బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న ఎవెంజర్స్

Monday,May 06,2019 - 01:52 by Z_CLU

భారీ అంచనాల మధ్య విడుదలైన ఎవెంజర్స్ – ఎండ్ గేమ్ సినిమా వరల్డ్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం రెండో వారంలోకి ఎంటరైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డు సృష్టించింది.

నిన్నటివరకు ఈ స్థానంలో టైటానిక్ మూవీ ఉండేది. 2.187 బిలియన్ డాలర్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉన్న ఈ సినిమాను, కేవలం 11 రోజుల వసూళ్లతో ఎవెంజర్స్-ఎండ్ గేమ్ అధిగమించింది. అంతేకాదు, అతి తక్కువ రోజుల్లో 2 బిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా కూడా రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఎవెంజర్స్-ఎండ్ గేమ్ టార్గెట్ ఒకటే. అదే అవతార్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇది. 2.78 బిలియన్ డాలర్ల వసూళ్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది అవతార్. మరో వారం రోజుల పాటు ఎవెంజర్స్ ఇదే ఊపును కొనసాగిస్తే అవతార్ ను కూడా అధిగమించి నంబర్ వన్ అనిపించుకుంటుంది.

ఇటు ఇండియాలో కూడా ఎండ్ గేమ్ సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ లో 300 కోట్ల క్లబ్ లో చేరిన మొట్టమొదటి హాలీవుడ్ సినిమాగా ఎండ్ గేమ్ రికార్డు సృష్టించింది.