినిమా రజనీకాంత్ మేనియాను దాటిపోయింది. ఇతర హీరోల సినిమాలకు సంబంధించి ఇప్పటివరకు కేరళలో రజనీకాంత్ దే రికార్డు. సూపర్ స్టార్ నటించిన కబాలి సినిమా కేరళలో 304 థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడీ రికార్డును బాహుబలి-2 అధిగమించింది. కేరళ రాష్ట్రంలో ఏకంగా 320థియేటర్లలో బాహుబలి-2 సినిమా విడుదలైంది. ఫస్ట్ డే వసూళ్లు కూడా కబాలి సినిమా ఫస్ట్ డే కలెక్షన్లను దాటిపోయాయి.

ఇక తమిళనాడులో లేట్ గా విడుదలైనప్పటికీ లేటెస్ట్ గా రికార్డులు సృష్టిస్తోంది బాహుబలి-2 సినిమా. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మధ్య ఏర్పడిన డెడ్-లాక్ కారణంగా తమిళనాట బాహుబలి-2 ఆలస్యంగా విడుదలైంది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. తమిళనాట బాహుబలి-2 సినిమాకు ఫస్ట్ డే 11 కోట్ల రూపాయలు వచ్చాయి. ఓ తెలుగు సినిమాకు కోలీవుడ్ లో మొదటి రోజు ఇన్ని వసూళ్లు రావడం రికార్డు.

ఇక కర్ణాటకలో కూడా బాహుబలి-2 సంచలనాలు కొనసాగుతున్నాయి. ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా హంగామా అక్కడ మొదలైంది. కర్ణాటకలో టిక్కెట్ ధరలపై క్యాప్ అమల్లో ఉన్నప్పటికీ బాహుబలి-2 సినిమాను అత్యథిక థియేటర్లలో విడుదల చేసి కళ్లుచెదిరే కలెక్షన్లు రాబడుతున్నారు. ఇలా టోటల్ సౌత్ లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది బాహుబలి-2.