బాహుబలి-2 సినిమా నుంచి మరో అరుదైన రికార్డు

Thursday,June 29,2017 - 07:02 by Z_CLU

ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది బాహుబలి-2 ది కంక్లూజన్ సినిమా. వసూళ్ల పరంగా ఇండియాలోనే సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ మూవీ… సోషల్ మీడియాలో కూడా ఎవరికీ అందని సంచలనాలు నమోదు చేసింది. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ కు 150 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే ఏకంగా 15 కోట్ల మంది ఈ ట్రయిలర్ ను చూశారన్నమాట. ఓ తెలుగు సినిమాకు యూట్యూబ్ లో ఇన్ని వ్యూస్ రావడం ఓ చరిత్ర.

సాధారణంగా సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ట్రయిలర్ ను ఎవరూ పట్టించుకోరు. అది సర్వ సాధారణం. అలాంటిది బాహుబలి-2 సినిమా థియేటర్లలోకి వచ్చి 50 రోజులు కంప్లీట్ అయినప్పటికీ.. ఇప్పటికీ ట్రయిలర్ కు వ్యూస్ వస్తుండడం విశేషం. కేవలం ఇండియాలోనే కాకుండా.. రష్యా, రొమేనియా, అబుదాబి, జర్మనీ, శ్రీలంక లాంటి దేశాల నుంచి ఈ ట్రయిలర్ కు రికార్డు వ్యూస్ నమోదవుతున్నాయి.

 

ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. రేపట్నుంచి తైవాన్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. త్వరలోనే చైనాలో ఈ సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. చైనాలో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయితే.. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచిన దంగల్ ను బాహుబలి-2 క్రాస్ చేస్తుంది.